మునుస్వామి రత్నమ్మ (ఫైల్) వళ్లెమ్మ (ఫైల్)
తిరుపతి లీగల్ / చిత్తూరు అర్బన్: అతనో నరరూప రాక్షసుడు. ఊరి శివార్లలో కాపురముంటూ ఒంటరిగా ఉన్న మహిళల్ని చంపుతూ పైశాచిక ఆనందం పొందే మానసిక ఉన్మాది. అతనే తమిళనాడులోని వాలాజా సమీపంలో ఉన్న మాన్‌తంగాళ్‌కు చెందిన సీరియల్ సైకో కిల్లర్ మునుస్వామి (43). గతేడాది నగరిలో జరిగిన రత్నమ్మ (62) అనే మహిళ హత్య కేసులో తిరుపతిలోని 10వ అదనపు జిల్లా, సెషన్స్ న్యాయస్థానం నిందితుడికి జీవితఖైదు విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి అన్వర్‌భాష సోమవారం తీర్పునిచ్చారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శాఖమూరి ఆదినారాయణ కథనం మేరకు.. గతేడాది ఫిబ్రవరి 25వ తేదీన నగరి మండలం వీకేఆర్ పురం గ్రామ శివారుల్లో ఒంటరి ఇంట్లో కాపురమున్న కె.రత్నమ్మ (62) హత్యకు గురైంది. బండరాయితో తలపై కొట్టి ఈమెను చంపేశారు. అదే ఏడాది మార్చి 9వ తేదీ పాలసముద్రం మండలం గంగమాంబపురం పంచాయతీలోని అబ్బిరాజుకండ్రిగకు చెందిన ఎస్.వళ్లెమ్మ (60) సైతం హత్యకు గురయ్యారు.
ఈమెను కూడా రాయితో నుదిపై కొట్టి చంపేశారు. మృతుల వద్ద ఉన్న ఫోన్లు, ఓ ఇంట్లో ఉన్న వెండిపాత్రను దొంగ చోరీ చేశాడు. ఈ రెండు హత్య కేసులు జిల్లాలో సంచలనం సృష్టించాయి. హత్య జరిగిన తరువాత మృతదేహాలను కొరకడం, వివస్త్రను చేయడం, హత్యకు బండరాయి ఉపయోగించడం లాంటివి సమీప గ్రామాల్లోని ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేశాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు నిద్రమానేసి రాత్రులు గస్తీలు కాశారు. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న అప్పటి ఎస్పీ రాజశేఖర్‌బాబు.. నిందితుడ్ని పట్టుకోవడానికి ఓ ప్రత్యేక బృందాన్ని నియమించారు. చిత్తూరు క్రైమ్ డీఎస్పీ రామకృష్ణతో పాటు, పశ్చిమ సీఐ ఆదినారాయణలు నిందితుడ్ని పట్టుకోవడానికి రంగంలోకి దిగారు.
హత్యలు జరిగిన ప్రదేశాల్లో దొరికిన వేలిముద్రలు, హత్యల తరువాత ఓ చోట నిందితుడి సీసీ ఫుటేజీ దొరకడంతో దాదాపు నెలరోజుల పాటు జిల్లాలోని పశ్చిమ మండలాలు, తమిళనాడులోని ఆరు జిల్లాల్లో నిందితుడి కోసం గాలించారు. చివరకు షోలింగర్ పోలీస్ స్టేషన్‌లో మునుస్వామి వేలిముద్రలు ఉండటంతో సొంత గ్రామంలో చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో ఇతను ఆంధ్ర, తమిళనాడుల్లో ఆరుగురు మహిళల్ని చంపడంతో పాటు ఇద్దరిపై హత్యాయత్నం కూడా చేసినట్లు వెల్లడయ్యింది. నిందితుడ్ని పట్టుకోకుంటే మరిన్ని హత్యలు జరిగేవని పోలసులు చెబుతున్నారు. అయిదు హత్యలను నిందితుడు శుక్రవారం రోజునే చేయడం కొసమెరుపు. వృద్ధ మహిళల్ని చంపి శరీర భాగాలను కొరికి రాక్షసానందం పొందేవాడు. పాలసముద్రంలో జరిగిన మహిళ హత్య కేసు చిత్తూరులోని 8వ అదనపు జిల్లా కోర్టులో విచారణ జరుగుతోంది. త్వరలోనే ఈ కేసులో న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది.
Comments
Please login to add a commentAdd a comment