సమైక్య నినాదాలతో జిల్లా హోరెత్తిపోయింది. ఉద్యమ స్ఫూర్తిని నింపింది. రహదారులు జన సంద్రమయ్యాయి. దీక్ష శిబిరాలు సమైక్య గర్జన చేశాయి. నర్సీపట్నంలో సోమవారం నిరసనలు మిన్నంటాయి. వేలాది మందితో నిర్వహించిన జన గర్జన విజయవంతమైంది. వంగపండు తన ఆటపాటలతోఆకట్టుకున్నారు. అరకులోయలో మూడు రాష్ట్రాలుగా విభజించాలన్న కిశోర్‌చంద్రదేవ్ లేఖ ప్రతులను ఏపీఎన్జీవో సభ్యులు దగ్ధం చేశారు. ఏయూ ఎంప్లాయీస్ యూనియన్, విశ్వవిద్యాలయ అధ్యాపక జేఏసీ ఆధ్వర్యంలో500మీటర్ల జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు.
నర్సీపట్నం, న్యూస్‌లైన్ : ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో సోమవారం జరిగిన సమైక్య గర్జన సభ ఆంధ్రులంతా ఎప్పటికీ సమైక్యంగా ఉండాలంటూ చాటి చెప్పింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణదేవరాయ యూనివర్సిటీ ఫ్రొఫెసర్ ఎం.ముత్యాలనాయుడు మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాలు, మనోభావాలను పక్కన పెట్టి, సమష్టి ప్రయోజనాలను పరిగణనలోనికి తీసుకుని విభజన చేయాలని గతంలో ఇందిరాగాంధీ చెప్పారన్నారు.
ఆమె ఆశయాలకు విరుద్ధంగా కేవలం రాజకీయ లబ్ధిని దృష్టిలో ఉంచుకుని విభజనకు నేడు యుపీఏ ప్రభుత్వం పూనుకుందని విమర్శించారు. విభజన జరిగితే ప్రధానంగా వ్యవసాయరంగం తీవ్రంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నుంచి పరిశీలిస్తే తెలంగాణలో సాగయ్యే భూముల విస్తీర్ణం 110 శాతం పెరగ్గా, రాయలసీమలో 55, కోస్తాలో 30కి పరిమితమయ్యాయన్నారు.
ఇలాంటి అభివృద్ధిని ప్రభుత్వాలు ప్రాతిపదికగా తీసుకోవా? అంటూ ప్రశ్నించారు. కొత్త రాజధాని ఏర్పాటు చేయాలంటే రూ. 5 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని, దాని నిర్మాణం పూర్తి చేయాలంటే వంద సంవత్సరాలు పడుతుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయ జేఏసీ కార్యక్రమ నిర్వాహక ప్రతినిధి గోపీనాథ్ మాట్లాడుతూ విభజనపై అందరూ కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. భవిషత్తులో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.
సమైక్య గర్జన!
Published Tue, Sep 17 2013 3:38 AM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM
Advertisement
Advertisement