పంగులూరు, నూస్‌లైన్: భారీ వర్షాలకు పంగులూరు మండలంలో పంట నష్టపోయిన రైతులకు సత్వరమే పరిహారం అందించాలని వైఎస్‌ఆర్ సీపీ రైతు విభాగం జిల్లా కన్వీనర్ మారెడ్డి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని చందలూరు పొలాల్లో దెబ్బతిన్న పత్తి, మిరప పైర్లను సోమవారం ఆయన పరిశీలించారు. జిల్లాలో 42 వేల హెక్టార్ల విస్తీర్ణంలో పత్తి సాగు చేశారని, మండలంలో 5,500 ఎకరాల్లో సాగు చేసిన పత్తి అధిక వర్షాలకు తుడిచిపెట్టుకుపోయిందన్నారు. గూడ, పూత, పిందె రాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎకరాకు రూ. 10 వేలకు తగ్గకుండా పరిహారం అందిస్తేనే ప్రత్యామ్నాయ పైరు వేసేందుకు అవకాశం ఉంటుందని సుబ్బారెడ్డి అన్నారు.
వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులకు ఉన్న భరోసా ప్రస్తుతం లేదని, ఆయన హయాంలో క్వింటా పత్తి రూ.7,500 పలకగా, ప్రస్తుతం రూ. 3,500కు మించి లేకపోవడం రైతులకు శాపంగా మారిందన్నారు. ఆనాడు రూ. 550 కే లభించిన యూరియా ప్రస్తుతం రూ. 1250 దాకా పలుకుతోందని, పెరిగిన ఖర్చులతో రైతు వ్యవసాయం చేసే స్థితిలో లేడన్నారు. ఎకరా పత్తికి రూ. 20 వేల నుంచి రూ. 25 వేలు, మిరపకు రూ. 20 నుంచి రూ.25 వేల వరకు పెట్టుబడులు పెట్టారని, ఆరుగాలం పండించిన పంట చేతికందే దశలో ఈ ఘోర విపత్తు సంభవించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పక్షం ఒత్తిళ్లకు అధికారులు తలవంచకుండా పంట నష్టపోయిన రైతులందరికీ నిష్పక్షపాతంగా పరిహారం అందించాలని, కౌలు రైతులకు నేరుగా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట ఏఎంసీ చైర్మన్ పులికం కోటిరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కరి వెంకట సుబ్బారావు, ఎస్సీ సెల్ కన్వీనర్ సందెపోగు రవీంద్ర, వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు నాగబోయిన తిరుపతయ్య, షేక్ మస్తాన్‌వలి, పెంట్యాల రామాంజనేయులు, మురకొండ సుబ్బారావు, గ్రామ రైతులు ఉన్నారు.
రైతులకు సత్వరం పరిహారం అందించాలి
Published Tue, Oct 29 2013 6:40 AM | Last Updated on Sat, Sep 2 2017 12:06 AM
Advertisement