సాక్షి, మచిలీపట్నం: కరోనా ఉధృతికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్రంలో ఈ నెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థనూ బంద్ చేసినట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) వెల్లడించారు. ఈ నెల 31 వరకు ఆర్టీసీ సర్వీసులతోపాటు ఇతర రాష్ట్రాలకు నడిపే అంతర్‌రాష్ట్ర సర్వీసులనూ నిలిపి వేస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులతో పాటు ఇతర వాహనాలన్నీ రాష్ట్రంలోకి రానీయకుండా సరిహద్దుల్లో ఆపేస్తామని, ఇందుకోసం రాష్ట్ర సరిహద్దులన్నీ మూసివేస్తున్నామన్నారు. ఆదివారం బందరులో మంత్రి మీడియాతో మాట్లాడారు. లాక్‌డౌన్ సందర్భంగా తీసుకుంటున్న చర్యలను వివరించారు.
- వారం పాటు ఏపీలో ఆటోలు, ట్యాక్సీలు, క్యాబ్‌లు,టెంపోలు సహా ప్రయాణికులను చేరవేసే వాహనాల రాకపోకల న్నీ నిలిపివేత. ప్రభుత్వ నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాలి.
- ప్రైవేటు రవాణా వ్యవస్థను నియంత్రించే బాధ్యతను పోలీసు, రవాణా శాఖలకు అప్పగించాం.
- ఎవరైనా వైద్యావసరాల కోసం అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే ఆటోల్లో కానీ ఇతర వాహనాల్లో కాని ఒక్కరే వెళ్లాలి.
- 31 వరకు రాష్ట్రంలో ప్రతిఒక్కరూ స్వీయనిర్బంధంలో ఉండాలి. అత్యవసరమైతే తప్ప ఇల్లు విడిచి బయటకు రావద్దు.
- విదేశాల నుంచి వచ్చిన వారే కాదు వారి ఇంట్లో, చుట్టుపక్కల వారి ఇళ్లల్లో కూడా దగ్గు, గొంతునొప్పి, జలుబు, జ్వరంతో ఎవరైనా బాధపడుతుంటే వెంటనే అందుబాటులో ఉన్న ప్రభుత్వ సిబ్బంది సహకారంతో ఆస్పత్రిలో చేరాలి.
31 వరకు ప్రజారవాణా బంద్
Published Mon, Mar 23 2020 4:39 AM | Last Updated on Mon, Mar 23 2020 8:01 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment