బ్యాడ్మింటన్‌ అకాడమీకి ఐదెకరాలు | PV Sindhu meets CM YS Jagan Mohan Reddy in Amaravati | Sakshi
Sakshi News home page

బ్యాడ్మింటన్‌ అకాడమీకి ఐదెకరాలు

Published Sat, Sep 14 2019 3:31 AM | Last Updated on Sat, Sep 14 2019 8:02 AM

PV Sindhu meets CM YS Jagan Mohan Reddy in Amaravati - Sakshi

సాక్షి, అమరావతి/విజయవాడ స్పోర్ట్స్‌ : ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ పీవీ సింధు శుక్రవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. పర్యాటక, యువజన వ్యవహారాల శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, తల్లిదండ్రులు పీవీ రమణ, లక్ష్మిలతో కలసి వచ్చి ఇటీవల ప్రపంచ బ్యాడ్మింటన్‌ పోటీల్లో సాధించిన స్వర్ణ పతకాన్ని ముఖ్యమంత్రికి సింధు చూపించారు. ఈ సందర్భంగా ఆమెను అభినందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. శాలువతో సత్కరించారు. అనంతరం పీవీ సింధు మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి తనను అభినందించడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులోనూ ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారని చెప్పారు. విశాఖపట్నంలో ఐదు ఎకరాల భూమిని కేటాయిస్తామని చెప్పడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పద్మభూషణ్‌ కోసం కేంద్రం తన పేరును సిఫారసు చేసినట్లు తెలిసిందని, ఈ విషయం చాలా సంతోషంగా ఉందని, దీనిపై ఇంకా అధికారికంగా సమాచారం రాలేదని తెలిపారు.  

ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాలి.. 
అనంతరం మంత్రి అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. సింధు సాధించిన విజయం పట్ల ముఖ్యమంత్రి చాలా సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆయన మనస్ఫూర్తిగా ఆకాంక్షించారని, రాబోయే ఒలింపిక్స్‌లో సింధు గోల్డ్‌ మెడల్‌ సాధించాలని అభిలషించారని తెలిపారు. అమ్మాయిల కోసం ఒక బ్యాడ్మింటన్‌ అకాడమీ ఉంటే బాగుంటుందని సింధు కోరారని, ఇందుకు విశాఖపట్నంలో ఐదు ఎకరాలను కేటాయిస్తామని ముఖ్యమంత్రి ఆమెకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. సింధుతో పాటు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, క్రీడాసంఘాల ప్రతినిధి చాముండేశ్వరనాథ్‌ ఉన్నారు.

సింధును సత్కరించిన గవర్నర్‌ 
విజయవాడలోని రాజ్‌భవన్‌ దర్బార్‌ హాలులో సింధును గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ శుక్రవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ పీవీ సింధు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాకుండా, భారతీయులందరికీ గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు, గవర్నర్‌ కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా తదితరులు పాల్గొన్నారు.   

సింధుకు ‘శాప్‌’ సన్మానం 
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) ఆధ్వర్యంలో  శుక్రవారం విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో బ్యాడ్మింటన్‌ ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధుతో పాటు ఆమె తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మంత్రులు ముత్తంశెట్టి, కురసాల, ఏపీ అధికార భాష సంఘం చైర్మన్‌ యార్లగడ్డ,  ఎమ్మెల్యే మల్లాది విష్ణు, శాప్‌ వీసీ అండ్‌ ఎండీ కాటమనేని భాస్కర్, క్రీడా శాఖ ముఖ్య కార్యదర్శి కె. ప్రవీణ్‌ పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement