ప్రజా వ్యతిరేకత పెరిగితే పునరాలోచన
టీడీపీతో పొత్తుపై బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశంపై ప్రజా వ్యతిరేకత పెరిగితే ఆ పార్టీతో పొత్తు విషయంలో తాము పునరాలోచన చేసే అవకాశం లేకపోలేదని బీజేపీ మహిళా మోర్చా నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురందేశ్వరి చెప్పారు. ఆమె ఆదివారం విజయవాడలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేశ్‌రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సాంబయ్య, అధికార ప్రతినిధి శ్రీని వాసరాజుతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
‘‘పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్ ప్రభుత్వంపై ఏర్పడిన ప్రజా వ్యతిరేకత మిత్రపక్షమైన బీజేపీపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఏపీలోనూ మా పార్టీ జాతీయ అధ్యక్షుడు, జాతీయ నేతలు ప్రతి అంశంపై సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీతో మేం మిత్రపక్షంగా ఉన్నాం. రాబోయే ఎన్నికల నాటికి అప్పటి పరిస్థితులను బట్టి మా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక నిర్ణయం తీసుకుంటారు’’ అని పురందేశ్వరి పేర్కొన్నారు.