ట్రాన్స్‌ఫార్మర్‌ను తప్పించి వంకర టింకరగా కడుతున్న డ్రెయిన్
సాక్షి, భవానీపురం: స్ట్రాం వాటర్ డ్రెయిన్ నిర్మాణానికి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ అడ్డొచ్చిందని కాలువను వంకరలు తిప్పుతూ చక్కటి రోడ్డును పగులకొట్టారు. అసలు స్ట్రాంవాటర్ డ్రెయిన్లే అనవసరంగా నిర్మిస్తున్నారని వాటి వలన ప్రయోజనం కూడా కనబడటం లేదని ప్రజలు అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే గతంలో గట్టిగా ఉన్న సైడు కాలువలను పగులకొట్టి కొత్తగా నిర్మించిన స్ట్రాంవాటర్ డ్రెయిన్స్‌తో మురుగునీటి పారుదల సక్రమంగా లేకపోవడమే వారి అసంతృప్తికి కారణం. ఈ నేపథ్యంలో విద్యాధరపురం 26వ డివిజన్ పరిధిలోని శ్రీకన్యకాపరమేశ్వరి కల్యాణ మండపం రోడ్‌లో నిర్మిస్తున్న స్ట్రాంవాటర్ డ్రెయిన్ కు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ అడ్డు వచ్చింది.
విద్యుత్ సిబ్బందికి చెప్పినా అక్కడి నుంచి ట్రాన్స్‌ఫార్మర్ మార్చటం లేదని దానిని తప్పించి డ్రెయిన్ నిర్మించే క్రమంలో చక్కగా ఉన్న రోడ్డును పగులకొట్టారు. స్థానికులతో ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉండటమే కాకుండా వెడల్పు కూడా తక్కువగా ఉన్న ఈ రోడ్డును పగులకొట్టడంతో కుచించుకుపోయింది. దీనిపై కామకోటినగర్, అండిమాని బ్రహ్మయ్య రోడ్‌వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు తవ్వి కూడా వారం రోజులకుపైనే అయ్యిందని స్థానికులు చెబుతున్నారు.
స్ట్రాంవాటర్ డ్రెయిన్ నిర్మాణ పనులను చేపట్టిన ఎల్ అండ్ టీ కంపెనీ ప్రాంతాలవారీగా సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించేయడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు ఇబ్బందిపడినా పరవాలేదు..ఎలాగోలా తమ కాంట్రాక్ట్ పని పూర్తి చేసుకుని వెళ్లిపోయే పరిస్థితిలో సబ్ కాంట్రాక్టర్లు ఉన్నారు. డ్రెయిన్ నిర్మాణ పనులను పర్యవేక్షించాల్సిన పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులు నిద్ర మత్తులోనో, ముడుపుల మత్తులోనో ఉండి పనులు జరుగుతున్న ప్రాంతంలో కానరావడం లేదు. దీనికి సంబంధించిన ఉన్నతాధికారులు ఎవరైనా ఉంటే వారైనా స్పందించి డ్రెయిన్ నిర్మిస్తున్న ప్రాంతాలలో స్థానికుల ఇబ్బందులను తెలుసుకుని పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment