ఆశలు వదిలేశారు!
- రాజంపేట, మదనపల్లెలో కలవని బీజేపీ, టీడీపీ బంధం
- మోడీ సభలోనూ మాట్లాడుకోని బాబు, పురందేశ్వరి
- చిన్నమ్మ తీరుపై తమ్ముళ్ల అసంతృప్తి
బి.కొత్తకోట, న్యూస్‌లైన్: టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా రాజంపేట ఎంపీ, మదనపల్లె అసెంబ్లీ స్థానాన్ని టీడీపీ వదులుకుంది. రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పురందేశ్వరి, మదనపల్లె అభ్యర్థిగా చల్లపల్లె నరసింహారెడ్డి బరిలో ఉన్నారు. పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ బలం అంతంత మాత్రమే. ఎన్నికల్లో మద్దతు లభించాలంటే పురందేశ్వరికి టీడీపీ సహకారం అవసరం. ఈ నేపథ్యంలో పురందేశ్వరి కొన్నిరోజులుగా పత్రికా ప్రకటనలు ఇస్తున్నారు.
అందులో ఎన్టీ రామారావు, నరేంద్రమోడీ, పురందేశ్వరి ఫొటోలు మాత్రమే ఉంటున్నాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఫొటో ఎక్కడా కనపడడంలేదు. వీటిపై పార్టీ శ్రేణులు పెద్దగా స్పందించలేదు. అయితే గురువారం మదనపల్లెలో జరిగిన నరేంద్రమోడీ రాకకు ఇచ్చిన ప్రక టనలోనూ చంద్రబాబు ఫొటో కనిపించలేదు. దీంతో పార్టీ శ్రేణులు ఆగ్రహానికి లోనయ్యాయి. ‘‘గెలుపు కోసం టీడీపీ ఓట్లు కావాలి, పార్టీ అధినేత ఫొటో మాత్ర ం ప్రకటనలకు అవసరం లేదా..?’’ అంటూ కార్యకర్తలు, నాయకులు రగిలిపోయారు.
ఇటీవల ఈ విషయాన్ని కొందరు నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో మదనపల్లె మోడీ సభలో చంద్రబాబు, పురందేశ్వరి ఒకే వేదికపై సభ ముగిసేదాకా ఉన్నా వారిద్దరి మధ్య మాటల్లేవు. నేతల ప్రసంగాల సమయంలో చంద్రబాబు కూర్చొన్న చోటుకు దూరంగా ఉండేందుకు పురందేశ్వరి యత్నించారు.
చంద్రబాబు ప్రసంగంలో తొలుత రాజంపేట అని సంబోధించారు. కానీ పురందేశ్వరి పేరును ఉచ్ఛరించలేదు. చివర్లో విధిలేని పరిస్థితుల్లో ఆమె పేరును ప్రస్తావించి ఓట్లు వేయాలన్నారు. కాగా సభ జరుగుతుండగానే వేదికపైనున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఒక్కసారిగా ప్రెస్‌గ్యాలరీలోకి వచ్చారు. టీడీపీ నేతలు పురందేశ్వరిపై వ్యతిరేకత వ్యక్తం చేయగా వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
ఆందోళనలో అసెంబ్లీ అభ్యర్థులు
పురందేశ్వరి వ్యవహారం అసెంబ్లీ అభ్యర్థులకు దడపుట్టిస్తోంది. తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థి శంకర్‌యాదవ్, మదనపల్లె బీజేపీ అభ్యర్థి చల్లపల్లె నరసింహారెడ్డి వర్గీయులు మరింత ఆందోళన చెందుతున్నారు. బీజేపీ పొత్తుతో టీడీపీ కొన్నివర్గాల ఓటర్లకు దూరమైంది. దీంతో దిక్కుతోచని ఆ పార్టీ నేతలకు ఇప్పుడు పురందేశ్వరి రూపంలో మరోగండం ఎదురైంది.