state budjet
-
‘సాగునీటి’కి కోతే!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రం ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్లో సాగునీటి శాఖకు మళ్లీ కోతపడే అవకాశాలున్నాయి. ఆర్థిక మాంద్యం, కేంద్ర కేటాయింపుల్లో తగ్గుదల నేపథ్యంలో ఈమారు సాగునీటి రంగానికి బడ్జెట్ కేటాయింపులు తగ్గే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019–20లో మినహా అంతకుముందు ఏడాదుల్లో వరుసగా రూ.25 వేల కోట్ల మేర కేటాయింపులు చేయగా, ఈ ఏడాది రూ.10 వేల కోట్లకు మించి ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఎప్పటి మాదిరే రుణ సంస్థల నుంచి ప్రధాన ప్రాజెక్టులకు తీసుకుంటున్న రుణాల ద్వారానే మళ్లీ గట్టెక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టులకే.. ఆర్థిక మాంద్యం దెబ్బతో గతేడాది సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో సాగునీటి శాఖకు కేవలం రూ.8,476.17 కోట్లకు తగ్గించింది. ఇందులో మేజర్ ఇరిగేషన్‌కు రూ.7,794.30 కోట్లు కేటాయించగా, మైనర్ ఇరిగేషన్‌కు రూ.642.30 కోట్లు కేటాయించింది. ఇందులో నిర్వహణ పద్దు కింది కేటాయింపులను పక్కనపెడితే ప్రగతిపద్దు కింది కేటాయింపులు కేవలం రూ.6,500 కోట్లు మాత్రమే ఉన్నాయి. మొత్తంగా 2019–20 వార్షికంలో ఏప్రిల్ నుంచి ఇంతవరకు రూ.18 వేల కోట్ల మేర ఖర్చయింది. ఇందులో రూ.10 వేల కోట్ల మేర రుణాల ద్వారా చేసిన ఖర్చు కాగా, మిగతా రూ.8 వేల కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించారు. ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్న సీతారామ ఎత్తిపోతల, కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకే అధిక నిధుల ఖర్చు జరిగింది. వచ్చే వార్షిక బడ్జెట్లో రూ.21 వేల కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుంచి, మరో రూ.22 వేల కోట్లు రుణాల రూపేణా కేటాయించాలని సాగునీటి శాఖ ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపింది. అయితే కేంద్ర వాటా తగ్గడం, ఆర్థిక మాంద్యం ఛాయలు తగ్గకపోవడంతో ఈ ఏడాది సైతం బడ్జెట్లో కేటాయింపులు రూ.10 వేల కోట్లకు మించి ఉండవని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. ఇందులోనూ మునుపటి మాదిరే కాళేశ్వరం, సీతారామ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకే అధికంగా కేటాయింపులు దక్కే అవకాశం ఉంది. పాలమూరు–రంగారెడ్డికి రూ.2 వేల కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.1,500 కోట్లు, సీతారామ ఎత్తిపోతలకు మరో రూ.2 వేల కోట్లు, దేవాదులకు రూ.600 కోట్లు, తుపాకులగూడెంకు రూ.300 కోట్లు కేటాయించే అవకాశాలున్నాయి. రాష్ట్ర బడ్జెట్ నిధులతో పాటే ఇప్పటికే ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల ద్వారా గరిష్టంగా రూ.15 వేల కోట్ల మేర రుణాలతోనే ఈ ప్రాజెక్టులకు నిధుల లభ్యత పెంచనున్నారు. పాత ప్రాజెక్టులకు నిరాశే.. ఇక పాత ప్రాజెక్టులకు మాత్రం మళ్ళీ నిరాశ తప్పేలా లేదు. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమాతో పాటు ఎల్ఎల్బీసీ టన్నెల్‌తో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులకు నిధుల కోత తప్పదని నీటిపారుదల వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తవ్వాలంటే కనిష్టంగా రూ.1,200 కోట్లు అవసరముంది. అయితే ఇప్పటికే సాగునీటి శాఖ పరిధిలో రూ.10 వేల కోట్ల మేర పెండింగ్ బిల్లులుండగా, ఇందులో ప్రధాన పనులకు సంబంధించి రూ.5,500 కోట్లున్నాయి. ప్రస్తుతం బడ్జెట్లో ప్రవేశపెట్టే నిధులు పనులకు సంబంధించిన పెండింగ్ పనులకే చెల్లిస్తే, మిగిలే నిధులు చాలా తక్కువ. ఇవీ ప్రాధాన్యత ప్రాజెక్టులకు ఖర్చుచేస్తే పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కష్టతరంగా మారనుంది. -
రాష్ట్ర రుణ ప్రణాళిక...లక్ష్యం రూ.లక్షకోట్లు
సాక్షి, హైదరాబాద్: రూ.లక్ష కోట్లతో రాష్ట్ర రుణ ప్రణాళిక ఉండాలని నాబార్డు నిర్ణయించింది. ఈ మేరకు బ్యాంకులకు దిశానిర్దేశం చేస్తూ బుధవారం ‘స్టేట్ ఫోకస్ పేపర్–2019–20’ను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆధ్వర్యంలో విడుదల చేసిన ఈ పత్రంలో మొత్తం 70 శాతం పంట రుణాలకే కేటాయించాలని దిశానిర్దేశం చేయడం గమనార్హం. వ్యవసాయానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నందున ఆ మేరకు కేటాయింపులు పెంచాలన్నది నాబార్డు ఉద్దేశంగా కనిపిస్తోంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను వివిధ రంగాలకు రుణ కేటాయింపులు ఎలా ఉండాలన్న దానిపై నాబార్డు అన్ని జిల్లాల నుంచి వివిధ శాఖల ద్వారా క్షేత్రస్థాయి వివరాలను సేకరించింది. వాటిని క్రోడీకరించి ఈ ఫోకస్ పేపర్‌ను విడుదల చేసింది. దీని ఆధారంగానే రాష్ట్ర రుణ ప్రణాళికను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) త్వరలో విడుదల చేయనుంది. పంట రుణాలకు రూ. 49,785 కోట్లు... క్షేత్రస్థాయి సర్వేల ద్వారా వేసిన అంచనా ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1,01,378 కోట్ల రుణం లక్ష్యంగా ముందుకు వెళ్లాలంది. 2018–19 ఫోకస్ పేపర్లో రాష్ట్ర రుణ పరిమితి రూ. 83,388 కోట్లు కాగా, ఈసారి అదనంగా రూ. 17,990 కోట్లు కేటాయించాలని పేర్కొంది. రూ. 70,965 కోట్లు ఇచ్చి వ్యవసాయం, పశుసంవర్థకశాఖ, మత్స్యశాఖ సహా అనుబంధ రంగాలకు ప్రాధాన్యాన్ని ఇవ్వాలంది. అందులో రూ. 46,344 కోట్లు పంట రుణాలకు , అంటే 2018–19 లక్ష్య పత్రంతో పోలిస్తే అదనంగా రూ. 3,441 కోట్లు కేటాయించాలంది. వ్యవసాయ యాంత్రీకరణ కోసం రూ. 2,833 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. వ్యవసాయ మార్కెటింగ్‌లో మౌలిక సదుపాయాలు, గోదాములకు రూ. 1401 కోట్లు కేటాయించాలని సూచించింది. గృహ రుణాలకు రూ. 5,834 కోట్లు, విద్యా రుణాలకు రూ. 2,009 కోట్లు కేటాయించింది. 2019–20 నాబార్డు స్టేట్ ఫోకస్ పేపర్ ప్రకారం రుణ ప్రణాళిక అంచనా అంశం కేటాయింపు (రూ. కోట్లల్లో) 1) పంట రుణాలు 49,785.59 2) వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు 21,179.58 3) సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు 21,065.98 4) విద్య రుణాలు 2,009.41 5) గృహ రుణాలు 5,834.94 6) రెన్యువబుల్ ఎనర్జీ 317.38 7) సామాజిక మౌలిక సదుపాయాలు 1008.92 8) ఇతరాలు 176.80 మొత్తం 1,01,378.60 -
రాష్ట్ర బడ్జెట్ కౌంట్ డౌన్ షురూ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నెల రెండో వారంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ఆర్థిక శాఖ సన్నాహాలు మెదలుపెట్టింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దిశానిర్దేశం మేరకు వరుసగా ఐదో ఏడాది భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేశంలోని రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో ఆర్థిక పరిస్థితులేంటి.. గతేడాది జూలై నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ ప్రభావం ఎంత.. ఆదాయ వ్యయాలెలా ఉన్నాయో.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తమ ఆదాయ వ్యయాల చిట్టాను కాగ్‌కు సమర్పించింది. 2018 జనవరి నెలాఖరు వరకు ఉన్న వివరాలను ఇందులో పొందుపరిచింది. రూ.1.10 లక్షల కోట్లకు ఆదాయం! కాగ్‌కు సమర్పించిన నివేదిక ప్రకారం.. 2017–18 ఆర్థిక సంవత్సరంలో మిగులు ఆదాయం ఉంటుందని ప్రభుత్వం వేసిన అంచనాలు అందుకోవటం కష్టంగానే ఉంది. మొత్తం రూ.1.49 లక్షల కోట్ల రాబడి అంచనా వేసిన ప్రభుత్వం.. జనవరి నెలాఖరు వరకు రూ.90,330 కోట్ల ఆదాయాన్ని అందుకుంది. అందులో రూ.87 వేల కోట్లు ఖర్చు చేసింది. సగటున ప్రతినెలా రూ.9 వేల కోట్ల ఆదాయం నమోదు చేసుకుంది. అదే అంచనాతో ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఫిబ్రవరి, మార్చి నెలల ఆదాయం కూడా జోడిస్తే.. రాష్ట్ర ఆదాయం దాదాపు రూ.1.10 లక్షల కోట్లకు చేరే అవకాశముంది. వాస్తవ ఆదాయానికి మించి అంచనాలు వేసుకోవటంతో పాటు ఏడాది మధ్యలో కేంద్రం తెచ్చిన జీఎస్టీ ఎఫెక్ట్‌తోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు స్పష్టమవుతోంది. ఆర్థిక సంవత్సరంలో రూ.4,571 కోట్ల మిగులు ఉంటుందని అంచనా వేసిన ప్రభుత్వం తొలి పది నెలల్లో రూ.3,643 కోట్ల లోటును కాగ్‌కు చూపించింది. 15.6 శాతం ఆదాయ వృద్ధి.. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే రాష్ట్ర రెవెన్యూ రాబడి మొత్తం 13 శాతం ఎగబాకింది. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం 15.6 శాతం వృద్ధి సాధించింది. 2016–17లో తొలి పది నెలల్లో పన్నుల ద్వారా రూ.48,704 కోట్ల ఆదాయం సమకూరగా, ఈ జనవరి నెలాఖరుకు రూ.56,348 కోట్ల రాబడి వచ్చింది. ప్రధానంగా ఎక్సైజ్ డ్యూటీ ద్వారా వచ్చే ఆదాయం ఖజానాకు ఊతమిచ్చింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఎక్సైజ్ డ్యూటీ అమాంతం రూ.3,500 కోట్లు, స్టాంపుల రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం రూ.410 కోట్ల మేరకు పెరిగింది. జీఎస్టీతో రూ.7వేల కోట్ల గండి.. అయితే జీఎస్టీతో రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లింది. 2016–17లో పది నెలల్లోనే వ్యాట్ ద్వారా రూ.27 వేల కోట్ల ఆదాయం వస్తే.. వ్యాట్ స్థానంలో వచ్చిన జీఎస్టీతో ఈ సారి రూ.20,882 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో జీఎస్టీతో దాదాపు రూ.7 వేల కోట్ల గండి పడింది. ద్రవ్య లోటును భర్తీ చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.24,140 కోట్లు అప్పులు తీసుకుంది. -
2,000 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో సీమాంధ్ర జిల్లాల్లో ఉద్యోగులు సమ్మెతో పాటు ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగడంతో ఆ సెగ రాష్ట్ర ఖజానాను తాకింది. దీంతో ఆగస్టు నెలలో రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయం రూ. 2 వేల కోట్లకు పైగా తగ్గిపోయింది. సాధారణ పరిస్థితుల్లో ప్రతి నెలా రాష్ట్ర ఖజానాకు వివిధ పన్నుల రూపంలో రూ.6,000 కోట్ల ఆదాయం వస్తుంది. అయితే సీమాంధ్రలోని 13 జిల్లాల్లో సమైక్యాంధ్ర పేరుతో ప్రజలతో పాటు ఉద్యోగులు కూడా ఆందోళనకు దిగడంతో ఆ జిల్లాల్లో వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఆగస్టు నెలలో ఖజానాకు రూ. 4 వేల కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. రవాణా వ్యవస్థ స్తంభించడంతో రవాణా, మోటారు వాహనాల పన్ను ద్వారా రావాల్సిన ఆదాయంలో రూ.167 కోట్ల మేర గండి పడింది. రవాణా, మోటారు వాహనాల పన్ను ద్వారా 357 కోట్ల రూపాయలు ఆదాయం రావాల్సి ఉండగా కేవలం 190 కోట్ల రూపాయలు ఆదాయం మాత్రమే వచ్చింది. సీమాంధ్ర జిల్లాలకు మద్యం రవాణా సక్రమంగా జరగడం లేదు. దీంతో పాటు కొన్ని చోట్ల బార్లు, మద్యం దుకాణాలు కూడా బంద్ పాటించాయి. దీంతో ఎక్సైజ్ ఆదాయంలో రూ. 416 కోట్ల మేర గండిపడింది. రూ. 616 కోట్ల ఆదాయం రావాల్సింది రూ. 200 కోట్లు మాత్రమే వచ్చింది. సీమాంధ్ర జిల్లాల్లోని ప్రధాన నగరాల్లో వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. దీంతో వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయం రూ. 675 కోట్ల రూపాయల మేర తగ్గింది. వ్యాట్ ద్వారా రూ. 4,314 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా రూ. 3,639 కోట్లు మాత్రమే వచ్చింది. ఉద్యోగుల సమ్మెతో సీమాంధ్ర జిల్లాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రావాల్సిన ఆదాయంలో రూ. 336 కోట్ల మేర గండిపడింది. రూ. 526 కోట్లు రావాల్సి ఉండగా కేవలం రూ.190 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. గనులు-భూగర్భ వనరుల ఆదాయంలో రూ.103 కోట్ల మేర గండిపడింది. గనుల ద్వారా రూ. 253 కోట్ల మేర ఆదాయం రావాల్సి ఉండగా, రూ.150 కోట్లు మాత్రమే వచ్చాయి. రూ. 220 కోట్లు రావాల్సిన పన్నేతర ఆదాయానికి రూ. 180 కోట్ల మేర గండిపండింది. రూ.40 కోట్లు మాత్రమే పన్నేతర ఆదాయం వచ్చింది. సీమాంధ్ర జిల్లాల్లో ఉద్యమానికి సంఘీభావంగా సినిమా థియేటర్లలో మార్నింగ్ షో, మ్యాట్నీలను నిలిపివేశారు. దీంతో వినోదపు పన్ను ఆగస్టు నెలలో రూ.125 కోట్ల మేరకు తగ్గింది.