ప్రజాసాధికార సర్వేకు తప్పని ఇక్కట్లు
సాఫ్ట్‌వేర్ మార్చినా పనిచేయని సర్వర్
ఎన్యూమరేటర్లకు పూర్తిగా అందని ట్యాబ్‌లు
వ్యక్తిగత వివరాలు అడగడంపై ప్రజల్లోనూ ఆందోళన
జిల్లాలో ప్రజాసాధికార (పల్స్) సర్వేకు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. సర్వర్ మొరాయించడం.. ఎన్యూమరేటర్లు సేకరించిన వివరాలు అప్‌లోడ్ కాకపోవడంతో ఈ నెల ఆరో తేదీన ప్రారంభమైన సర్వే నత్తలా సాగుతోంది. కొన్నిచోట్ల ఎన్యూమరేటర్లకు ట్యాబ్‌లు, ఐరిస్ తీసే పరికరాలు ఇవ్వకపోవడంతో సర్వే గందరగోళంగా తయారైంది. ఇంకొన్ని చోట్ల ప్రజలు తమ వ్యక్తిగత వివరాలు వెల్లడించేందుకు ఇష్టపడడం లేదు. వెరసి పల్స్ సరిగా అందడం లేదు.
మచిలీపట్నం/విజయవాడ సెంట్రల్ : పల్స్ సర్వేతో సంక్షేమ పథకాల్లో కోత పెట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు సర్వే బృందాలు ప్రజల నుంచి వివరాలను కూపీ లాగుతున్నాయి. ఆధార్, రేషన్, ఓటర్ కార్డులు, ఆస్తిపన్ను, ఐడీ, కరెంట్ బిల్లు, డ్రైవింగ్ లెసైన్స్, వెహికిల్ రిజిస్ట్రేషన్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్, ఎల్‌పీజీ గ్యాస్ బుక్, బ్యాంక్ పాస్‌బుక్, వాటర్ బిల్లు, క్యాస్ట్, ఇన్‌కం సర్టిఫికెట్లు, కిసాన్‌కార్డు, పెన్షన్ సర్టిఫికెట్, డ్వాక్రా కార్డు, పుట్టిన తేదీ సర్టిఫికెట్ (5 సంవత్సరాలలోపు) పోస్ట్ లేదా ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ కార్డులు వివరాలను సర్వే బృందాలు సేకరిస్తున్నాయి. మొత్తం 75 అంశాలకు సంబంధించి వివరాలను సేకరిస్తున్నారు. ప్రపంచ బ్యాంక్ ఆదేశాల మేరకే రాష్ట్ర ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పనిచేయని వర్షన్‌లు
స్మార్ట్ పల్స్ సర్వే చేసే నిమిత్తం ఎన్యూమరేటర్‌లకు ఇచ్చిన ట్యాబ్‌లలో తొలుత 2.0 వర్షన్‌ను ఆప్‌లోడ్ చేశారు. ట్యాబ్‌లో ఉన్న సిమ్‌కు 2జీ సేవలను అందుబాటులో ఉంచారు. 2.0 వర్షన్ పనిచేయకపోవటంతో 2.1 వర్షన్, అదికూడా పని చేయకపోవటంతో 2.2, తిరిగి 2.1, 2.3 వర్షన్‌లను ఆప్‌లోడ్ చేశారు. వీటిలో ఏదీ పని చేయలేదు. దీంతో కొద్ది పాటి మార్పులు చేసి మంగళవారం 2.3.1 వర్షన్‌ను ఆప్‌లోడ్ చేశారు. ఇదీ పని చేయకపోవడంతో బుధవారం 2.4 వర్షన్‌ను ఆప్‌లోడ్ చేశారు. ప్రస్తుతం 3జీ, 4జీ సేవలు అందుబాటులో ఉన్నా ఎన్యూమరేటర్‌లకు 2జీ సేవలు అందించే సిమ్‌లను ఇవ్వడంతో సర్వర్ సిగ్నల్స్ సక్రమంగా అందక ట్యాబ్‌లో నింపిన వివరాలు ఆప్‌లోడ్ కావటం లేదు. కొన్ని ట్యాబ్‌లలో బ్యాటరీలు సక్రమంగా పని చేయకపోవటం మరో సమస్యగా మారింది. మరి కొన్ని ట్యాబ్‌ల్లో కుటుంబ సభ్యుల వేలిముద్రలను సక్రమంగా స్వీకరించని పరిస్థితి ఉంది.
ఏ పని చేయాలి ?
పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది స్మార్ట్ పల్స్ సర్వేలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు పాల్గొనాలనే నిబంధన విధించారు. ఓ వైపు పంచాయతీల్లో పారిశుద్ధ్యం, తాగునీరు సరఫరా వంటి పనులు చేయాలో.. పల్స్ సర్వేలో పాల్గొనాలో అర్ధంకాక సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. దీనికి తోడు ఈ నెల 15వ తేదీ నుంచి పంచాయతీ కార్యదర్శులు పుష్కర విధుల్లో తప్పనిసరిగా ఉండాలని షరతులు పెట్టారు. ఒక మండలం నుంచి వేరే మండలానికి కొంత మందిని నియమించారు. ఒక ఉద్యోగి రెండు చోట్ల ఎలా పని చేయాలనేది ప్రశ్నార్ధకంగా మారింది. పంచాయతీ కార్యదర్శులు, వెలుగు సిబ్బంది, వీఆర్‌వో, వీఆర్‌ఏలను స్మార్ట్ పల్స్ సర్వేలో ఎన్యూమరేటర్‌లుగా నియమించినా ఇప్పటివరకు లిఖిత పూర్వకంగా ఆదేశాలు ఇవ్వలేదు.
కోతల కోసమే
గెలుపే లక్ష్యంగా ఎన్నికల్లో ఎడాపెడా హామీలు గుప్పించిన చంద్రబాబు సామాజిక పింఛన్లను రూ.200 నుంచి రూ.1,000, 1,500కు పెంచుతానన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహాలను కేటాయిస్తామన్నారు. పేద,మధ్య తరగతి వర్గాలను ఆకర్షించే ఇలాంటి హామీలు ఎన్నో. తెల్లరేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిపుచ్చుకొనే వీలుంటుందనేది బహిరంగ రహస్యం. కుటుంబ ఖర్చుల్ని లెక్కగట్టి ఆదాయంగా చూపినట్లైతే ప్రస్తుతం ఉన్న తెల్లరేషన్ కార్డుల్లో 60 శాతం మేర తొలగించవచ్చన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. అందుకే కుటుంబ, వ్యక్తిగత సమాచారాన్ని సర్వే ముసుగులో రాబడుతున్నారు. పల్స్ సర్వే బృందాలు వస్తున్నాయంటేనే ప్రజలు హడలెత్తుతున్నారు. అధికారపార్టీ నేతలు మాత్రం సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేసేందుకే సర్వే నిర్వహిస్తున్నామని ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు సాగిస్తున్నారు. అన్నింటికీ ‘ఆధార్’ ఉండగా పల్స్‌సర్వే దేనికన్నది ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
అందని పల్స్
Published Thu, Jul 14 2016 1:02 AM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM
Advertisement
Advertisement