PHSYCO
-
శివుడంటే ఇష్టం అందుకే పుర్రెకు పూజలు..
పాతపోస్టాఫీసు (విశాఖ): స్థానిక పాతనగరం రెల్లివీధిలోని ఓ ఇంట్లో ఆదివారం ఉదయం ఓ పుర్రె ప్రత్యక్షమై స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. స్థానికులు, వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దిగువరెల్లివీధి రాంనాథ్ హోటల్‌కు పక్క సందులో రెండు గదుల రేకుల ఇంట్లో రావులపూడి రాజు (20) అనే యువకుడు ఒంటరిగా నివసిస్తున్నాడు. ఐదేళ్ల క్రితం తండ్రి రావులపూడి శ్యాం (50) అనారోగ్యంతో మరణించాడు. అప్పటి నుంచి చెడు వ్యసనాలకు లోనై చిల్లరదొంగతనాలకు పాల్పడడంతో పాటు గంజాయి, మత్తుమందులకు అలవాటుపడి ఇష్టానుసారం ప్రవర్తించడం మొదలుపెట్టాడు. పదో తరగతి వరకు చదివి మధ్యలోనే ఆపేసిన కొడుకు ప్రవర్తన నచ్చకపోవడంతో తల్లి రావులపూడి యలమాజి (48) పీఎంపాలెం, వాంబేకాలనీకి వెళ్లిపోయి అక్కడ నివసిస్తోంది. రాజు అక్క కరుణకు వివాహం కావడంతో భర్తతో నగర శివార్లలో ఉంటోంది. కుటుంబ సభ్యులు లేకపోవడంతో విచ్చలవిడితనానికి అలవాటు పడ్డ రాజు మత్తుమందుకు బానిసగా మారాడు. అతడి ప్రవర్తనకు సంబంధించి పలు స్టేషన్లలో కేసులు నమోదైనట్టు సమాచారం. రాజు ఆదివారం ఉదయం ప్లాస్టిక్ కవర్లో చుట్టిన పుర్రెను తాను నివాసం ఉంటున్న ఇంటి సందులో ఉంచాడు. (సైకో యువకుడు: మనిషి పుర్రెను..) నిందితుడ్ని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు సందును ఆనుకుని ఉన్న ఇంట్లో నివాసం ఉంటున్న సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఉదయం 8.30 ప్రాంతంలో సందులో ఉన్న ప్లాస్టిక్ కవర్ నుంచి దుర్వాసన రావడంతో ఇంటి నుంచి వెలుపలికి వచ్చి కవర్‌ను కదలించడంతో అందులో నుంచి పుర్రె వెలుపలికి వచ్చింది. దీంతో పెద్దగా కేకలు వేయడంతో రాజు వచ్చి పుర్రెతో సహా ప్లాస్టిక్ కవర్‌ను ఇంట్లోకి తీసుకువెళ్లిపోయాడు. స్థానికులు విషయాన్ని పోలీసులకు చేరవేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ సమయానికి అదే ఇంట్లో ఉన్న ఓ బాలిక (మైనర్)ను పోలీసులు స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. మరికొద్ది సేపటిలో ఇంటికి చేరుకున్న రాజును పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఆంధ్ర వైద్య కళాశాల అనాటమీ విభాగంలో వైద్య విద్యార్థులు పరిశోధనలు జరిపిన ఓ వ్యక్తి పుర్రెగా పోలీసులు గుర్తించారు. అనాటమీ విభాగం వద్ద పరిశోధనలు పూర్తయిన శరీరాలను వేసే ప్రదేశం నుంచి దాన్ని తీసుకువచ్చినట్టు తెలుసుకున్నారు. పుర్రె ను 14 రో జుల క్రిత మే రాజు తీసుకువ చ్చి ఇంట్లో ఉంచి పూ జలు చేస్తున్నాడు. తనకు శివుడు అత్యంత ప్రీతపాత్రమైన దేవుడని, పుర్రెను పూజిస్తే మంచి జరుగుతుందని ఎవరో చెప్పడంతో ఈ విధంగా చేస్తున్నానని, పుర్రెను కాల్చుకు తినలేదని రాజు పోలీసుల విచారణలో తెలిపాడు. రాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు పుర్రెను స్వాధీనం చేసుకుని, బాలికను విడిచిపెట్టారు. వన్‌టౌన్ సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని, ఎస్ఐ శ్రీనివాస్ బృందం దర్యాప్తు చేపట్టింది. నిందితుడిని సోమవారం న్యాయస్థానంలో హాజరుపరచుతామని ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. -
మహిళ దారుణ హత్య : సైకో కిల్లర్ అరెస్టు
సాక్షి, మెదక్: మహిళను హత్య చేసి.. తగలబెట్టిన ఓ సైకో కిల్లర్‌ను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట్ మండలంలో కొద్దిరోజుల క్రితం ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. హత్య చేసిన అనంతరం ఆమె మృతదేహాన్ని తగులబెట్టారు. ఈ దారుణానికి ఒడిగట్టిన సైకో కిల్లర్ నీరటి అరుణ్‌ను రామాయంపేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై హైదరాబాద్ తిరుమలగిరి, ఆర్మూర్ ప్రాంతాల్లో పలు హత్య కేసులు ఉన్నాయి. నిజాంబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని పెద్దపల్లి గ్రామానికి చెందిన అరుణ్‌పై ఇప్పటివరకు ఐదు కేసులు నమోదయ్యాయని పోలీసులు గుర్తించారు. -
అతడు సైకో కిల్లర్
తిరుపతి లీగల్ / చిత్తూరు అర్బన్: అతనో నరరూప రాక్షసుడు. ఊరి శివార్లలో కాపురముంటూ ఒంటరిగా ఉన్న మహిళల్ని చంపుతూ పైశాచిక ఆనందం పొందే మానసిక ఉన్మాది. అతనే తమిళనాడులోని వాలాజా సమీపంలో ఉన్న మాన్తంగాళ్కు చెందిన సీరియల్ సైకో కిల్లర్ మునుస్వామి (43). గతేడాది నగరిలో జరిగిన రత్నమ్మ (62) అనే మహిళ హత్య కేసులో తిరుపతిలోని 10వ అదనపు జిల్లా, సెషన్స్ న్యాయస్థానం నిందితుడికి జీవితఖైదు విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి అన్వర్భాష సోమవారం తీర్పునిచ్చారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శాఖమూరి ఆదినారాయణ కథనం మేరకు.. గతేడాది ఫిబ్రవరి 25వ తేదీన నగరి మండలం వీకేఆర్ పురం గ్రామ శివారుల్లో ఒంటరి ఇంట్లో కాపురమున్న కె.రత్నమ్మ (62) హత్యకు గురైంది. బండరాయితో తలపై కొట్టి ఈమెను చంపేశారు. అదే ఏడాది మార్చి 9వ తేదీ పాలసముద్రం మండలం గంగమాంబపురం పంచాయతీలోని అబ్బిరాజుకండ్రిగకు చెందిన ఎస్.వళ్లెమ్మ (60) సైతం హత్యకు గురయ్యారు. ఈమెను కూడా రాయితో నుదిపై కొట్టి చంపేశారు. మృతుల వద్ద ఉన్న ఫోన్లు, ఓ ఇంట్లో ఉన్న వెండిపాత్రను దొంగ చోరీ చేశాడు. ఈ రెండు హత్య కేసులు జిల్లాలో సంచలనం సృష్టించాయి. హత్య జరిగిన తరువాత మృతదేహాలను కొరకడం, వివస్త్రను చేయడం, హత్యకు బండరాయి ఉపయోగించడం లాంటివి సమీప గ్రామాల్లోని ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేశాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు నిద్రమానేసి రాత్రులు గస్తీలు కాశారు. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న అప్పటి ఎస్పీ రాజశేఖర్‌బాబు.. నిందితుడ్ని పట్టుకోవడానికి ఓ ప్రత్యేక బృందాన్ని నియమించారు. చిత్తూరు క్రైమ్ డీఎస్పీ రామకృష్ణతో పాటు, పశ్చిమ సీఐ ఆదినారాయణలు నిందితుడ్ని పట్టుకోవడానికి రంగంలోకి దిగారు. హత్యలు జరిగిన ప్రదేశాల్లో దొరికిన వేలిముద్రలు, హత్యల తరువాత ఓ చోట నిందితుడి సీసీ ఫుటేజీ దొరకడంతో దాదాపు నెలరోజుల పాటు జిల్లాలోని పశ్చిమ మండలాలు, తమిళనాడులోని ఆరు జిల్లాల్లో నిందితుడి కోసం గాలించారు. చివరకు షోలింగర్ పోలీస్ స్టేషన్లో మునుస్వామి వేలిముద్రలు ఉండటంతో సొంత గ్రామంలో చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో ఇతను ఆంధ్ర, తమిళనాడుల్లో ఆరుగురు మహిళల్ని చంపడంతో పాటు ఇద్దరిపై హత్యాయత్నం కూడా చేసినట్లు వెల్లడయ్యింది. నిందితుడ్ని పట్టుకోకుంటే మరిన్ని హత్యలు జరిగేవని పోలసులు చెబుతున్నారు. అయిదు హత్యలను నిందితుడు శుక్రవారం రోజునే చేయడం కొసమెరుపు. వృద్ధ మహిళల్ని చంపి శరీర భాగాలను కొరికి రాక్షసానందం పొందేవాడు. పాలసముద్రంలో జరిగిన మహిళ హత్య కేసు చిత్తూరులోని 8వ అదనపు జిల్లా కోర్టులో విచారణ జరుగుతోంది. త్వరలోనే ఈ కేసులో న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. -
ప్రేమోన్మాది ఘాతుకం
ప్రేమోన్మాది వేధింపులకు భయపడి యువతి ఉద్యోగం మానేసి ఇంటికి పరిమితమైనా ఆ మృగాడు వదలలేదు. ఇంటికి వచ్చి హత్యాయత్నానికి తెగబడ్డాడు. గుంటూరు రూరల్ మండలం జొన్నలగడ్డలో జరిగిన ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. గాయపడిన యువతి జీజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ప్రేమోన్మాది పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. గుంటూరు ఈస్ట్: వేధింపులకు భయపడి యువతి ఉద్యోగం మానేసి ఇంటికి పరిమితమైనా వెంటాడి మరీ హత్యాయత్నానికి తెగబడ్డాడు ఓ ఉన్మాది. ప్రేమ ముసుగులో ఉన్మాదిగా మారి యువతిని కత్తితో పొడిచి తర్వాత తనను తాను గాయపరుచున్నాడు. గుంటూరు రూరల్ మండలం జొన్నలగడ్డలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడ్డ యువతి జీజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. జొన్నలగడ్డలో నివసించే పుప్పాల సాంబయ్య, సామ్రాజ్యం దంపతుల మూడో కుమార్తె దివ్య డిగ్రీ పూర్తి చేసింది. గుంటూరు అరండల్‌పేటలోని ఓ ప్రైవేటు మార్కెటింగ్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా కొన్ని నెలలు పనిచేసింది. అదే సమయంలో మాచర్లకు చెందిన బాలాజీనాయక్ అనే యువకుడు దివ్య వద్ద అసిస్టెంట్ సేల్స్ ప్రమోటర్‌గా పనిచేశాడు. తనను ప్రేమించమంటూ వెంట పడ్డాడు. అతని వేధింపులకు భయపడిన దివ్య ఉద్యోగం మానేసి కొద్ది రోజులుగా ఇంటి వద్దే ఉంటోంది. బుధవారం దివ్య ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో బాలాజీ నాయక్ ఆమె వద్దకు వచ్చాడు. తనను ప్రేమించి పెళ్లికి ఒప్పుకోవాలంటూ ఒత్తిడి చేశాడు. దివ్య నిరాకరించడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె పొట్టలో పొడిచాడు. మళ్లీ పొడిచే ప్రయత్నం చేయగా దివ్య పెద్దగా కేకలు వేస్తూ చేతులు అడ్డం పెట్టడంతో చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. దివ్య తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడిపోవడంతో.. ఇంట్లో ఉన్న కుక్కర్ మూతతో బాలాజీనాయక్ తనను తాను తలపై కొట్టుకుని గాయపరుచుకున్నాడు. అలజడికి అక్కడికి చేరుకున్న స్థానికులు వారిద్దరినీ జీజీహెచ్‌కు తరలించారు. వైద్యులు చికిత్స అందించారు. దివ్య ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉన్నా, ప్రాణాపాయం లేదని తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
కాపురానికి రాలేదని...
భార్యపై సైకో భర్త దాడి.. ఆపై ఆత్మహత్యాయత్నం సోంపేట మార్కెట్లో సంచలనం సోంపేట : సోంపేట పట్టణంలోని కూరగాయల మార్కెట్ (బజారు)లో మంగళవారం పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ ప్రబుద్ధుడు భార్యపై దాడిచేశాడు. బ్లేడుతో ఆమె పీకను కోయడమే కాకుండా తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన మార్కెట్ వ్యాపారులు, ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేశారు. సోంపేట పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... బీన పద్మ (23), బీన శ్రీనివాసరావు (27)భార్య భర్తలు. కంచిలి మండలం పెద్ద శ్రీరాంపురం గ్రామానికి చెందిన పర్రి కేశవరావు, లోలమ్మ కుమార్తె పద్మను ఒడిశాలోని ఖుర్దా రోడ్డు చెందిన శ్రీనివాసరావుతో మూడేళ్ల క్రితం వివాహంచేశారు. శ్రీనివాసరావు పెళ్లినాటి నుంచి సైకోలా వ్యవహారిస్తూ హింసిస్తున్నాడని పద్మ తల్లిదండ్రులకు చెప్పుతూ ఉండేది. తల్లిదండ్రులు సర్దుకుపోమ్మంటూ సలహా ఇస్తూ ఉండేవారు. పద్మ గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఒకటి రెండు సార్లు శ్రీనివాసరావు చేయి చేసుకున్నాడని తల్లిదండ్రులు తెలిపారు. ఆరు నెలల క్రితం పద్మకు ఒక కుమారుడు పుట్టి చనిపోయాడు. అప్పటి నుంచి పద్మ కన్నవారి ఇంటి వ ద్దే ఉంటోంది. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావు పద్మను కాపురానికి రావాలని కోరగా, ఆమె ససేమిరా అంది. ఆపై, ఆమె భర్త హింసను తట్టుకోలేకపోతున్నానంటూ కంచిలి పోలీస్ స్టేషన్లో వారం క్రితం ఫిర్యాదు చేయడంతో శ్రీనివాసరావుపై గృహహింస చట్టంపై కేసు నమోదయింది. కంచిలి ఎస్ఐ వేణుగోపాలరావు అతడిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. దీంతో భార్యపై శ్రీనివాసరావు కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం పెద్ద శ్రీరాంపురం గ్రామం నుంచి పద్మ తన పిన్ని సంతోషితో కలసి సోంపేట మార్కెట్‌కు రాగా, శ్రీనివాసరావు వెళ్లి ఆమెతో ఘర్షణకు దిగాడు. తనవెంట తెచ్చుకున్న బ్లేడుతో పద్మ మెడపై, గెడ్డంపై దాడి చేశాడు. ఆపై అతడూ కంఠం పై బ్లేడుతో కోసుకున్నాడు. దీంతో మార్కెట్లో ఒక్కసారిగా అలజడి రేగింది. ఇద్దరినీ స్థానికులు సోంపేట సామాజిక ఆస్పత్రికి తరలించారు. సోంపేట సీఐ సూరినాయుడు భార్య, భర్తల వద్ద నుంచి వివరాలు సేకరించారు. సోంపేట ఇన్చార్జి ఎస్ఐ వేణుగోపాలరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సైకో ఎదురింటి మహిళపై హత్యాయత్నం
జవహర్‌నగర్, న్యూస్‌లైన్: ఓ మానసిక రోగి ఎదురింటి మహిళపై హత్యాయత్నం చేశాడు. ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశాడు. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన జవహర్‌నగర్‌లోని అంబేద్కర్‌నగర్‌లో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని గ ట్ల నర్సింగపురం గ్రామానికి చెందిన మాడుగుల సురేందర్(35) బతుకుదెరువుకోసం 15 ఏళ్ల క్రితం జవహర్‌నగర్‌కు వలస వచ్చాడు. స్థానికంగా కూలిపనులు చేస్తున్నాడు. ఇతడికి తల్లిదండ్రులతో పాటు ఇద్దరు అక్కలు, అన్నలు స్వామి, విజయ్ ఉన్నారు. సురేందర్‌కు కుటుంబీకులతో సరిగా సంబంధాలు లేవు. ఇతడి చేష్టలకు విసిగిపోయిన భార్య వెళ్లిపోయింది. అనంతరం రెండో వివాహం చేసుకున్నాడు. ‘సైకో’ ప్రవర్తనకు నెలరోజులకే రెండో భార్య కూడా పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో సురేందర్ అంబేద్కర్‌నగర్ చౌరస్తాకు సమీపంలో ఓ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఆరు నెలలుగా ఇతడు స్థానిక మహిళలను వేధించసాగాడు. పొరుగున ఉండే బాలికలు నిత్యం పాఠశాలకు వెళ్లే సమయంలో వెకిలి చేష్టలతో ఇబ్బందిపెట్టేవాడు. ఈవిషయాన్ని స్థానికులు పలుమార్లు సురేందర్ అన్న విజయ్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన మందలించాడు. అయినా సురేందర్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఈక్రమంలో శనివారం పొరుగింటి మహిళ కూరగాయలు కొనుగోలు చేసి ఇంట్లోకి వెళ్తోంది. సురేందర్ ఓ బకెట్లో దాదాపు 5 లీటర్ల కిరోసిన్ తీసుకొచ్చి వచ్చి ఆమెపై పోసి నిప్పంటించబోయాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు విషయం గమనించి అతడిని పట్టుకునేందుకు యత్నించగా తప్పించుకొని పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న అల్వాల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హఠాత్పరిణామంతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలిని ఈసీఐఎల్‌లోని రాఘవేంద్ర ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు ఎస్ఐ రాములు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.