అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నారు. పనులు పూర్తవుతున్నాయి..ప్రొఫెసర్లు వచ్చేస్తున్నారంటూ హడావుడి చేశారు. కోట్లాది రూపాయల నిధులు మంజూరవుతున్నాయంటూ గొప్పలు చెప్పారు. ఈ ఏడాది నుంచే వైద్య కళాశాల తరగతులు ప్రారంభమవుతున్నాయని చిలుక పలుకులు పలికారు. తీరా ‘ఎక్కడున్నావు కంబళీ అంటే, వేసిన చోటే ఉన్నాను గొంగళీ అన్నదట’ అనే సామెత చందాన తయాైరె ంది నెల్లూరులో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిస్థితి.
సాక్షి, నెల్లూరు : నిధుల మంజూరులో జాప్యంతో పనులు నత్తనడకన సాగుతుండడంతో ఈ ఏడాది కళాశాల ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అప్పట్లో అధికారంలో ఉన్న ఆనం వారి హడావుడి చూసి ఇక్కడే సీట్లు పొందవచ్చని ఊహల్లో తేలిన విద్యార్థులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు.
రెండేళ్ల క్రితం కళాశాల మంజూరు : నెల్లూరుకు ప్రభుత్వ వైద్యకళాశాలను మంజూరు చేస్తూ 2012లో జీఓ విడుదలైంది. నగరంలోని డీఎస్సార్ ఆస్పత్రి ఆవరణలో ఉన్న 60 ఎకరాల స్థలంలో రూ.362 కోట్లు వెచ్చించి కళాశాల నిర్మించాలని నిర్ణయించారు. ఎస్‌ఎస్ కన్సల్టెంట్స్ రూపొందించిన కళాశాల నమూనాతో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆర్భాటంగా సమావేశం నిర్వహించి నిర్మాణ తీరుతెన్నులను వివరించారు. మొదట 150 సీట్లతో ప్రారంభించి భవిష్యత్తులో 260 సీట్లకు పెంచాలని నిర్ణయించినట్లు గొప్పలు చెప్పారు. కానీ ఇప్పటి వరకు కేవలం రూ.80 కోట్ల మేర మాత్రమే పనులు జరిగాయి.
పూర్తికాని పనులు : వైద్య విద్యార్థులకు మొదటి సంవత్సరంలో అనాటమి, ఫిజియాలజి, బయోకెమిస్ట్రీ సబ్జెక్టులుంటాయి. అనాటమికి థియేటర్, మిగిలిన వాటికి ల్యాబ్‌లు తప్పనిసరి. ఒక్కో విభాగానికి ఒక ప్రొఫెసర్, ముగ్గురు అసోసియేట్ ప్రొఫెసర్లు, ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పది మంది ట్యూటర్లు అవసరమవుతారు. వీరితో పాటు బోధనేతర సిబ్బంది సరేసరి. ఈ క్రమంలో వందలాది మంది నియామకం జరగాల్సి ఉంది. ఇవన్నీ కావాలంటే ముందు కళాశాల భవన నిర్మాణం పూర్తవడం తప్పనిసరి. నిబంధనల మేరకు కళాశాల నిర్మాణం పూర్తయి, మౌలిక వసతులతో పాటు ఆధునిక వైద్యపరికరాలతో పాటు అన్ని సౌకర్యాలు ఉన్నాయని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం సంతృప్తి వ్యక్తం చేస్తేనే సీట్లు మంజూరు చేస్తారు. వీటిలో చాలా పనులు జరగకపోవడంతో ఈ ఏడాదికి ఆ బృందం పర్యటన వాయిదా పడినట్టేనని తెలుస్తోంది. మరోవైపు ఇంకా సుమారు రూ.280 కోట్లతో పనులు చేయాల్సిన పరిస్థితి. ఇవన్నీ ఈ ఏడాదికి కాదు కదా వచ్చే ఏడాదికి కూడా పూర్తయ్యేలా లేవు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడితే పనులు త్వరితగతిన పూర్తైవచ్చే ఏడాదైనా కళాశాల ప్రారంభమయ్యే అవకాశముంది.
ఈ ఏడాదికి లేనట్టే : వైద్య కళాశాల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి 2013-14 విద్యాసంవత్సరానికే కళాశాలను ప్రారంభిస్తామని అప్పట్లో మంత్రిగా వ్యవహరించిన ఆనం రామనారాయణరెడ్డి ప్రకటించారు. మాటలకే పరిమితైన ఆయన నిధుల విడుదలలో జాప్యం చేశారనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం పరిపాలనా భవనం, సిబ్బంది, విద్యార్థుల వసతిగృహాల భవనాల నిర్మాణం జరుగుతోంది. ఇక పలు రకాల వసతులు కల్పించడంతో పాటు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సిబ్బంది నియామకం చేపట్టాలి. అంతా సవ్యంగా సాగివుంటే ఈ నెలలోనే ఎంసీఐ బృందం కళాశాల సందర్శనకు రావాల్సివుంది.
అయితే ఆ బృందం పర్యటనను వాయిదా వేయించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ నెల 20న లేఖ రాశారు. రాష్ట్ర విభజనతో పాటు ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిర్మాణాలు పూర్తి చేయలేకపోయామని, పరికరాల ఏర్పాటు, సిబ్బంది నియామకాలు చేపట్టలేదని అందులో పేర్కొన్నారు. దీంతో ఈ ఏడాది కొత్తగా 150 సీట్లు వస్తాయని విద్యార్థులు పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. నెల్లూరుకు ప్రభుత్వ వైద్యకళాశాల వచ్చినా రెండేళ్లుగా నిర్మాణంలోనే ఉండడంతో విద్యార్థులు నష్టపోతున్నారు.
ఈసారీ ప్రవేశాల్లేవ్..!
Published Thu, May 22 2014 2:14 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement