సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో సీమాంధ్ర జిల్లాల్లో ఉద్యోగులు సమ్మెతో పాటు ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగడంతో ఆ సెగ రాష్ట్ర ఖజానాను తాకింది. దీంతో ఆగస్టు నెలలో రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయం రూ. 2 వేల కోట్లకు పైగా తగ్గిపోయింది. సాధారణ పరిస్థితుల్లో ప్రతి నెలా రాష్ట్ర ఖజానాకు వివిధ పన్నుల రూపంలో రూ.6,000 కోట్ల ఆదాయం వస్తుంది. అయితే సీమాంధ్రలోని 13 జిల్లాల్లో సమైక్యాంధ్ర పేరుతో ప్రజలతో పాటు ఉద్యోగులు కూడా ఆందోళనకు దిగడంతో ఆ జిల్లాల్లో వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి.
ఆగస్టు నెలలో ఖజానాకు రూ. 4 వేల కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. రవాణా వ్యవస్థ స్తంభించడంతో రవాణా, మోటారు వాహనాల పన్ను ద్వారా రావాల్సిన ఆదాయంలో రూ.167 కోట్ల మేర గండి పడింది. రవాణా, మోటారు వాహనాల పన్ను ద్వారా 357 కోట్ల రూపాయలు ఆదాయం రావాల్సి ఉండగా కేవలం 190 కోట్ల రూపాయలు ఆదాయం మాత్రమే వచ్చింది.
సీమాంధ్ర జిల్లాలకు మద్యం రవాణా సక్రమంగా జరగడం లేదు. దీంతో పాటు కొన్ని చోట్ల బార్లు, మద్యం దుకాణాలు కూడా బంద్ పాటించాయి. దీంతో ఎక్సైజ్ ఆదాయంలో రూ. 416 కోట్ల మేర గండిపడింది. రూ. 616 కోట్ల ఆదాయం రావాల్సింది రూ. 200 కోట్లు మాత్రమే వచ్చింది. సీమాంధ్ర జిల్లాల్లోని ప్రధాన నగరాల్లో వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. దీంతో వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయం రూ. 675 కోట్ల రూపాయల మేర తగ్గింది. వ్యాట్ ద్వారా రూ. 4,314 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా రూ. 3,639 కోట్లు మాత్రమే వచ్చింది. ఉద్యోగుల సమ్మెతో సీమాంధ్ర జిల్లాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రావాల్సిన ఆదాయంలో రూ. 336 కోట్ల మేర గండిపడింది.
రూ. 526 కోట్లు రావాల్సి ఉండగా కేవలం రూ.190 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. గనులు-భూగర్భ వనరుల ఆదాయంలో రూ.103 కోట్ల మేర గండిపడింది. గనుల ద్వారా రూ. 253 కోట్ల మేర ఆదాయం రావాల్సి ఉండగా, రూ.150 కోట్లు మాత్రమే వచ్చాయి. రూ. 220 కోట్లు రావాల్సిన పన్నేతర ఆదాయానికి రూ. 180 కోట్ల మేర గండిపండింది. రూ.40 కోట్లు మాత్రమే పన్నేతర ఆదాయం వచ్చింది. సీమాంధ్ర జిల్లాల్లో ఉద్యమానికి సంఘీభావంగా సినిమా థియేటర్లలో మార్నింగ్ షో, మ్యాట్నీలను నిలిపివేశారు. దీంతో వినోదపు పన్ను ఆగస్టు నెలలో రూ.125 కోట్ల మేరకు తగ్గింది.