సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రం ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్‌లో సాగునీటి శాఖకు మళ్లీ కోతపడే అవకాశాలున్నాయి. ఆర్థిక మాంద్యం, కేంద్ర కేటాయింపుల్లో తగ్గుదల నేపథ్యంలో ఈమారు సాగునీటి రంగానికి బడ్జెట్ కేటాయింపులు తగ్గే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019–20లో మినహా అంతకుముందు ఏడాదుల్లో వరుసగా రూ.25 వేల కోట్ల మేర కేటాయింపులు చేయగా, ఈ ఏడాది రూ.10 వేల కోట్లకు మించి ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఎప్పటి మాదిరే రుణ సంస్థల నుంచి ప్రధాన ప్రాజెక్టులకు తీసుకుంటున్న రుణాల ద్వారానే మళ్లీ గట్టెక్కే అవకాశం ఉందని చెబుతున్నారు.
ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టులకే..
ఆర్థిక మాంద్యం దెబ్బతో గతేడాది సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌లో సాగునీటి శాఖకు కేవలం రూ.8,476.17 కోట్లకు తగ్గించింది. ఇందులో మేజర్ ఇరిగేషన్‌కు రూ.7,794.30 కోట్లు కేటాయించగా, మైనర్ ఇరిగేషన్‌కు రూ.642.30 కోట్లు కేటాయించింది. ఇందులో నిర్వహణ పద్దు కింది కేటాయింపులను పక్కనపెడితే ప్రగతిపద్దు కింది కేటాయింపులు కేవలం రూ.6,500 కోట్లు మాత్రమే ఉన్నాయి. మొత్తంగా 2019–20 వార్షికంలో ఏప్రిల్ నుంచి ఇంతవరకు రూ.18 వేల కోట్ల మేర ఖర్చయింది. ఇందులో రూ.10 వేల కోట్ల మేర రుణాల ద్వారా చేసిన ఖర్చు కాగా, మిగతా రూ.8 వేల కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించారు. ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్న సీతారామ ఎత్తిపోతల, కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకే అధిక నిధుల ఖర్చు జరిగింది.
వచ్చే వార్షిక బడ్జెట్‌లో రూ.21 వేల కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుంచి, మరో రూ.22 వేల కోట్లు రుణాల రూపేణా కేటాయించాలని సాగునీటి శాఖ ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపింది. అయితే కేంద్ర వాటా తగ్గడం, ఆర్థిక మాంద్యం ఛాయలు తగ్గకపోవడంతో ఈ ఏడాది సైతం బడ్జెట్‌లో కేటాయింపులు రూ.10 వేల కోట్లకు మించి ఉండవని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. ఇందులోనూ మునుపటి మాదిరే కాళేశ్వరం, సీతారామ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకే అధికంగా కేటాయింపులు దక్కే అవకాశం ఉంది. పాలమూరు–రంగారెడ్డికి రూ.2 వేల కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.1,500 కోట్లు, సీతారామ ఎత్తిపోతలకు మరో రూ.2 వేల కోట్లు, దేవాదులకు రూ.600 కోట్లు, తుపాకులగూడెంకు రూ.300 కోట్లు కేటాయించే అవకాశాలున్నాయి. రాష్ట్ర బడ్జెట్ నిధులతో పాటే ఇప్పటికే ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల ద్వారా గరిష్టంగా రూ.15 వేల కోట్ల మేర రుణాలతోనే ఈ ప్రాజెక్టులకు నిధుల లభ్యత పెంచనున్నారు.
పాత ప్రాజెక్టులకు నిరాశే..
ఇక పాత ప్రాజెక్టులకు మాత్రం మళ్ళీ నిరాశ తప్పేలా లేదు. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమాతో పాటు ఎల్‌ఎల్‌బీసీ టన్నెల్‌తో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులకు నిధుల కోత తప్పదని నీటిపారుదల వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తవ్వాలంటే కనిష్టంగా రూ.1,200 కోట్లు అవసరముంది. అయితే ఇప్పటికే సాగునీటి శాఖ పరిధిలో రూ.10 వేల కోట్ల మేర పెండింగ్ బిల్లులుండగా, ఇందులో ప్రధాన పనులకు సంబంధించి రూ.5,500 కోట్లున్నాయి. ప్రస్తుతం బడ్జెట్‌లో ప్రవేశపెట్టే నిధులు పనులకు సంబంధించిన పెండింగ్ పనులకే చెల్లిస్తే, మిగిలే నిధులు చాలా తక్కువ. ఇవీ ప్రాధాన్యత ప్రాజెక్టులకు ఖర్చుచేస్తే పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కష్టతరంగా మారనుంది.
Comments
Please login to add a commentAdd a comment