నెల్లూరు(టౌన్): పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో అట్టడుగు స్థాయికి పతనమైంది. గతేడాది నాలుగో స్థానాన్ని చేజిక్కించుకున్న జిల్లా ఈ ఏడాది క్షీణించి రాష్ట్రంలో చివరి స్థానంలో నిలచింది. రాష్ట్రంలో ప్రకాశం జిల్లా 97.93 శాతం ఫలితాలతో ప్రథమ స్థానంలో నిలవగా 80.37 శాతం సాధించి నెల్లూరు జిల్లా చివరి స్థానానికి చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా పది పరీక్షలకు మొత్తం 32,854 మంది హాజరయ్యారు. వీరిలో 26,404 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 16,964 మంది హాజరు కాగా 13,570 మంది ఉత్తీర్ణులై 79.99 ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 15,890 మంది హాజరు కాగా 12,834 మంది పాసై 80.77 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలుర కంటే బాలికలు 0.78 శాతం అధికంగా ఉత్తీర్ణత పొందారు.
1001 మందికి పదికి పది జీపీఏ
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కలిపి 1001 మంది 10కి 10 జీపీఏ సాధించారు. గతేడాది 1008 మంది పదికి పది జీపీఏ సాధించారు. ఈ దఫా ఉత్తీర్ణత శాతం, జీపీఏ తగ్గినా కేవలం నాణ్యత మీద దృష్టి సారించడంతోనే ఈ ఫలితాలు వచ్చాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కేఎన్నాఆర్ మున్సిపల్ స్కూల్‌లో ఆర్.హరిచందన, ఇ. జాషువాహడ్‌సన్‌కు 10కి10 పాయింట్లు వచ్చాయి.
ప్రభుత్వ సెక్టార్ పాఠశాలల్లో 40 మందికి 10 జీపీఏ
ప్రభుత్వ సెక్టార్‌ల్లోని పాఠశాలల్లో చదువుతున్న 40 మంది విద్యార్థులు 10కి10 జీపీఏ సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నలుగురు, మున్సిపాలిటీ స్కూల్స్‌లో ఏడుగురు, ఏపీ మోడల్స్ స్కూల్స్‌లో ఐదుగురు, ఏపీ రెసిడెన్షియల్స్ స్కూల్స్‌లో ఇద్దరు, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ స్కూల్స్‌లో ఒకరు, జిల్లా పరిషత్ హైస్కూల్స్‌లో 21 మంది 10కి 10 జీపీఏ సాధించారు.
ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యం
తండ్రి వెంకటేశ్వర్లు బియ్యం వ్యాపారి. తల్లి కవిత గృహిణి. కేఎన్నార్ మున్సిపల్ స్కూల్‌లో 10వ తరగతి చదివి పది ఫలితాల్లో 10కి10 జీపీఏ సాధించడం గర్వంగా ఉంది. ఇంటర్‌లో మంచి మార్కులు సాధించిన జేఈఈ అడ్వాన్స్‌లో ర్యాంక్ సాధించి ఐఐటీలో సీటు సాధించాలన్నదే లక్ష్యం.– ఆర్ హరిచందన, నెల్లూరు, బంగ్లాతోట
Comments
Please login to add a commentAdd a comment