
సాక్షి ప్రతినిధి, కాకినాడ/బాలాజీచెరువు: ఆయనో బాధ్యతాయుత వృత్తిలో ఉన్న ప్రొఫెసర్. ఉన్నత విలువలు బోధించి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి. అలాంటి వ్యక్తే దారితప్పాడు.. తన వద్ద చదివే విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేశాడు. విద్యార్థినుల ఫిర్యాదు ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్‌టీయూలో సీఎస్‌ఈ, వీఎల్‌ఎస్‌ఐ విభాగాల్లో ఎంటెక్ మొదటి సంవత్సరం సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 23, 24, 25 తేదీల్లో నిర్వహించారు.
ల్యాబ్‌లో జరగాల్సిన ‘వైవా’ మాత్రం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఎస్‌టీ) డైరెక్టర్ ప్రొఫెసర్ కె.బాబులు క్యాబిన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంలో అబ్బాయిలను త్వరగా పంపించి తమను తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఇరవై మందికి పైగా విద్యార్థినులతో ఆయన వ్యవహరించారని ప్రిన్సిపాల్, రిజిస్ట్రార్లకు రాతపూర్వకంగా శనివారం ఫిర్యాదు చేశారు. ఆయన ప్రవర్తన చాలా జుగుప్సాకరంగా ఉందని, అలాంటి ఫ్యాకల్టీ తమకొద్దంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరికి మద్దతుగా ఇతర విభాగాలకు చెందిన విద్యార్థులు సంతకాలు చేశారు.
ఐదుగురు సభ్యులతో కమిటీ..
ఎంటెక్ విద్యార్థినుల ఫిర్యాదుతో జేఎన్‌టీయూకే వైస్ చాన్సలర్ కుమార్.. రెక్టార్ పూర్ణానందం చైర్మన్‌గా ఐదుగురు సభ్యులతో విచారణ కమిటీ వేశారు. ఈ కమిటీ బాధిత విద్యార్థినులను పిలిచి మాట్లాడింది. వీరందరి దగ్గర స్టేట్‌మెంట్‌లను తీసుకున్నారు. ఆదివారం ప్రొఫెసర్ బాబులు వివరణ తీసుకున్నాక నివేదిక అందిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.