తొలిరోజు సమ్మె సంపూర్ణం
Published Tue, Feb 11 2014 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 3:33 AM
విజయగనగరం అర్బన్, న్యూస్‌లైన్: జిల్లాలో జాతీయ బ్యాంకుల ఉద్యోగులు, అధికారులు సోమవారం నిర్వహించిన తొలి రోజు సమ్మె సంపూర్ణంగా విజయవంతమయింది. ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ జాతీయ కమిటీల పిలుపుతో జిల్లాలోని వివిధ జాతీయ బ్యాంక్‌ల సిబ్బంది స్పందిం చి సమ్మెలోపాల్గొన్నారు. జిల్లాలో ఎస్‌బీఐ, ఎస్‌బీహెచ్, ఆంధ్రాబ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి వివిధ జాతీయ బ్యాంకులు 156, గ్రామీణ వికాస బ్యాంక్ శాఖలు 79 వరకు ఉన్నాయి. వీటిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, అధికారులు 900 మంది వరకు ఉన్నారు. వీరంతా విధులకు వెళ్లక పోవడంతో ఆయా బ్యాంకుల్లో సేవలు నిలిచి పోయాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ఒక్కరోజులో వివిధ రూపాలలో రూ. 130 కోట్ల వరకు లావాదేవీలు స్తంభించాయి.
ప్రజావ్యతిరేక విధానాన్ని విడనాడాలి:
ఎస్‌బీఐ రీజనల్ కార్యదర్శి శంకరసూర్యారావు
బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాన్ని విడనాడాలని ఎస్‌బీఐ అధికారుల సంఘం రీజనల్ కార్యదర్శి పి.శంకరసూర్యారావు డిమాండ్ చేశా రు. సమ్మె నేపథ్యంలో స్థానిక ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ కార్యాలయం ఎదుట సోమవారం జరిగిన నిరసన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత కార్యాలయం ఎదుట నిరసన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాభాలు రావడం లేదని గ్రామీణ ప్రాంతాల బ్యాంక్‌లను కేంద్ర ప్రభుత్వం మూసివేస్తూ చర్యలు తీసుకుంటోందని ఆరోపించా రు. ఉద్యోగ భద్రత లేని అవుట్ సోర్సింగ్ విధానం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారవుతుందని ఆవే దన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.కృష్ణంరా జు, సీఐటీయూ అధ్యక్షుడు ఎంశ్రీనివాస, ఎస్‌బీఐ సిబ్బంది రీజనల్ కార్యదర్శి పి.సతీష్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు బి.శంకరరావు, మధుసూదనరావు, సభ్యులు సూర్యలక్ష్మి, చక్రపాణి, సంతోష్, గుప్తా, స్వామి, ప్రసాద్, జగదీష్, రవి, అప్పలరాజు, మురళిశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
‘వికాస బ్యాంక్’ సమ్మె సక్సెస్
ఉద్యోగుల వేతన ఒప్పందం సాధన కోసం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ అధికారులు, ఎంప్లాయీస్ సంఘాలు చేపట్టిన సోమవారం సమ్మె సక్సెస్ అయింది. సంఘాల జాతీయ కమిటీల పిలుపు మేరకు రెండు రోజుల పాటు సమ్మెకు తలపెట్టారు. స్థానిక బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం ఎదుట తొలుత నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో అధికారుల సంఘం జోనల్ కార్యదర్శి టి.రవి, అధ్యక్షుడు డీవీఎస్‌ఏఎన్.రాజు, ఉద్యోగుల సంఘం రీజియన్ కార్యదర్శి ఎన్.ఎన్.రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంవీటీ.నాగేశ్వరరావు, కార్యదర్శి గంగరాజు పాల్గొన్నారు.
Advertisement