ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: గ్రామీణ ప్రజలకు అందుతున్న వైద్య సేవలను న్యూస్‌లైన్ బృందం సోమవారం జిల్లావ్యాప్తంగా పరిశీలించింది. ఈ పరిశీలనలో..గ్రామీణులకు వైద్యసేవలందించడంలో నిర్లక్ష్యం ప్రస్ఫుటమైంది. జిల్లాలో 85 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో ప్రతి 5 వేల జనాభాకు ఒక రెగ్యులర్ ఏఎన్‌ఎం గ్రామాల్లోని సబ్‌సెంటర్లలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి అదనంగా రెండో ఏఎన్‌ఎంలను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్నారు. మొత్తం 540 సబ్‌సెంటర్లకుగాను 535 మంది కాంట్రాక్టు ఏఎన్‌ఎంలు జిల్లాలో ఉన్నారు. స్థానికంగా గ్రామాల్లోనే ఉండి వైద్యసేవలందించాల్సిన వారు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు. పనిచేసే చోటే నివాసం ఉండాలన్న నిబంధనకు పాతరేస్తున్నారు.
అగ్రిమెంట్‌ను కాలరాస్తున్న వైనం..
స్థానికంగా ఉంటామని స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ చేస్తేనే రెండో ఏఎన్‌ఎంను విధుల్లోకి తీసుకుంటారు. ఏ మండలంలో విధులు నిర్వహించాల్సిన సెకండ్ ఏఎన్‌ఎంలను ఆ మండల పరిధి నుంచే ఎంపిక చేయాలి. కానీ అభ్యర్థులు లభ్యం కావడం లేదన్న సాకుతో అధికారులు ఇతర మండలాలకు చెందిన వారిని ఉద్యోగాలకు ఎంపిక చేయడంతో వారు పనిచేసే చోట నివాసం ఉండటం లేదు.
గర్భిణులు, శిశువులకు వైద్య పరీక్షలు నిర్వహించడం, పిల్లలు, బాలింతలు గర్భిణులకు వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో వేయడం, గర్భిణుల బరువు, ఎత్తు ప్రతినెలా నమోదు చేయడం, వారికి ఆరోగ్యపరమైన సలహాలు, సూచనలివ్వడం వంటివి చేయాలి. తాత్కాలిక గర్భ నిరోధక పద్ధతుల గురించి అవగాహన కల్పించడం, కుటుంబ సంక్షేమ శస్త్ర చికిత్సలను ప్రోత్సహించాలి. గర్భిణులకు ఐరన్, ఫోలిక్ మాత్రలివ్వడం, ప్రసవం కోసం పీహెచ్‌సీలకు తీసుకెళ్లాలి. 24 గంటలూ గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉండాలి.
పట్టణాలు, మండల కేంద్రాల నుంచి రాకపోకలు..
గ్రామాల్లో స్థిర నివాసం ఉండి వైద్యసేవలందించాల్సిన సెకండ్ ఏఎన్‌ఎంలు పట్టణాలు, మండల కేంద్రాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. కొంత మంది వారానికి ఒకసారి కూడా సబ్‌సెంటర్ మొహం చూడటం లేదు. ఏఎన్‌ఎంలు గ్రామాల్లో బుధ, శనివారాలు టీకాలు వేయాల్సి ఉంది. మంగళ, శుక్రవారాలు గ్రామాల్లో టీకాలు వేయని వారి పేర్లు నమోదు చేసుకోవాలి. జ్వరాలు, డెంగీ,మలేరియా తదితర అంటువ్యాధులు పది మంది కంటే ఎక్కువ మందికి సోకినప్పుడు వెంటనే పరిధిలోని ఆరోగ్య కేంద్రాల వైద్యులకు తెలియజేసి వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలి. టీబీ రోగులు ఉంటే వెంటనే వైద్యశాలకు తరలించాలి.
అమలు కాని జీఓ నంబర్ 98
రెండో ఏఎన్‌ఎంలతో పాటూ ఇతర వైద్య ఉద్యోగులు పని చేసేచోటే నివాసం ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ డెరైక్టర్ జీఓ నంబర్ 98 ద్వారా గత ఏడాది ఆదేశాలు జారీ చేసినప్పటికీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యంతో అమలు కావడం లేదు.
చీరాల నియోజకవర్గ పరిధిలో...
ఈపూరుపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 17 మంది సెకండ్ ఏఎన్‌ఎంలు ఉండగా 16 మంది మాత్రమే విధులకు హాజరవుతున్నారు. వీరిలో చాలా మంది ఒంగోలు, పర్చూరు, ఇంకొల్లు, తదితర ప్రాంతాల నుంచి వచ్చి విధులు నిర్వహిస్తున్నారు.
కనిగిరిలో..
నియోజకవర్గంలోని సీఎస్‌పురం, పీసీపల్లి మండలాల్లో 24 గంటల పాటు వైద్య సేవలు అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో నియమించిన సిబ్బంది రాత్రి వేళల్లో అందుబాటులో ఉండటం లేదు.
మార్కాపురంలో..
మార్కాపురం నియోజకవర్గ పరిధిలో సిబ్బంది కొరత ఉంది. వైద్య పరికరాలు పనిచేయడం లేదు. కొనకనమిట్లలో 8 ఏఎన్‌ఎం పోస్టులుండగా, రెండు ఖాళీగా ఉన్నాయి. కొంత మంది సిబ్బంది పొదిలిలో నివాసం ఉంటూ రాకపోకలు సాగిస్తున్నారు.
అద్దంకి పరిధిలో..
నియోజకవర్గంలోని అద్దంకి, పంగులూరు, కొరిశపాడు, సంతమాగులూరు మండలాల్లో మొత్తం 59 మంది సెకండ్ ఏఎన్‌ఎంలున్నారు. మోదేపల్లి పీహెచ్‌సీ పరిధిలో 11 మంది సెకండ్ ఏఎన్‌ఎంలు ఉండగా వీరిలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారందరూ మోదేపల్లిలో నివాసం ఉండటం లేదు. కొరిశపాడు, పంగులూరు మండలాల్లోని సెకండ్ ఏఎన్‌ఎంలు కూడా హెడ్ క్వార్టర్స్‌లో నివాసం ఉండటం లేదు. సంతమాగులూరు మండలంలోని 11 మంది సెకండ్ ఏఎన్‌ఎంలు మార్టూరు,అద్దంకి, మేదరమెట్ల, నరసరావుపేటల్లో నివాసం ఉంటున్నారు. బల్లికురవ మండలంలోని ఏఎన్‌ఎంలు కూడా హెడ్ క్వార్టర్స్‌లో నివాసం ఉండడం లేదు.
కానరాని కాంట్రాక్టు సేవలు
Published Tue, Jan 14 2014 2:04 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement