రెండేళ్లలోనే పూర్తిచేద్దాం! | Will finish in two years! | Sakshi
Sakshi News home page

రెండేళ్లలోనే పూర్తిచేద్దాం!

Published Sun, Oct 4 2015 2:07 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

రెండేళ్లలోనే పూర్తిచేద్దాం! - Sakshi

రెండేళ్లలోనే పూర్తిచేద్దాం!

‘పాలమూరు’ ప్రాజెక్టుపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
 
 సాక్షి, హైదరాబాద్: పాలమూరు ఎత్తిపోతల పథకం పనులను తక్షణమే ప్రారంభించి రెండేళ్లలో పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. రెండు వారాల్లో సర్వే పనులు పూర్తికావాలని, వెంటనే డిజైన్లు రూపొందించి టెండర్లు పిలవాలని సూచించారు. టెండర్ ప్రక్రియను కూడా రెండు వారాల్లోనే ముగించి పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు. రిజర్వాయర్లు, పంప్‌హౌజ్‌లు, టన్నెళ్లు, కాలువల పనులన్నీ సమాంతరంగా జరగాలని చెప్పారు. ఈ ప్రాజెక్టును రంగారెడ్డి జిల్లా వరకు విస్తరించి.. నీరందించే విషయంలో ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.

పాలమూరు ప్రాజెక్టుపై శనివారం క్యాంపు కార్యాలయంలో మంత్రులు హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆలం వెంకటేశ్వర్లు, మర్రి జనార్ధన్‌రెడ్డి, సీఎస్ రాజీవ్‌శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ శ్రీదేవి, నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్, పాలమూరు ప్రాజెక్టు ఓఎస్‌డీ రంగారెడ్డి తదితరులతో సమీక్షించారు. ఈ సందర్భంగా పాలమూరు ఎత్తిపోతల పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉద్దండాపూర్, హేమ సముద్రంలో రిజర్వాయర్లు కట్టి మహబూబ్‌నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయాలని కేసీఆర్ చెప్పారు.

 ప్రాజెక్టులంటే పదేళ్లా..!
 నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణమంటే ఎనిమిది, పదేళ్ల పాటు సాగే పనిలాగా అలవాటైందని... తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. నీటి పారుదల ప్రాజెక్టులను తాను నిరంతరం పర్యవేక్షిస్తానన్నారు. ప్రాజెక్టులపై ప్రతి సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించాలని... ప్రతిరోజూ పనుల పురోగతిని తెలుసుకుంటూ ఉండాలని మంత్రి హరీశ్‌రావును ఆదేశించారు. వలసల జిల్లాగా పేరున్న మహబూబ్‌నగర్ జిల్లాకు రెండేళ్లలోనే ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని అందించి సస్యశ్యామల ప్రాంతంగా మార్చాలని సూచించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను త్వరగా ముగించేలా జిల్లాకు చెందిన కృష్ణారావు, లక్ష్మారెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని చెప్పారు. రైతుల భూములు, ఇళ్లు, ఇతర స్థిరాస్తులకు విలువ కట్టి వెంటనే పరిహారం చెల్లించాలని కలెక్టర్ శ్రీదేవిని ఆదేశించారు.
 
 
 వెంటవెంటనే బిల్లులు..

  రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని... ఈ శాఖకు బడ్జెట్లో నిధులు కేటాయించిన తర్వాతే మిగతా శాఖల గురించి ఆలోచిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నీటిపారుదల శాఖకు ఏటా రూ. 25 వేల కోట్లు ఇస్తామని, ప్రాజెక్టు పనులకు వెంటవెంటనే బిల్లులు చెల్లిస్తామని చెప్పారు. అధికారులు అలసత్వం చూపకుండా పనిచేయాలని... డిజైన్ల రూపకల్పనలో, ఇతర పనుల్లో అవసరమైతే రిటైర్డ్ ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. నీటి పారుదల ప్రాజెక్టులకు అవసరమయ్యే విద్యుత్ సరఫరా కోసం జెన్‌కో, ట్రాన్స్‌కోలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయని, వారితో సమన్వయం చేసుకోవాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులకు సంబంధించి వివిధ రకాల సర్వేలు నిర్వహించాల్సి ఉన్నందున ఎక్కువ ఏజెన్సీలను నియమించి, సర్వేలు త్వరగా పూర్తయ్యేలా చూడాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement