సాక్షి, అమరావతి : టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి పుట్టపర్తిలో ఈసారి టిక్కెట్ ఇవ్వకూడదని టీడీపీ కార్యకర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసం ముందు ఆందోళన చేపట్టారు. రఘునాథరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే పల్లె రఘునాథరెడ్డికి మళ్లీ అవకాశం ఇవ్వాలని మరికొంతమంది నినాదాలు చేశారు. అనుకూలంగా ఒక వర్గం వ్యతిరేకంగా మరో వర్గం పోటాపోటీగా నినాదాలు చేశారు. కొద్ది సేపు ఇరు వర్గాల మధ్య తోపులాట సైతం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అక్కడినుంచి పంపించేశారు.
నవ్యాంధ్రలో పుట్టపర్తి నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఈ నాలున్నరేళ్ల కాలం పనిచేసిన పల్లె రఘునాథరెడ్డి ఏనాడూ నియోజకవర్గ ప్రజల బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఆఖరుకు సొంత పార్టీలోని వారిని సైతం నిర్లక్ష్యం చేస్తూ తానొక్కడే ఆర్థికంగా బలపడుతూ వచ్చారు. అక్రమాలతో ప్రజాధనాన్ని మూట గట్టుకున్నారు. ఇలాంటి తరుణంలో అతనిపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత చోటు చేసుకుంది. ఇప్పటికే పల్లెకు టికెట్ ఇవ్వరాదంటూ పలువురు నేరుగా టీడీపీ అధిష్టానం వద్ద మొరపెట్టుకున్నారు.
తనకే టికెట్ ఇవ్వాలంటూ సీఎం చంద్రబాబు, ఇతర నాయకులను కలిసి బుక్కపట్నంకు చెందిన పెదరాసు సుబ్రహ్మణ్యం పావులు కదుపుతున్నారు. పుట్టపర్తి మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చెన్నకేశవులు, తదితరులు జిల్లా మంత్రి దేవినేని ఉమాను గత బుధవారం కలిసి పల్లెకు ఈసారి టికెట్ ఇవ్వరాదంటూ విజ్ఞప్తి చేశారు. ఈ వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు పల్లె సరికొత్త ఎత్తుగడలతో ప్రజల ముందుకు వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment