
ప్రజా సమస్యలు పరిష్కరించండి
- మున్సిపల్ వైస్‌చైర్మన్, కౌన్సిలర్ల సదస్సులో జేసీ మురళి
మచిలీపట్నం టౌన్ : మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు తమ పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ జె.మురళి సూచించారు. జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీల వైస్ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లకు రెండు రోజులపాటు నిర్వహించే అవగాహన కార్యక్రమం సోమవారం స్థానిక ఆర్‌కే ప్యారడైజ్‌లో ప్రారంభమైంది.
బందరు మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, వైస్ చైర్మన్ పి.కాశీవిశ్వనాథం, కమిషనర్ ఎ.మారుతి దివాకర్‌లు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన జేసీ మాట్లాడుతూ ప్రజా జీవితంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని చెప్పారు. తద్వారా భవిష్యత్తులో చైర్మన్లుగా ఎదగాలని సూచించారు. ప్రతి కౌన్సిలర్ తమ విధులను, బాధ్యతలను గర్తెరిగి నడుచుకోవాలన్నారు.
అభివృద్ధికి అవసరమైన ఆర్థిక వనరులను పెంపొందించుకునేందుకు కృషి చేయాలని చెప్పారు. పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, అభివృద్ధి పనులు వంటిపై దృష్టి సారించాలన్నారు. పొడి, తడి చెత్తలను వేరు చేసే విధానాన్ని అమలు చేస్తే మున్సిపాలిటీకి ఉపయోగం కలుగుతుందని పేర్కొన్నారు. తడిచెత్త ద్వారా వానపాముల ఎరువులను తయారు చేయవచ్చని, దీంతో సేంద్రీయ ఎరువుల వాడకం పెంపొందించే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం కౌన్సిలర్ల సందేహాలను జేసీ నివృత్తి చేశారు.
బందరు మున్సిపల్ చైర్మన్ బాబాప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి నిధుల విడుదలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. వైస్ చైర్మన్ కాళీవిశ్వనాథం, కమిషనర్ మారుతి దివాకర్ మాట్లాడుతూ ఈ అవగాహనా కార్యక్రమం నూతన కౌన్సిలర్లకు ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా గుడివాడ, నూజివీడు మున్సిపల్ కమిషనర్లు ప్రమోద్‌కుమార్, సీహెచ్ శ్రీనివాస్, బందరు మున్సిపల్ డీఈ పి. పోలీస్ పలు అంశాలపై కౌన్సిలర్లకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.
పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, అభివృద్ధి పనులు, వీధి దీపాల నిర్వహణ, మున్సిపల్ ఆస్తుల పరిరక్షణ, నూతన ఆస్తుల కొనుగోలు, పేదరిక నిర్మూలన, కౌన్సిల్ అధికారాలు, బడ్జెట్ ఆమోదం, చైర్మన్ విధులు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీలకు చెందిన వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు 104 మందికి గానూ 62 మంది మాత్రమే హాజరయ్యారు. నందిగామ మున్సిపాలిటీ నుంచి ఒక్క కౌన్సిలర్ కూడా హాజరుకాలేదు. మంగళవారం కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది.