సాక్షి, బాలాజీచెరువు(కాకినాడసిటీ): సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నాం. విదేశీ వర్సిటీలతో కోర్సుల ఒప్పందాలు, మ్యూక్స్ ఆన్‌లైన్ కోర్సుల నిర్వహణతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నామంటూ పత్రికా ప్రకటనలు విడుదల చేసే వర్సిటీ అధికారులు ప్రపంచస్థాయి వర్సిటీ ర్యాంకుల్లో జేఎన్‌టీయూకేకు చోటు కల్పించలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్షల్లో వేతనాలు తీసుకుంటున్నాం.. వర్సిటీకి తగిన గుర్తింపు కోసం అన్ని విభాగాలు కలిసికట్టుగా పోరాడదామన్న ఆలోచన లేకుండాపోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
వర్సిటీలో ఏదైనా డైరెక్టర్ పోస్టు ఖాళీ అయితే ఆ పదవిని తమకున్న అధికార, ధన, కుల బలాలతో సర్వశక్తులూ ఒడ్డి దక్కించుకునే అధికారులు జేఎన్‌టీయూకే అభివృద్ధికి ఎలాంటి కృషి చేయడం లేదనే విషయం స్పష్టమవుతోంది. ఇటీవలే విడుదల చేసిన క్యూఎస్ ర్యాంకుల్లో సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న జేఎన్‌టీయూ కాకినాడకు స్థానం లేకపోవడం విస్మయానికి గురి చేసింది. విశ్వవిద్యాలయాలకు ప్రపంచ ఆసియా బ్రిక్స్ ర్యాంకులు ఇచ్చే క్యూ ఎస్ సంస్థ విడుదల చేసిన 2018 ఫలితాల్లో జేఎన్‌టీయూ కాకినాడ ఎక్కడా కనిపించడకపోవడం గమనార్హం.
ఏపీ ఎంసెట్, పీజీ సెట్, పోలీస్ రిక్రూట్‌మెంట్ వంటి ప్రతిష్టాత్మక పరీక్షలు నిర్వహిస్తున్న వరిర్సిటీకి గుర్తింపు రాలేదు. అకడమిక్, పరిశోధన, అధ్యాపకులు, విద్యార్థుల నిష్పత్తి, వర్సిటీ ప్రతిష్ట తదితర అంశాలను ఆధారంగా అందజేసే ఈ ర్యాంకులలో జేఎన్‌టీయూ కాకినాడకు స్థానం లభించలేదు. ఏపీలో అనంతపురం, వైజాగ్ ఏయూ, శ్రీవేంకటేశ్వర, శ్రీకృష్ణదేవరాయ వర్సిటీలకు 500 లోపు ర్యాంకులు సాధించగా జేఎన్‌టీయూ కాకినాడ దరిదాపుల్లో కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని పెంచేలా అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు తగ్గకుండా సాంకేతిక యూనివర్సిటీలు రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ముఖ్యమంత్రి కృషి చేస్తున్నా దానికి తగ్గట్టుగా వర్సిటీ అధికారులు కృషి చేయడంలేదు. రాష్ట్ర విభజనకు ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జేఎన్‌టీయూ అనంతపురం, జేఎన్‌టీయూ హైదరాబాద్, జేఎన్‌టీయూ కాకినాడ అంటూ మూడుగా విభజించాక జేఎన్‌టీయుహెచ్ తెలంగాణాలో ఉండిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో జేఎన్టీయూ అనంతపురం, కాకినాడ ఉన్నాయి. ప్రతిభ చూపిన నాలుగు వర్సిటీలకు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్రువీకరణ పత్రాలను ఆయా వర్సిటీల వీసీలకు అందజేస్తున్న నేపథ్యంలో ఆ అదృష్టం జేఎన్‌టీయూకేకు లేదు. ప్రస్తుత ఉపకులపతి అభివృద్ధి, పరిపాలనపై పెద్దగా దృష్టిసారించకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని వర్సిటీ వర్గాలు పేర్కొంటున్నాయి. తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని వీసీగా నియమించుకున్న ముఖ్యమంత్రి ఆ వర్సిటీకి గుర్తింపురాకపోవడంపై గల కారణాలు తెలుసుకుంటారని వర్సిటీ ప్రొఫెసర్ అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment