- గిరిజన విద్యాలయాల్లో అందివ్వాలని ఐటీడీఏ పీవో ఆదేశం
- రూ. 250 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పన
- ఆశ్రమాల్లో సరుకులు పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు
- విద్యార్థులపై శ్రద్ధ తీసుకోవాలని హెచ్‌ఎంలు, ఏటీడబ్ల్యూవోలకు స్పష్టీకరణ
పాడేరు: గిరిజన సంక్షేమ విద్యాలయాల్లో రూ. 250 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఐటీడీఏ పీవో వి.వినయ్‌చంద్ వెల్లడించారు. అక్కడ విద్యార్థులకు గుణాత్మకమైన విద్య, నాణ్యమైన మెను అందించాలని ఆయన ఆదేశించారు. గిరిజన సంక్షేమ ఆశ్రమాలు, గురుకులాలు, కేజీబీవీ, ప్రభు త్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో బుధవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పీవో వినయ్‌చంద్ మాట్లాడుతూ అదనపు తరగతి భవనా లు, తాగునీరు, విద్యుత్ సదుపాయాల కల్పనకు అధికంగా నిధులు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి గత విద్యాసంవత్సరంలో రూ. 123 కోట్లతో, ఈ విద్యా సంవత్సరం లో రూ. 127 కోట్లతో మౌలిక సదుపాయాలకు సం బంధించిన అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరిం చారు. వాటన్నింటినీ ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాలని సూచించారు. పరి శుభ్రత కార్యక్రమాలతో పాటు మొక్కలను విరివిగా పెంచి ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించాలన్నారు.
పదో తరగతి విద్యార్థులపై ఇప్పటి నుంచే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని చెప్పారు. ఏజెన్సీలోని 11 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తామని, వారంతా ఆశ్రమాలను తనిఖీ చేస్తారని పేర్కొన్నారు. విద్యార్థులకు సంబంధించిన నిత్యావసర సరుకులను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హెచ్‌ఎంలు ఆఖరి అరగంటలో రోజువారి పాఠశాలలు, ఆశ్రమ రికార్డులను తనిఖీ చేయాలని ఆదేశించారు. ఏటీడబ్ల్యూవోలు కూడా ఆశ్రమాలను, పాఠశాలలను తరచుగా తనిఖీ చేయాలన్నారు.
ప్రతి ఆశ్రమ పాఠశాలకూ నిరంతర నీటి సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. అన్ని యాజమాన్య విద్యాసంస్థల్లోనూ జవహర్ బాలల ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని సక్రమంగా అమలు చేయాలని పీవో ఆదేశించారు. విద్యార్థులకు హెల్త్ రికార్డు నిర్వహించి, వారికి సకాలంలో మెరుగైన వైద్యసేవలు అందేలా ఏటీడబ్ల్యూవోలంతా చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివాసీ విద్యార్థుల ప్రవేశాలపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
పాఠశాలలో సాధించిన ఫలితాలు, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ, పారిశుద్ధ్యం, నాణ్యమైన మెను అమలు అంశాల ఆధారంగా ఆశ్రమాలకు గ్రేడింగ్ ఇస్తామని వివరించారు. నాల్గో తరగతి ఉద్యోగుల సమస్యలను గిరిజన సంక్షేమ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే పరిష్కారమవుతాయని పీవో తెలిపారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్ బి.మల్లికార్జునరెడ్డి, ఐటీడీఏ ఏపీవో పీవీఎస్ నాయుడు, ఏటీడబ్ల్యూవోలు పాల్గొన్నారు.