జైలు నుంచి జనంలోకి.. | Public appearance since the prison .. | Sakshi
Sakshi News home page

జైలు నుంచి జనంలోకి..

Published Tue, Jan 26 2016 11:30 PM | Last Updated on Sun, Sep 3 2017 4:21 PM

జైలు నుంచి జనంలోకి..

జైలు నుంచి జనంలోకి..

క్షమాభిక్ష ఫలం.. 39 మంది ఖైదీలకు విముక్తి 
విశాఖ జైలు నుంచి 41 మంది విడుదలకు అనుమతి
పూచికత్తు కట్టలేక ఒకరు.. వేరే కేసులో శిక్షతో మరొకరు జైలులోనే
బంధువుల పరామర్శలు.. ఆత్మీయ పలకరింపులు
జైలు బయట ఉద్విగ్న వాతావరణం

 
సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది.. సర్కారు కరుణించింది.. గణతంత్ర దినోత్సవం రోజు వారికి స్వేచ్ఛ లభించింది. వివిధ నేరాల్లో జీవిత ఖైదు అనుభవిస్తూ.. సత్‌ప్రవర్తనతో మెలిగిన వారిని విడుదల చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో.. వారందరూ శిక్షాకాలం ముగియకముందే బాహ్య ప్రపంచాన్ని చూడగలిగారు. స్వేచ్ఛా వాయువులు పీల్చుకోగలిగారు. బంధువులను చెంతకు చేరగలిగారు. క్షణికావేశంలో తప్పు చేసి జైలులో మగ్గిపోయామని.. విలువైన జీవితాన్ని కోల్పోయామని.. జీవితంలో మరోసారి తప్పు చేయబోమని వారు స్పష్టం చేశారు.
 
విడుదలైనా.. తప్పని నిరీక్షణ..
జైలు నుంచి విముక్తి లభించినా.. ఆ ఆవరణ నుంచి బయటపడేందుకు ఇద్దరికి సుదీర్ఘ నిరీక్షణ తప్పలేదు. తమతోపాటు విడుదలైనవారంతా బంధువులతో కలిసి ఆనందంగా వెళ్లిపోగా.. ఆ ఇద్దరు వృద్ధులు మాత్రం సాయంత్రం వరకు జైలు బయటే ఉసూరుమంటూ ఉండిపోయారు. కారణం.. వారి బంధువులెవరూ రాకపోవడమే.
 
మాచెర్ల సూరిబాబు(54), నిమ్మల బెన్ను(53) వృద్ధులు. వారిని తీసుకెళ్లడానికి బంధువులెవరూ జైలు వద్దకు రాలేదు. దీంతో ఊరెలా వెళ్లాలో తెలియక వారిద్దరూ జైలు ఆవరణలోనే నిరాశతో కూర్చుండిపోయారు. బెన్ను బంధువులు మధ్యాహ్నానికి అక్కడికి చేరుకుని అతన్ని తమతో తీసుకెళ్లారు. సూరిబాబు బంధువులు మాత్రం సాయంత్రానికి కూడా రాలేదు. దాంతో జైలు అధికారులే సిబ్బంది సహాయంతో అతన్ని స్వగ్రామమైన చోడవరం మండలం దోడపూడికి పంపించారు.
 
ఆరిలోవ: మంగళవారం ఉదయం.. పిల్లలు, పెద్దలు అందరూ గణతంత్ర దినోత్సవ సంబరాల్లో ఉన్నారు. జిల్లా కేంద్ర కారాగారం వద్ద ఆ సంబరాలతోపాటు ఒక రకమైన ఉద్విగ్న వాతావరణం నెలకొంది. జైలు బయట అనేక మంది ఆతృతతో ఎదురుచూస్తున్నారు. కొద్దిసేపటికి వారి నిరీక్షణ ఫలించింది. జైలు తలుపులు తెరుచుకున్నాయి. ఒక్కొక్కరు బయటకు రావడం ప్రారంభించారు. వారంతా జీవితఖైదు శిక్ష పడిన వారే. బయటకొస్తూనే ఒకవైపు అధికారులకు వీడ్కోలు.. మరోవైపు తమ బంధువులను చూసిన ఆనందంతో ఉబ్బితబ్బియ్యారు. పలకరింతలు.. పరామర్శలతో ఆ ప్రాంగణంలో ఆనందం వెల్లివిరిసింది. సత్‌ప్రవర్తనతో మెలిగిన జీవిత ఖైదీలను శిక్షాకాలానికి ముందే విడుదల చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు గణతంత్ర దినోత్సవమైన మంగళవారం విశాఖ కేంద్ర కారాగారం నుంచి 39 మంది ఖైదీలను విడుదల చేశారు.

41మందికి అవకాశమున్నా..
గత ఏడాది నవంబరు 18న ఖైదీల క్షమాభిక్షకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోలోని మార్గదర్శకాల ప్రకారం.. విశాఖ జైలు నుంచి విడుదలకు అర్హులైన 41 మంది ఖైదీల పేర్లతో అధికారులు  జాబితా రూపొందించి ఉన్నతాధికారులకు పంపారు. దానికి ప్రభుత్వ ఆమోదం కూడా లభించింది. ఆ మేరకు 41 మంది విడుదలకు అధికారులు రంగం సిద్ధం చేశారు. అయితే ఆదినారాయణ అనే ఖైదీ రూ 50 వేల వ్యక్తిగత పూచీకత్తు ఇవ్వలేక  విడుదల నోచుకోలేదు. ఒకటి, రెండు రోజుల్లో ఆయన బంధువులు వచ్చి పూచీకత్తు ఇచ్చిన వెంటనే ఆయన్ను విడుదల చేస్తారు. మరో ఖైదీ జామి కుమార్ మరో కేసులో రెండేళ్ల శిక్ష అనుభవించాల్సి ఉన్నందున ఆయన్ను విడుదల చేయలేదు. మిగిలిన 39 మంది విముక్తి పొందారు. మరోసారి ఎలాంటి తప్పులు చేయకుండా సత్‌ప్రవర్తనతో మెలుగుతామంటూ జైలు అధికారులకు హామీ ఇచ్చి.. వీడ్కోలు తీసుకున్నారు.

తప్పు చేస్తే క్షమాభిక్ష రద్దే
విడుదలైనవారు మళ్లీ తప్పు చేసి జైలుకు వస్తే క్షమాభిక్ష రద్దయ్యే అవకాశం ఉందని, అందువల్ల సత్‌ప్రవర్తనతో మెలగాలని విడుదలైన ఖైదీలకు జైలు సూపరింటెండెంట్ ఇండ్ల శ్రీనివాసరావు సూచించారు. జైలు ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నిబంధనల ప్రకారం క్షమాభిక్ష పొందిన ఖైదీల నుంచి రూ 50 వేల వ్యక్తిగత పూచీకత్తు తీసుకొని విడిచిపెట్టామన్నారు. విడదులైనవారందరిలో మంచి మార్పు వచ్చిందన్నారు. వారు మరోసారి తప్పు చేయరనే నమ్మకం ఉందన్నారు.
 
498(ఎ) ఖైదీలకూ విముక్తి

విడుదలైన వారిలో 498(ఎ) కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు ఉన్నారు. భార్యను హత్యచేసిన కేసులో 498(ఎ) సెక్షన్ కింద శిక్ష పడితే 14 ఏళ్ల సాధారణ జీవిత ఖైదుతోపాటు మరో ఆరేళ్లు రెమిషన్ పీరియడ్.. మొత్తం 20 ఏళ్ల శిక్ష అనుభవించాలి. ఇటువంటి శిక్షలు పడిన వివాఖ నగరానికి చెందిన  జి.ఎల్లయ్యరెడ్డి, డి.నాగేశ్వరరావులకు కూడా క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేశారు. జీవో ప్రకారం విడుదలకు అర్హులైన మహిళలు, 65 ఏళ్ల దాటిన వృద్ధులు మాత్రం లేరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement