గొల్లపేట– పులిచింతల మధ్య నీట మునిగిన రహదారి
గుంటూరు, బెల్లంకొండ: పులిచింతల ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి గత రెండు రోజులుగా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శనివారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన వదర ప్రవాహం రోజు రోజుకూ పెరుగుతుండడంతో కృష్ణా నది ఉగ్ర రూపం దాల్చుతోంది. ఆదివారం వరకూ గ్రామాలు పాక్షికంగా ముంపుకు గురవ్వగా, సోమవారం కూడా నీటి ప్రవాహం పెరిగితే గ్రామాలు పూర్తిగా నీట మునిగే పరిస్థితి ఏర్పడుతుంది.
చుట్టుముట్టిన వరద నీరు..
ప్రాజెక్టు పరిధిలో ప్రస్తుతం దాదాపుగా 13టీఎంసీల వరకూ నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టులో నీటిని నిల్వతో బెల్లంకొండ మండలంలోని ముంపు గ్రామాలైన పులిచింతల, గొల్లపేట, కోళ్లూరు గ్రామాలను వరద నీరు పూర్తిగా చుట్టుముట్టింది. చిట్యాల, చిట్యాల తండా, కేతవరం, బోదనం గ్రామాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
స్తంభించిన రాక పోకలు..
వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఇప్పటికే ముంపు గ్రామాలైన పులిచింతల, గొల్లపేట, కోళ్లూరు గ్రామాలలోకి నీరు చేరి రాక పోకలు నిలిచిపోయాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి వరద పెరుగుతూ వస్తుంది. గొల్లపేట నుంచి పులిచింతలకు వెళ్లే రహదారి పూర్తిగా నీట మునిగింది. బోధనం వద్ద గల దొంగ చింత వద్దకు నీరు చేరుతుండటంతో రహదారిపై రాక పోకలు సాగించే అవకాశం లేకుండా పోయింది.
సురక్షిత ప్రాంతాలకు..
గత ఏడాదే నిర్వాసితులను అధికారులు గ్రామాలు ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. కాగా పునరావాస కేంద్రాల్లో ఉపాధి లేక పోవడం, ప్రాజెక్టు పరిధిలో నీరు నిల్వ తగ్గడంతో నిర్వాసితులు కొందరు తిరిగి ముంపు గ్రామాలకు వెళ్లారు. ఈ ఏడాది తిరిగి పొలాల్లో పంటలు వేసుకున్నారు.
గ్రామాలను ఖాళీ చేయిస్తున్న అధికారులు..
ముంపు గ్రామాలకు ఎగువ ప్రాంతాలను నుంచి వరద ప్రవాహం పెరుగుతుండటంతో గ్రామాల్లో ఉంటున్న వారిని అధికారులు పునరాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవ సహాయం, స్థానిక తహసీల్దార్ వైవీబీ కుటంబరావు, ఎస్‌ఐ డి.జయకుమార్‌లు గ్రామాల్లో ఉండి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. జేసీబీలతో ముంపు గ్రామాల్లో గృహాలను తొలగిస్తున్నారు.
ముంపు గ్రామాల ప్రజల తరలింపు
మాచవరం : మండలంలోని పులిచింతల ముంపు గ్రామాలైన రేగులగడ్డ, గోవిందాపురం, వెల్లంపల్లి గ్రామాలను ఖాళీ చేయించేందకు అధికారులు చర్యలు చేపట్టారు. పులిచింతల ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్–2 విజయ్‌చందర్ మాట్లాడుతూ ఆదివారం ఉదయం నాగార్జున సాగర్ క్రష్‌గేట్లు ఎత్తినందున, పులిచింత ప్రాజెక్టుకు నీరు చేరే అవకాశం ఉందని, ఈ క్రమంలో ముంపు గ్రామాల్లో ముందస్తుగా ప్రజలను ఖాళీ చేయిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే రేగులగడ్డ , గోవిందాపురం గ్రామాల్లో వన్‌టైం సెటిల్ మెంట్ ద్వారా అర్హులందరికి పరిహారం అందించామన్నారు. వెల్లంపల్లి 241 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి, పక్కా గృహాలు నిర్మించినట్లు తెలిపారు. వెల్లంపల్లిలో గ్రామస్తులు 94 మంది నిర్వాసితుల జాబితా అందించారని, వాటిపై పలు ఆరోపణలు ఉండటంతో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అర్హులైన వారికి త్వరలో ఇళ్ల పట్టాలు మంజూరయ్యేలా చూస్తామన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు అతిక్రమించి నివాసం ఉండేందుకు ప్రయత్నిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయా గ్రామాల్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ధనుంజయ్, ఆర్డీవో మురళి, సత్తెనపల్లి డీఎస్పీ కాలేషావలి, రూరల్ సీఐ సుబ్బారావు, స్థానిక ఎస్‌ఐ జగదీష్ పర్యటించారు. గ్రామస్తుల సామాన్లను తరలించేందుకు అధికారులు లారీలను ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment