
సాక్షి, ఏలూరు : పుల్వామా ఉగ్రదాడిలో అశువులు బాసిన అమర జవాన్లకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రద్ధాంజలి ఘటించింది. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరుగుతున్న బీసీ గర్జన సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మొదటగా అమర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అంతకుముందు సభా వేదికపై జ్యోతిరావు పూలే, సాయిత్రీబాయి పూలే, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే గన్నవరం నుంచి ఏలూరుకు రోడ్డు మార్గంలో చేరుకున్న వైఎస్ జగన్‌కు పార్టీ నేతలు సాదరంగా స్వాగతం పలికారు.
బీసీ గర్జన సభకు ఆర్.కృష్ణయ్య
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న బీసీ గర్జన సభకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ‍్యక్షుడు ఆర్.కృష్ణయ్య హాజరయ్యారు. బీసీ గర్జన వేదికపై ఆయన కూడా ఆశీనులయ్యారు.
వైఎస్ జగన్‌కు బీసీ ఫెడరేషన్ వినతిపత్రం
బీసీల సమస్యలపై బీసీ ఫెడరేషన్ ఆల్ ఇండియా అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య తరఫున ఆయన ప్రతినిది గూడురి వెంకటేశ్వరరావు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఏలూరు సభా వేదికపై వైఎస్ జగన్‌ను కలిసిన బీసీ ఫెడరేషన్ ప్రతినిధులు.. పలు సమస్యలు, సలహాలతో కూడిన అర్జీని అందజేశారు. బీసీలకు అండగా ఉంటానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు.