పథకాలతో పుంజుకుంటాం
ఎమ్మిగనూరు: కొన్ని రాజకీయ పార్టీల తరహాలో అధికారంలో ఉన్నామని ‘ఆపరేషన్ ఆకర్ష్’, ప్యాకేజీలతో కాకుండా జనాకర్షన పథకాలతో తమ పార్టీ పుంజుకుంటుందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఆదివారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బీజేపీ నియోజకవర్గ విసృతస్థాయి సమావేశం పట్టణ అధ్యక్షుడు లలిత్‌కుమార్ అధ్యక్షతన స్థానిక సోమప్ప మెమోరియల్ హాల్‌లో నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ 2019లో రాష్ట్రంలో అధికారం చేపట్టే దిశగా పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో బీజేపీ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందన్నారు. ఐదేళ్లలో 11కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి మహాత్మాగాంధీ 150వ జయంతి నాటికి ఆరోగ్యకరమైన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు.
రాయలసీమ సమగ్రాభివృద్ధికి పాటుపడతామన్నారు. హంద్రీనీవా, గురురాఘవేంద్ర, పులికనుమ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే కేంద్ర ప్రభుత్వ సహాయం తప్పనిసరి అని ఆ దిశగా బీజేపీ కృషి చేస్తుందన్నారు. జిల్లాలో చేనేత కార్మికులఇక్కట్లను కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేకూరుస్తానన్నారు.
సీమ సమస్యలను పీఎం దృష్టికి తీసుకెళ్లండి
ఎమ్మిగనూరు టౌన్: రాయలసీమ సమస్యలను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని దగ్గుబాటి పురందర్వేరిని పాణ్యం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి కోరారు. సీమకు సాగునీరు అందాలంటే పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు.
సభ్యత్వంలో నెంబర్ వన్ పార్టీగా బీజేపీ..
మార్చి నాటికి సభ్యత్వ నమోదులో ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించబోతోందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రధాని అన్ని చర్యలు చేపట్టారని, ఇది పూర్తి అయితే 40టీఎంసీల నీరు రాయలసీమకు కేటాయిస్తారని వెల్లడించారు.
బీజేపీలో పలువురి చేరిక
ఎమ్మిగనూరు టౌన్: ఎమ్మిగనూరుకు చెందిన ముఖ్యమైన నాయకులు ఆదివారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు వై.దేవేంద్రగౌడ్, కెఆర్.గౌడారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు, ప్రముఖ వ్యాపారవేత్త కేఆర్.మురహరిరెడ్డి, రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజినీర్, ఉప్పర సంఘం అధ్యక్షుడు ఉప్పర రాజన్నతో పాటు వారి అనుచరులు, రిటైర్డ్ ఎస్‌ఐ సోమన్న, కర్నూలుకు చెందిన న్యాయవాది హేమలత, బుడగజంగం నాయకుడు రామరాజు, యుటీ.శంకర్‌నాథ్, యుకె.సుశీలమ్మ, శ్రీరాములతో పాటు వందలాది మంది కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, కపిలేశ్వరయ్య, జిల్లా అధ్యక్షుడు నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. వారికి బీజేపీ కండువాలను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.