ఆ తమిళ ఎంపీకి తెలుగుపై ఎందుకంత ప్రేమ? | MP Gopinath Taking his Oath in Telugu | Sakshi
Sakshi News home page

ఆ తమిళ ఎంపీకి తెలుగుపై ఎందుకంత ప్రేమ?

Published Wed, Jun 26 2024 10:43 AM | Last Updated on Wed, Jun 26 2024 11:35 AM

MP Gopinath Taking his Oath in Telugu

తమిళనాడుకు చెందిన ఒక ఎంపీ తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడం ఆసక్తికరంగా మారింది. పార్ల‌మెంట్ స‌మావేశాల రెండో రోజు లోక్‌స‌భ‌లో ఇది చోటు చేసుకుంది. ఇంతకీ ఆయన తెలుగులో ఎందు ప్రమాణం చేశారు? ఆయనకు తెలుగుతో ఉన్న అనుబంధం ఏమిటి?

పార్లమెంట్‌ సమావేశాల రెండవ రోజున కొత్తగా ఎంపీకైన ఎంపీలలోని పలువులు తమ ప్రాంతీయ భాషలలో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే త‌మిళ‌నాడులోని కృష్ణ‌గిరి లోక్‌స‌భ నుంచి కాంగ్రెస్  త‌ర‌పున గెలుపొందిన ఎంపీ కే గోపినాథ్ తెలుగులో  ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో ఒక రాష్ట్రానికి చెందిన ఎంపీ మ‌రొక రాష్ట్రపు మాతృ భాష‌లో ప్ర‌మాణ స్వీకారం చేయ‌డం ఏమిటా? అని అందరూ అతనిని ఆసక్తిగా గమనించారు. ఎంపీ గోపినాథ్ ఓ చేతితో రాజ్యాంగ ప్ర‌తిని ప‌ట్టుకొని ప్ర‌మాణ స్వీకారం చేశారు. అయితే ప్ర‌మాణ స్వీకారం చివ‌రిలో  జై త‌మిళ‌నాడు అని త‌మిళంలో నిన‌దిస్తూ మరో ట్విస్ట్‌ ఇచ్చారు. ఆయ‌న ప్ర‌మాణ స్వీకారానికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ గోపీనాథ్‌ తెలుగు కుటుంబానికి చెందిన వారు. కృష్ణగిరి జిల్లా హోసూరు ఆయన స్వస్థలం. గోపీనాథ్‌ విద్యాభ్యాసం తెలుగులో కొనసాగింది. 2001, 2006, 2011లలో హోసూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ వచ్చారు. తమిళనాడులో  ఏర్పడిన తెలుగు భాషా సమస్యలతో పాటు, అక్కడి తెలుగు వారి కోసం ఎంపీ గోపీనాథ్‌ పోరాడారు. తమిళనాడు అసెంబ్లీలోనూ ఆయన పలుమార్లు తెలుగులో ప్రసంగించారు. మాతృభాషపై ఎనలేని మమకారమున్న గోపీనాథ్‌ మరోమారు పార్లమెంటులోనూ తెలుగులోనే ప్రమాణస్వీకారం చేశారు.

కృష్ణ‌గిరి జిల్లా త‌మిళ‌నాడు, ఆంధ్రప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల‌ను క‌లుపుతుంది. ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్‌కు అతి స‌మీపంలో ఉంది. దీంతో ఇక్కడి ప్ర‌జ‌లు త‌మిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ భాష‌ల‌ను కూడా మాట్లాడుతారు. కాగా గ‌తంలో త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, దివంగత  జ‌య‌ల‌లిత కూడా అసెంబ్లీలో తెలుగులో ప్రసంగించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో వివిధ సంద‌ర్భాల్లో వైర‌ల్ అవుతుంటుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement