ఎస్వీబీసీ చైర్మన్‌ పదవికి పృథ్వీ రాజీనామా | Prudhvi Raj Resigns From SVBC Chairman Post | Sakshi
Sakshi News home page

ఎస్వీబీసీ చైర్మన్‌ పదవికి పృథ్వీ రాజీనామా

Published Sun, Jan 12 2020 8:08 PM | Last Updated on Sun, Jan 12 2020 9:55 PM

Prudhvi Raj Resigns From SVBC Chairman Post - Sakshi

సాక్షి, తిరుపతి/హైదరాబాద్‌ : టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్‌ చైర్మన్‌ పదవికి పృథ్వీరాజ్ రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధాంతాన్ని గౌరవిస్తూ ఎస్వీబీసీ చైర్మన్‌ పదవికి రాజీనామ చేస్తున్నట్టు పృథ్వీ ప్రకటించారు. ఒక మహిళతో పృథ్వీ అసభ్యంగా మాట్లాడినట్టు కొన్ని ప్రసార మాధ్యమాల్లో ఆడియో ప్రసారాలు జరగడంతో.. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి విజిలెన్స్‌ విచారణకు ఆదేశించారు. దీంతో ఆడియో టేపుల్లోని వాయిస్‌ శాంపిల్‌ను టీటీడీ విజిలెన్స్‌ అధికారులు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు  పంపించారు. అలాగే ఈ అంశాన్ని వైవీ సుబ్బారెడ్డి సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీంతో పృథ్వీని రాజీనామా చేయాల్సిందిగా సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించినట్టుగా తెలిసింది.

అయితే ఈ క్రమంలో తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన పృథ్వీ.. తాను ఎటువంటి విచారణకైన సిద్దమేనని స్పష్టం చేశారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం. ఆ ఆరోపణలపై టీటీడీ విజిలెన్స్‌ అధికారులతో విచారణ జరిపించాలని కోరాను. నేను ఎస్వీబీసీ చైర్మన్‌గా 2019 జూలై 28న ప్రమాణం స్వీకారం చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు.

ప్రక్షాళన దిశగా ఎస్వీబీసీ కోసం పనిచేశాను. తిరుపతిలో ఉన్నప్పుడు రాజకీయాల గురించి మాట్లాడానని అన్నారు. ఇదంతా చూస్తుంటే నన్ను దెబ్బతీయడం కోసమే.. ఈ కుట్రలు చేసినట్టు ఉంది. పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాను. రైతులందరినీ పెయిడ్‌ ఆర్టిస్టులు అనలేదు. అన్నం పెట్టే రైతుని నేను పెయిడ్‌ ఆర్టిస్టులు అనలేదు.  కార్పొరేటు ముసుగులో ఉన్నవారి గురించి మాట్లాడితే అంత కోపం ఎందుకు?. అసలైన రైతులు నా మాటల వల్ల బాధపడితే వారికి క్షమాపణలు చెప్తున్నా. నామీద కుట్రలు చేస్తున్నారని కొందరు మీడియా మిత్రులు చెప్పారు. నకిలీ  వాయిస్‌ పెట్టి నాపై దుష్ప్రచారం చేశారు.మేకప్‌మేన్‌ వెంకట్‌రెడ్డి ప్రవర్తన సరిగా లేదని.. హైదరాబాద్‌ ఆఫీస్‌లో పనిచేయమని చెప్పాను. దీంతో వరదరాజులు అనే వ్యక్తితో కలిసి అసత్య ప్రచారం చేశారు.

నా వ్యక్తి గత ప్రతిష్టను దెబ్బకొట్టినందుకు బాధ కలుగుతోంది. పార్టీ సిద్దాంతాన్ని గౌరవిస్తూ రాజీనామా చేస్తున్నాను. కాంట్రాక్టు ఉద్యోగుల నియామకంలో నా ప్రమేయం లేదు. విజిలెన్స్‌ రిపోర్ట్‌ వచ్చాక వాస్తవాలు తెలుస్తాయి. మహిళతో మాట్లాడింది నేను కాదు. నా గొంతును ఎవరో మిమిక్రీ చేశారు. ఈ ఘటనపై పోలీసులుకు ఫిర్యాదు చేశాను. ఏ ఉద్యోగి కూడా నాపై వేరే ఉద్దేశం లేదు. నేను మద్యం మానేసి చాలా కాలం అయింది. పద్మావతి అమ్మవారి పవిత్ర స్థలంలో మందు తాగుతున్నానని చెడు ప్రచారం చేశారు. వైద్యులతో నాకు పరీక్షలు చేసినా సిద్దమే. ఎస్వీబీసీ చానల్‌ నిధులు ఒక్క రూపాయి కూడా తినలేదు. నాపై దుష్ప్రచారం చేయడంతో మా కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. నాపై దుష్ప్రచారం చేసినవారికి సవాలు విసురుతున్నాను. నేను ఏ పరీక్షకైనా సిద్దంగా ఉన్నాను. నాపై వచ్చిన అపవాదులు తొలగిపోయాక మళ్లీ బాధ్యతలు తీసుకుంటాను. నా రాజీనామాను ఫ్యాక్సులో పంపించాను. ఇక పదో తేదీ నాపై దాడి జరిగింది. కొందరు వ్యక్తులు నా మొహంపై పిడిగుద్దలు గుద్ది పారిపోయారు. ’ అని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement