వారిది రాక్షసానందం | cm kcr slams oppositions over irrigation projects | Sakshi
Sakshi News home page

వారిది రాక్షసానందం

Published Thu, Dec 29 2016 1:04 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

వారిది రాక్షసానందం - Sakshi

వారిది రాక్షసానందం

ప్రాజెక్టులపై ప్రతిపక్షాల తీరును ఎండగట్టిన సీఎం కేసీఆర్‌
కాలికేస్తే మెడకు.. మెడకేస్తే కాలికి అన్నట్టు కేసులేస్తున్నరు
నాగార్జున సాగర్, శ్రీశైలం కట్టినప్పుడు
 అప్పటి ప్రభుత్వాలు భూసేకరణ చేయలేదా?
నిర్వాసితులకు మెరుగైన పరిహారం కోసం
 చట్ట సవరణ చేస్తామంటే ఎందుకు అడ్డుకుంటరు?
మల్లన్నసాగర్‌పై ఎంత హడావుడి చేశారు?
భూములు కోల్పోకుండా ప్రాజెక్టులు కట్టడం సాధ్యమా?
గోసపడి తెచ్చుకున్న తెలంగాణ పచ్చబడాలె..
గోదావరి జిల్లాల్లో మాదిరి రెండు పంటలు పండించి చూపుతాం
భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

సాక్షి, హైదరాబాద్‌:
‘‘ఎలాగూ అధికారంలోకి రాలేం.. అధికారంలో ఉన్నవారిని ఇబ్బంది పెట్టాలె.. అందుకే ప్రాజెక్టులు కట్టకుండా ముఠాగా ఏర్పడి కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి అన్నట్టు చేసి కోర్టుల్లో కేసులేస్తున్నరు. పనులు కాకుండా అడ్డంపడి జనాన్ని ఇబ్బంది పెట్టి రాక్షసానందం పొందాలె. ఇది ఈ ప్రతిపక్ష నేతల తీరు. వారి ఆటలు సాగనివ్వం. చాలా గోసపడ్డ తర్వాత తెచ్చుకున్న తెలంగాణ పచ్చబడాలె. ఎవరో కొందరు అడ్డుపడితే ఆగుతమా? ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. తూర్పు, పశ్చిమ గోదావరి తరహాలో తెలంగాణను సస్యశ్యామలం చేస్తం. రెండు పంటలు పండించి చూపుతం..’’ అని సీఎం స్పష్టం చేశారు. భూసేకరణ లేకుండా, కొందరు భూములు కోల్పోకుండా, నిర్వాసితులు కాకుండా ప్రాజెక్టులు కట్టడం సాధ్యమా అని ప్రశ్నించారు.

నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్సారెస్పీ ప్రాజెక్టులకు భూసేకరణ జరపకుండానే పనులు చేపట్టారా అని అన్నారు. నిర్వాసితులకు గతంలో ఉన్న పరిహారం కంటే మరింత మెరుగ్గా లబ్ధి చేకూర్చేందుకు భూసేకరణ చట్టానికి సవరణలు ప్రతిపాదించినట్టు తెలిపారు. అది కేవలం చట్టమేనని, ప్రజల సంక్షేమానికి ఉద్దేశించిందే తప్ప భుజాన గొడ్డలి పెట్టుకుని తిరిగేది కాదన్నారు. తెలంగాణ భూసేకరణ బిల్లుకు బుధవారం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై వాడివేడిగా జరిగిన చర్చలో సీఎం తనదైన శైలిలో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించటంతో ముఖ్యమంత్రి.. గతంలో పలు ప్రాజెక్టుల వద్ద ప్రతిపక్షాలు చేసిన ఆందోళనలను ఉటంకిస్తూ మండిపడ్డారు.

గుండుసూది, సూది, దబ్బనం పార్టీలు..
ఇటీవల మల్లన్నసాగర్‌ వద్ద ప్రతిపక్షాలు రైతులతో కలిసి ఆందోళనలు చేసిన అంశాన్ని ప్రస్తావిస్తూ సీఎం నిప్పులు చెరిగారు. పోలీసులను అడ్డుపెట్టి బలవంతపు భూసేకరణ చేశారంటూ అంతకుముందు ప్రతిపక్షాలు సభలో విమర్శించాయి. ఆ సమయంలో సీఎం సభలో లేరు. ‘‘నేను మరో ముఖ్యమైన చట్టం రూపకల్పన పనుల్లో బిజీగా ఉన్నా. కానీ టీవీలో చర్చ చూసిన తర్వాత ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్న ఉద్దేశంతో వచ్చా. మల్లన్నసాగర్‌ భూసేకరణ సమయంలో పార్టీలు చేసిన హడావుడి అంతాఇంతా కాదు. ప్రపంచంలో మల్లన్నసాగర్‌ అంశం తప్ప ఇంకోటి లేదన్నట్టు. స్వాతంత్య్ర పోరాటం కంటే ఇదే గొప్పదన్నట్టు చేసిన్రు. ఇక సీపీఎం వాళ్లయితే ఆ ప్రాంతంతో సంబంధం లేనోళ్లు వచ్చి హంగామా చేసిన్రు. ఆ పార్టీ కార్యదర్శి రహస్యంగా మోటర్‌ సైకిల్‌పై రావల్సిన అగత్యం ఏమొచ్చింది? ఇక అందులో గుండుసూది, సూది, దబ్బనం పార్టీలుంటయి. ముందున్న పోలీసులను వాటితో గుచ్చి రెచ్చగొట్టి లాఠీఛార్జి, తర్వాత కాల్పుల దాకా తీసుకుపోవడమే వాటి పని. అలాంటి పార్టీలొచ్చినయని తెలిసి ఆ ప్రాంతంలో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేసినం. కరŠూఫ్య విధించమని నేనే స్వయంగా చెప్పిన. రైతుల్లో 75 శాతం మంది స్వచ్ఛందంగా భూములిచ్చేందుకు ముందుకు రాగా... మిగతా వారిని రెచ్చగొట్టి వీరు గొడవగొడవ చేసిన్రు’’ అని సీఎం పేర్కొన్నారు.

