
అధికార యంత్రాంగం.. జనసమీకరణం
శ్రీకాకుళం పాతబస్టాండ్: సాధారణంగా ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు అధికారిక ఏర్పాట్లు చేయడం అధికార యంత్రాంగం బాధ్యత. జనసమీకరణ ఏర్పాట్లను అధికార పార్టీ నేతలే చూసుకుంటారు. కానీ ప్రస్తుతం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఈ నెల 17, 18 తేదీల్లో సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన ఖరారు కాగా.. అధికారిక ఏర్పాట్లతోపాటు జనసమీకరణ బాధ్యత కూడా జిల్లా అధికారుల పైన రుద్దారు. దాంతో ఆ ఏర్పాట్ల కోసం వారు మల్లగుల్లాలు పడుతున్నారు. బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశానికి విలేకరులను కూడా అనుమతించకుండా జనసమీకరణపైనే ప్రధానంగా చర్చించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వీరపాండ్యన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జన సమీకరణకు ఏ శాఖ ఎంత ఖర్చు చేయాలి, ఎవరు ఎన్ని వాహనాలు ఏర్పాటు చేయాలి, ఏ శాఖ ఎంతమంది జనాన్ని తరలించాలి.. తదితర అంశాలను చర్చించినట్లు తెలిసింది.
మొదటిరోజు నరసన్నపేటలో జరిగే రైతు సదస్సుకు 25 వేల మంది రైతులను, అనంతరం శ్రీకాకుళం వరకు జరిగే రోడ్డుషోకు వేలమంది జనాన్ని పోగేయాలని నిర్దేశించారు. ఇక రెండోరోజు రణస్థలంలో జరిగే మహిళా సంఘాల సమావేశానికి 30 వేలకు తక్కువ కాకుండా మహిళలను తరలించాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు సమాచారం. రైతు సదస్సుకు 400 బస్సులు, మహిళా సదస్సుకు 500 బస్సులను సిద్ధం చేయాలని నిర్ణయించారు. రైతుల సమీకరణ బాధ్యతను డ్వామా పీడీకి, మహిళల సమీకరణ బాధ్యతను డీఆర్‌డీఏ పీడీకి అప్పగించారు. రైతు, డ్వాక్రా రుణమాఫీల విషయంలో టీడీపీ ప్రభుత్వం సాచివేత విధానం అనుసరిస్తుండటం పై ఆయా వర్గాలు గుర్రుగా ఉన్నాయి. ఈ తరుణంలో వస్తున్న ముఖ్యమంత్రి పర్యటనను అధికార పార్టీ నేతలు తెలివిగా అధికారులపైకి నెట్టేశారు.జన సమీకరణలో విఫలమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించినట్లు తెలుస్తోంది.
పర్యటన ఇలా...
తాత్కాలికంగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు ఈ నెల 17న ఉదయం హెలికాప్టర్‌లో నరసన్నపేటకు చేరుకుంటారు. అక్కడ రైతు సదస్సులో పాల్గొని, అనంతరం రోడ్‌షో ద్వారా శ్రీకాకుళం చేరుకుంటారు. టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. తర్వాత జిల్లా పరిషత్ లో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షిస్తారు. రాత్రి శ్రీకాకుళం ఆర్‌అండ్‌బీ అతిధి గృహంలో బస చేస్తారు. 18న ఉదయం కలెక్టరేట్ సమీపంలో ఉన్న డచ్ బంగ్లా వద్ద పర్యాటకాభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అక్కడ నుంచి పైడిభీమవరం వెళ్లి వీకేపీ ఫార్మాలో కొత్త యూనిట్లకు ప్రారంభ, శంకుస్థాపనలు నిర్వహిస్తారు. ఆ తర్వాత రణస్థ లం చేరుకొని మహిళా సంఘాల సభ్యులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి విశాఖపట్నం వెళతారు.