'కేసీఆర్ కుటుంబం బందిపోట్ల ముఠాలా దోపిడీ'
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబం బందిపోట్ల ముఠాలా రాష్ట్రాన్ని దోచుకుంటోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నామని.. ఆయన అహంకారంతో అడ్డగోలుగా విమర్శిస్తున్నారని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ఇక్కడి గాంధీభవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జానారెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, మల్లురవిలతో కలిసి ఉత్తమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ తీరును కాంగ్రెస్ నేతలు తూర్పార పట్టారు.
'ఎవరబ్బ సొమ్మని శ్రీవారికి కోట్ల రూపాయల కానుకలను మొక్కులుగా చెల్లిస్తున్నారు, తెలంగాణ ఏమైనా మీ జాగీరు అనుకుంటున్నారా..? కేసీఆర్‌కు అహంకారం పెరిగిపోయింది. రైతుల ఆత్మహత్యలు, విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగుల వెతలు ఆయనకు కనిపించడం లేదు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకుండా దేవుళ్లకు మొక్కులు చెల్లించుకుంటారా.. 30 నెలల్లో ఇతర పార్టీల నుంచి ప్రజా ప్రతినిధులను కొనుక్కోవడం మినహా చేసింది శూన్యం. కేసీఆర్ కూర్చున్న సీఎం కుర్చీ కాంగ్రెస్ పుణ్యమేననిని' ఉత్తమ్ పేర్కొన్నారు.
'ప్రాజెక్టుల పేరుతో మూడేళ్లలో రూ. 60 వేల కోట్ల అప్పులు చేశారు. అప్పులు తెచ్చుకోవడం కమీషన్లు తీసుకోవడమే పనిగా పెట్టుకున్నారు తప్పా.. అభివృద్ధి ఊసెత్తడం లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, వాటర్ గ్రిడ్‌లు ఆంధ్రా కాంట్రాక్టర్లకే దోచి పెడుతున్నారు. భూ సేకరణ చట్టం అమలు చేయాలంటూ పేద రైతులంతా కోర్టుకు వెళ్లే పరిస్థితి ఎందుకు వచ్చింది. వ్యక్తిగతంగా మీ మొక్కులు మీ ఇష్టం.. అంతే కానీ పేదలు కట్టిన పన్నులతో దేవుళ్లకు కానుకలెలా ఇస్తారని' కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. రాష్ట్రం వచ్చాక ఒక్క యూనిట్ అదనపు విద్యుత్ ఉత్పత్తి చేయలేదని, కేవలం తాము మొదలు పెట్టిన ప్రాజెక్టులకు కేసీఆర్ స్విచ్ ఆన్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.