సైకో ఎదురింటి మహిళపై హత్యాయత్నం | psyco attempetd murder against a lady | Sakshi
Sakshi News home page

సైకో ఎదురింటి మహిళపై హత్యాయత్నం

Published Sun, Sep 15 2013 12:38 AM | Last Updated on Mon, Oct 8 2018 3:08 PM

psyco attempetd murder against a lady


 జవహర్‌నగర్, న్యూస్‌లైన్: ఓ మానసిక రోగి ఎదురింటి మహిళపై హత్యాయత్నం చేశాడు. ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశాడు. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన జవహర్‌నగర్‌లోని అంబేద్కర్‌నగర్‌లో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని గ ట్ల నర్సింగపురం గ్రామానికి చెందిన మాడుగుల సురేందర్(35) బతుకుదెరువుకోసం 15 ఏళ్ల క్రితం జవహర్‌నగర్‌కు వలస వచ్చాడు. స్థానికంగా కూలిపనులు చేస్తున్నాడు. ఇతడికి తల్లిదండ్రులతో పాటు ఇద్దరు అక్కలు, అన్నలు స్వామి, విజయ్ ఉన్నారు. సురేందర్‌కు కుటుంబీకులతో సరిగా సంబంధాలు లేవు. ఇతడి చేష్టలకు విసిగిపోయిన భార్య వెళ్లిపోయింది.
 
  అనంతరం రెండో వివాహం చేసుకున్నాడు. ‘సైకో’ ప్రవర్తనకు నెలరోజులకే రెండో భార్య కూడా పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో సురేందర్ అంబేద్కర్‌నగర్ చౌరస్తాకు సమీపంలో ఓ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఆరు నెలలుగా ఇతడు స్థానిక మహిళలను వేధించసాగాడు. పొరుగున ఉండే బాలికలు నిత్యం పాఠశాలకు వెళ్లే సమయంలో వెకిలి చేష్టలతో ఇబ్బందిపెట్టేవాడు. ఈవిషయాన్ని స్థానికులు పలుమార్లు సురేందర్ అన్న విజయ్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన మందలించాడు. అయినా సురేందర్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఈక్రమంలో శనివారం పొరుగింటి మహిళ కూరగాయలు కొనుగోలు చేసి ఇంట్లోకి వెళ్తోంది. సురేందర్ ఓ బకెట్‌లో దాదాపు 5 లీటర్ల కిరోసిన్ తీసుకొచ్చి వచ్చి ఆమెపై పోసి నిప్పంటించబోయాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు విషయం గమనించి అతడిని పట్టుకునేందుకు యత్నించగా తప్పించుకొని పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న అల్వాల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హఠాత్పరిణామంతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలిని ఈసీఐఎల్‌లోని రాఘవేంద్ర ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు ఎస్‌ఐ రాములు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement