సాక్షి ప్రతినిధి, ఒంగోలు
కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీలో చేరనున్నట్లు విశాఖపట్నంలో గురువారం ప్రకటించడంతో ఆమె భర్త, పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా అదే బాటలో పయనించేందుకు సిద్ధమవుతున్నారు. దగ్గుబాటి దంపతులు కాంగ్రె స్ పార్టీని వీడి, వేరే పార్టీలో చేరాలని కొంత కాలంగా ఆలోచిస్తున్న విషయం తెలిసిందే.. ముందుగా టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీనికి సంబంధించిన ఫ్లెక్సీలు కూడా ఆయనే స్వయంగా ఏర్పాటు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వాటిని చూసిన తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. ఫ్లెక్సీలు తొలగించి, కాల్చి వేశారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి వీలు లేకపోయింది. అది కూడా మనమంచికే జరిగిందని* దగ్గుబాటి దంపతులు భావిస్తున్నారు.
తెలుగుదేశం ఎలాగూ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి, ఆ పార్టీలోకి వెళ్లినా ఉపయోగం లేదని భావించినట్లు తెలిసింది. నరేంద్ర మోడి ప్రభావంతో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలున్నట్లు పలు వార్త సంస్థలతో పాటు, సర్వేలు వెల్లడించాయి. యూపీఏలో కేంద్ర మంత్రి స్థాయి ఉండటంతో బీజేపీలోకి వెళితే , ఆ పార్టీ ప్రభుత్వంలో కూడా మంత్రి పదవి లభించే అవకాశం ఉందని ఈ దంపతులు భావిస్తున్నట్లు సమాచారం. శుక్రవారం వీరిద్దరూ ఢిల్లీలో బీజేపీ అగ్ర నేతలతో సమావేశం కానున్నారు. అటు విశాఖలోను, ఇటు పర్చూరులోను ఆ దంపతులను నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులు వారించే ప్రయత్నం చేసినా, వారి మాటలను వినే స్థితిలో లేదని తెలిసింది.
స్వప్రయోజనాల కోసమే..
కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రకు అన్యాయం చేసిందని, వద్దన్నా రాష్ట్రాన్ని విభజించిందని అందుకే రాజీనామా చేసినట్లు చెప్పుకుంటున్న దగ్గుబాటి దంపతులు విభజనపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న వెంటనే, ఆ పార్టీకి, మంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని వారి సన్నిహితులే ప్రశ్నిస్తున్నారు. కేవలం పదవే పరమావధిగా పార్టీలు మారుతున్న దగ్గుబాటి దంపతుల పట్ల వారి సన్నిహితులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనకు బదులుగా తన కుమారుడిని తెలుగుదేశం పార్టీ నుంచి పోటీకి దింపాలనుకున్నా, బీజేపీ నుంచి అనుకూల సాంకేతాలు రావడంతో ఆయనే బీజే పీ నుంచి పోటీ చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. పర్చూరులో బీజేపీకి సానుకూల పవనాలు లేకపోయినా, గెలుస్తామనే ధీమా దగ్గుబాటి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
బీజేపీలోకి పురందేశ్వరి
Published Fri, Mar 7 2014 2:49 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement