ఐక్యతతో రాజ్యాధికారం సాధిద్దాం
బీసీలకు ఆర్.కృష్ణయ్య పిలుపు
ఆదోని: ఐక్యంగా రాజ్యాధికారం సాధించుకుందామని బీసీలకు ఆ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి పట్టణంలోని రిక్రియేషన్ క్లబ్ ఆవరణలో బీసీ యువగర్జన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ.. ఐక్యతలో ముస్లింలను బీసీలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. బీసీల్లోని ప్రతి సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయికి కనీసం ఒక నాయకుడైనా ఎదగాలని కోరారు. ఎన్నికల ముందు తాను కేసీఆర్‌ను, చంద్రబాబు నాయుడును బీసీలకు కూడా టిక్కెట్ ఇవ్వాలని కోరగా ఇందుకు తాము సమ్మతమేనని, అయితే బీసీలు ఓట్లేస్తారా అని ఎదురు ప్రశ్న వేశారని అన్నారు. బీసీల బలహీనత ఏమిటో నాయకులకు తెలియడం వల్లే రాజ్యాధికారంలో భాగస్వాములు చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సబ్ ప్లాన్ మంజూరు చేయాలి
సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగిన కాపుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబు.. ఆ సదుపాయాలను బీసీలకు ఎందుకు కల్పించకూడదని ప్రశ్నించారు. బీసీలకు సబ్‌ప్లాన్ మంజూరు చేసి 80శాతం సబ్సిడీతో రుణ సదుపాయం కల్పించాలని కోరారు. రాష్ట్రంలో కులగణన కోసం వెంటనే ప్రత్యేక కమిషన్‌ను నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు సామాజిక వర్గాల వారీగా ప్రభుత్వం వద్ద జనాభా లెక్కలు లేకపోవడంతో కొన్ని వర్గాలు బాగా నష్టపోతున్నాయని విశ్లేషించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 50వేల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం పార్లమెంట్‌లో బిల్లు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ, ఏపీ సీఎంలు ఒత్తిడి తీసుకురావాలన్నారు. అంతకు ముందు గంగపుత్ర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య, బీసీ సంఘాల రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు కృష్ణమ్మ, ఎలిగే పాండురంగారావు, కర్రి వేణుమాధవ్, పద్మజనాయుడు, దేవేంద్రప్ప, రామాంజనేయులు, ఉమామహేశ్వర్ తదితరులు ప్రసంగించారు. ఆదోని డివిజన్ బీసీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి దస్తగిరి నాయుడు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు ధనుంజయాచారి, కునిగిరి నీలకంఠ, కునిగిరి నాగరాజు, గుడిసె శ్రీరాములు, చెన్నబసప్ప, ఈరన్న తదితరులు పాల్గొన్నారు.