ఎరువులు కరువు | pulitzer | Sakshi
Sakshi News home page

ఎరువులు కరువు

Published Sun, Mar 2 2014 4:30 AM | Last Updated on Mon, Oct 1 2018 6:38 PM

pulitzer


 రబీ రైతులకు ఎరువుల కష్టాలు మొదలయ్యాయి. సాగుకు సరిపడా ఎరువులను సరఫరా చేయడంలో వ్యవసాయ శాఖ విఫలమైంది. సాగు విస్తీర్ణం అనూహ్యంగా పెరిగిపోవడంతో అధికారుల అంచనాలు తలకిందులయ్యాయి. సొసైటీలు, ఫర్టిలైజర్ దుకాణాల ముందు రైతులు బారులు తీరిన దృశ్యాలే ఇందుకు నిదర్శనం.
 
 జిల్లావ్యాప్తంగా రబీ సీజన్ ఆరంభం నుంచి ఇప్పటివరకు లక్షా 13,058 మెట్రిక్ టన్నుల యూరియా అవసరముందని ప్రతిపాదించగా.. కేవలం 77,549 మెట్రిక్ టన్నులే సరఫరా అయింది. యూరియా వచ్చింది వచ్చినట్టు ఎప్పటికప్పుడు సొసైటీలకు సరఫరా చేస్తున్నా సరిపోవడం లేదు. ఐదు నెలల నుంచి డీఏపీ, ఎంవోపీ ఎరువులను ప్రతిపాదించినా జిల్లాకు సక్రమంగా ఠ మొదటి పేజీ తరువాయి
 పంపిణీ చేయడం లేదు. నెలవారీగా ఎరువులను పంపిణీ చేస్తున్నప్పటికీ ఫిబ్రవరిలో అవసరమైన యూరియా కేటాయించడంలో విఫలమయ్యారు.

 

19,550 టన్నుల యూరియా అవసరమని ప్రతిపాదించినా 12,696 టన్నులే వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరిలో ఎంవోపీ, డీఏపీ ఎరువులు అసలే కేటాయించలేదు. 4,214 మెట్రిక్ టన్నుల యూరియా మార్క్‌ఫెడ్ వద్ద, 910 టన్నుల యూరియా ప్రైవేట్ డీలర్ల వద్ద బఫర్ స్టాక్ ఉందని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు తేరుకుని యూరియా కొరత నివారించాలని రైతులు కోరుతున్నారు. జిల్లాకు కేటాయించిన ఎరువుల్లో 50 శాతం మార్క్‌ఫెడ్‌కు, 50 శాతం ప్రైవేట్ డీలర్లకు కంపెనీలు కేటాయిస్తున్నాయి. ఈ క్రమంలో మార్క్‌ఫెడ్ నుంచి జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఆయా మండలాలకు కేటాయించిన కోటా ప్రకారం పంపిణీ జరుగుతోంది. సహకార సంఘాల వద్ద రాజకీయ పైరవీలు, ప్రైవేట్ డీలర్ల వద్ద దోపిడీ వెరసి అన్నదాతకు తీవ్ర కష్టాలు మొదలయ్యాయి.
 పెరిగిన సాగు

 సాగు విస్తీర్ణం పెరగడమే యుూరియూ కొరతకు ప్రధాన కారణం. జిల్లాలో 2,32,926 లక్షల హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణానికి గాను ఇప్పటివరకు 2,93,663 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. వరి సాధారణ విస్తీర్ణం 1,48,757 హెక్టార్లు కాగా 2,06,350 హెక్టార్లలో సాగయ్యింది. మొక్కజొన్న 50,033 హెక్టార్లలో సాగవుతుండగా మిగిలిన ప్రాంతంలో ఇతర పంటలు సాగవుతున్నాయి. వరి అత్యధికంగా మానకొండూర్, ధర్మపురి, జగిత్యాల, వీణవంక, కేశవపట్నం, కరీంనగర్, వెల్గటూర్ తదితర మండలాల్లో సాగవుతోంది. ఈ క్రమంలో మండలాల వారీగా అవసరమున్న ఎరువుల కేటాయింపులో సంబంధిత శాఖ నిర్లక్ష్యంతో యూరియా కొరత వచ్చిందని రైతులు ఆరోపిస్తున్నారు. వరిలో ఇప్పుడు ప్రధానంగా యూరియే వేసే సమయం. ముందునాటు పడ్డ వారు రెండో విడత యూరియా వేస్తుండగా ఆలస్యంగా నాటు వేసిన వారు మొదటి దఫా యూరియా వేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. వ్యవసాయశాఖ అధికారుల సూచనలకంటే ఎక్కువ వినియోగించడం కూడా కొరతకు కారణమవుతోంది. ఎకరాకు 50 కిలోల యూరియా వేసుకోవాలని సూచిస్తున్నా ఎకరానికి క్వింటాల్ వరకు వేస్తున్నారు. సహకార సంఘాల్లో ఎకరానికి రెండు బస్తాలే ఇస్తుండడంతో ఇవి ఏ మాత్రం సరిపోవని రైతులు గొడవకు దిగుతున్నారు. ఈ విషయమై జేడీఏ బి.ప్రసాద్ మాట్లాడుతూ యూరియాకు డిమాండ్ ఉన్న మాట వాస్తవమేనని, కొరత మాత్రం లేదని తెలిపారు. నెలవారీగా సరిపడా ఎరువులు తెప్పిస్తున్నట్లు స్పష్టం చేశారు.
 రైతుల బారులు
 

హుస్నాబాద్, న్యూస్‌లైన్ : యూరియా కొరత రైతులను ఇబ్బందులపాలు చేస్తోంది. దొరుకుతుందో లేదోనని రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. హుస్నాబాద్ సింగిల్‌విండో కార్యాలయానికి శనివారం 680 బస్తాలు యూరియా రాగా వందలాది మంది రైతులు తరలివచ్చి భారీ క్యూ కట్టారు. రైతుకు రెండుబస్తాల చొప్పున పంపిణీ చేశారు. బస్తాలు రాని రైతులు నిరాశతో వెనుదిరిగారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement