‘ప్యూరిఫైడ్’ వెరీ పూర్ | purified water is not purifying properly | Sakshi
Sakshi News home page

‘ప్యూరిఫైడ్’ వెరీ పూర్

Published Tue, Oct 29 2013 4:22 AM | Last Updated on Fri, Jun 1 2018 8:31 PM

purified water is not purifying properly

 అసలే వర్షాకాలం.. ఆపై విష జ్వరాలు.. పరిశుభ్రమైన నీరు తాగి ఆరోగ్యం కాపాడుకోవాలని దిగువ మధ్యతరగతి వారు సైతం క్యాన్ వాటర్ తీసుకుంటూ రోగాలు కొనితెచ్చుకుంటున్నారు. నీటిని శుద్ధి చేయడంలో అత్యధిక ప్లాంట్ల యజమానులు కనీస ప్రమాణాలను పాటించక పోవడంతో మినరల్స్ సమతుల్యత దెబ్బతిని కొత్త రోగాలకు గురికావాల్సి వస్తోంది. మున్సిపాలిటీ వారు సరఫరా చేసే నీటిని కాచి.. చల్లారాక వడబోసుకుని తాగడమంత ఉత్తమం మరోటి లేదని నిపుణులు చెబుతున్నారు.
 
 సాక్షి, అనంతపురం : జిల్లాలోని ప్యూరిఫైడ్ వాటర్ (శుద్ధ జలం) ప్లాంట్లలో నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం పాటించకుండానే యథేచ్ఛగా నీటి వ్యాపారం కొనసాగిస్తున్నారు. రక్షిత నీటి పేరుతో జనాన్ని మోసం చేస్తూ భారీ ఎత్తున దండుకుంటున్నారు. మరీ ముఖ్యంగా గ్రామాల్లో మలినాలతో కూడిన నీటినే విక్రయిస్తున్నారు. ఈ ప్లాంట్ల దందా గురించి ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదు. అనంతపురం నగరంతో పాటు జిల్లాలోని 63 మండలాల్లో 600లకు పైగా వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో ఐఎస్‌ఐ గుర్తింపు కల్గి, నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నవి కొన్ని మాత్రమే. 550కి పైగా ప్లాంట్లలో నిబంధనలకు నీళ్లొదిలారు. జిల్లాలో రోజుకు రూ.40 లక్షలకు పైగా నీటి వ్యాపారం సాగుతోంది. అంటే నెలకు రూ.12 కోట్లకు పైమాటే. ఈ మేరకు వాటర్‌ప్లాంట్ల నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు.
 
 అధికారుల తనిఖీలు శూన్యం
 ప్లాంట్లలో తయారవుతున్న నీటి నాణ్యతను ప్రజారోగ్య విభాగం అధికారులు తనిఖీ చేయడం లేదు. పలుచోట్ల పంచాయతీ, మునిసిపల్ కొళాయిల నుంచి క్యాన్లలో నీటిని నింపి అమ్ముతున్నట్లు ఆరోపణలున్నాయి. మార్కెట్లో విక్రయించే ముందు నీటిలోని జీవ, రసాయన కణాల ఉనికిని తెలుసుకోవడానికి మైక్రో బయాలజీ, బయోకెమికల్ పరీక్షలు నిర్వహించాలి. ఇందుకోసం ప్రతి ప్లాంటులో తప్పనిసరిగా సొంత ప్రయోగశాల, నైపుణ్యం కల్గిన సిబ్బంది ఉండాలి. దాదాపు 85 శాతం ప్లాంట్లలో ప్రయోగశాలలు లేవు. నీటిని పరీక్షించకుండానే ప్రజలకు అంటగడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా క్యాన్లలోనే కాకుండా బాటిళ్లలోనూ నీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రముఖ కంపెనీల పేర్లకు అటూ ఇటుగా పేర్లు పెట్టుకుని.. బాటిళ్లపై లేబుల్స్ అతికించి వ్యాపారం సాగిస్తున్నారు. ఉదాహరణకు.. ‘కిన్లే’ బ్రాండ్‌నేమ్‌కు దగ్గరగా ఉండేలా ‘కింగ్‌లీ’ అని, ‘ఆక్వాఫినా’కు దగ్గరగా ఉండేలా ‘ఆక్వాఫైన్’ అంటూ పేర్లు పెట్టుకుని వ్యాపారం సాగిస్తున్నారు.
 
  బ్రాండ్‌నేమ్‌లో ఒకట్రెండు అక్షరాలు మాత్రమే తేడా ఉంటుండడంతో వినియోగదారులు పెద్దగా గుర్తించలేకపోతున్నారు. ప్రముఖ కంపెనీ నీరే అనుకుని తాగేస్తున్నారు. జిల్లాలోని మెజార్టీ డాబాలు, హోటళ్లలో నకిలీ వాటర్ బాటిళ్లే ఎక్కువగా కనిపిస్తుంటాయి.
 వీటి ధర కూడా ప్రముఖ కంపెనీల వాటర్ బాటిళ్లతో సమానంగానే ఉంటోంది. ఇక వాటర్ ప్యాకెట్ల పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఇంత జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారంటే.. మామూళ్ల మత్తే కారణం అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
 వర్షాకాలంలో బురద నీరు సరఫరా అవుతుండటంతో దిగువ మధ్యతరగతి, పేద ప్రజలు సైతం రూ.20-30 వెచ్చించి క్యాన్ వాటర్‌ను కొనుగోలు చేస్తున్నారు. అయితే చాలా మంది ప్లాంట్ల నిర్వాహకులు కనీస ప్రమాణాలు పాటించక పోవడంతో నీరు కలుషితమవుతోంది. వారం రోజులు నిల్వ ఉంటే పురుగులు పుట్టుకొస్తున్నాయి. చీమలు, దోమల అవశేషాలు కనిపిస్తున్నాయి. సక్రమంగా ఫిల్టర్ చేసి ఉంటే ఇదెలా సాధ్యం.. అని వినియోగదారులు గొడవకు దిగుతున్నారు. సదరు కంపెనీకి గుడ్‌బై చెప్పి మరో కంపెనీ క్యాన్లు తీసుకుంటున్నారు. కొద్ది రోజులకు ఆ కంపెనీ.. షరా మామూలే. వీటన్నిటి కంటే కుళాయి నీటిని కాచి వడబోసి తాగడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
 
 పాటించాల్సిన ప్రమాణాలివే...
  ప్రతి ప్లాంటుకు ఐఎస్‌ఐ గుర్తింపు ఉండాలి.
  వాటర్ టిస్టెంట్ స్టాండర్స్ బ్యూరో నుంచి త్రైమాసిక ధ్రువీకరణ పత్రం ఉండాలి.
  క్వాలిఫైడ్ టెక్నీషియన్ విధిగా అందుబాటులో ఉండాలి.
  రోజూ క్యాన్లను వేడినీళ్లతో శుభ్రపరిచిన తరువాతే నీళ్లను నింపాలి.
  పురపాలక/ పంచాయతీ నుంచి ఎన్‌ఓసీ తప్పనిసరి.
  మైక్రో బయాలజీ, బయోకెమికల్ కల్చరల్ పరీక్షలు నిత్యం నిర్వహించాలి.
  సిబ్బందికి ఆరు నెలలకొకసారి వైద్య పరీక్షలు చేయించాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement