
బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి
వరంగల్, న్యూస్‌లైన్ : బీసీల రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కృషయ్య డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా హన్మకొండలో బుధవారం జరిగిన బీసీ గర్జన సభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయాలని, బీసీ ఉప ప్రణాళికను అమలుచేయాలన్నారు. జనాభా ప్రకారం బీసీలకు 54 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ శాతం 50 శాతం మించిందని కోర్టుకెళ్లగా.. బీసీ సంక్షేమ సంఘం సుప్రీంకోర్టుకు వెళ్లి 34 శాతం రిజర్వేషన్ సాధించుకుందని చెప్పారు. బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల లో లేని రిజర్వేషన్లు ఇక్కడ ఉన్నాయన్నారు. ఈ రిజర్వేషన్లు ఇలాగే కొనసాగాలంటే చట్టబద్ధత కల్పించాల్సిన అవసరముందన్నారు.
అదే విధంగా చట్ట సభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, ఈ దిశగా పోరాటం ఉధృతం చేస్తామని కృష్ణయ్య చెప్పారు. రాజకీయ పార్టీలు బీసీలకు చట్ట సభల్లో సగం సీట్లు కేటాయించాలని, అలా కేటాయించని పార్టీలను బొందపెడతామని హెచ్చరించారు. సర్పంచ్‌లకు చెక్ పవర్ లేకుండా చేసి వారి ఆత్మాభిమానాన్ని దెబ్బ తీశారన్నారు. సీల్డ్‌కవర్ ద్వారా నియమితుడైన ముఖ్యమంత్రికి చెక్ పవర్ ఉండొచ్చు కానీ, నేరుగా ప్రజల ద్వారా ఎన్నికైన సర్పంచ్‌లకు చెక్‌పవర్ ఉండొద్దా అని ప్రశ్నించారు. సర్పంచులకు చెక్ పవర్ ఇవ్వకుంటే ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మంత్రి జానారెడ్డిల పదవులకు ఎసరు పెడతామని, రాష్ట్రంలోని సర్పంచులందరితో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. న్యాయమూర్తులు నియామకానికి రిజర్వేషన్లు అవసరంలేదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని కృష్ణయ్య ఖండించారు.