ఎవరేం కుట్రలు పన్నుతున్నరో మాకు తెల్వదా?
గతంలో అంగన్‌వాడీ వర్కర్ల ఆందోళనలో పోలీసు కాల్పుల ఘటనను సీఎం ప్రస్తావించారు. ఇంత గొడవ చేస్తుంటే తమకు విషయం తెలియకుండా ఉంటుందా అని ప్రశ్నించారు. ‘‘మాకు గూఢచార సంస్థలు లేవా? ఎవరేం కుట్రలు పన్నుతున్నరో తెల్వదా? అలా తెలిసే ఆ రోజు పోలీసు పికెట్‌ ఏర్పాటు చేసినం. బలవంతపు భూసేకరణ కోసం కాదు.. ఆరాచక శక్తులను అడ్డుకునేందుకే. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఇలాగే చేస్తం. అరాచక శక్తులను ఉక్కుపాదంతో అణచివేస్తం’’ అని స్పష్టం చేశారు.  ‘‘ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్టుగా ఉన్న చైనాలోని త్రీగార్జెస్‌ ప్రాజెక్టును చేపట్టినప్పుడు 12 లక్షల కుటుంబాలను తరలించారు.

35 వేల మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టుగా రూపకల్పన చేసి అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇలాంటి ప్రాజెక్టులు రావాలంటే భూసేకరణ తప్పదు. ఆ విషయం తెలియందా..? తెలంగాణను అభివృద్ధి చేసుకోవటానికి ఉద్దేశించిన ప్రాజెక్టులను వేగిరం చేసేందుకు చట్ట సవరణ చేస్తామంటే ఎందుకు అంత గొడవ చేస్తున్నారు?’’ అని సీఎం ప్రశ్నించారు. ‘‘సమైక్య పాలనలో ఎట్లాగూ మనకు కష్టాలు తప్పలేదు. నేను అప్పట్లో మంత్రిగా ఉన్న ఏమీ చేయలేకపోయాను. మన కర్మ అది. నేను ఇప్పుడు నిలబడ్డ స్థానం నుంచి నిలువెత్తు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అయితే తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వను.. దిక్కున్నచోట చెప్పుకోమంటే ఏం చేసినం? ఇప్పుడు ఆ తీరు మారాలి. అప్పట్లో పాలమూరుకు జూరాల నుంచి నీళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ ప్రాజెక్టు నీటి లభ్యతే ఏడున్నర టీఎంసీలైతే దాదాపు 45 టీఎంసీల భారం పడేలా దానిపై రకరకాల ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. దాని వల్ల భవిష్యత్తులో ఆయా ప్రాంతాల రైతులు గొడ్డళ్లు, కత్తులతో కొట్టుకునే పరిస్థితి రాదా?’’ అని అన్నారు.

ఆ బాధ మా కుంటుంబానికే ఎక్కువ తెల్సు
రైతులు భూములు కోల్పోతే పడే బాధ రాష్ట్రంలో తమ కుటుంబానికే ఎక్కువగా అనుభవం ఉందని సీఎం పేర్కొన్నారు. 1940లలో అప్పర్‌ మానేరు డ్యాం నిర్మాణ సమయంలో తమ కుటుంబం వందల ఎకరాలు కోల్పోయిందని, నిజాం పాలన సమయంలో తన తండ్రి బారీ అనే న్యాయవాది సాయంతో న్యాయ పోరాటం చేసినట్టు గుర్తు చేశారు. ఆ సమయంలో తమకు రూ.1.70 లక్షల పరిహారం రాగా కోర్టులో నెగ్గడం ద్వారా మరో రూ.70 వేలు అదనంగా పొందినట్టు వివరించారు. ఆ సమయంలో తమ కుటుంబం పడ్డ ఆవేదన వర్ణణాతీతమన్నారు. అలా మరొకరు ఆవేదనకు గురికావద్దనే కొత్త చట్టం తేవాలని నిర్ణయించినట్టు చెప్పారు.

ఇప్పుడు ఇంతగా మాట్లాడుతున్న కాంగ్రెస్‌ వాళ్లు, వారి హయాంలో జరిగిన  భూసేకరణ సమయంలో ఇచ్చిన పరిహారమెంతో గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా నాటి వరంగల్‌ జిల్లా చివరలో నిర్మించిన తపాస్‌పల్లి నిర్వాసితులకు రూ.లక్ష వరకు చెల్లిస్తే... ఇదే మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.6.5 లక్షల వరకు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. నిర్వాసితుల కాలనీగా ఏర్పాటు చేసి అక్కడే ఓ ప్లాటు ఇచ్చేవారన్నారు. భూములు కోల్పోయిన వారు బతుకుతెరువు కోసం ఇష్టం వచ్చిన చోటుకు వెళ్లినప్పుడు వారికి నిర్వాసితుల కాలనీలో ఇచ్చే ప్లాటుతో ఉపయోగం ఏముంటుందని ప్రశ్నించారు. అందుకే తాము అలా కాకుండా కోరిన చోట ఇల్లు సమకూర్చుకునేందుకు వీలుగా రూ.5.04 లక్షలు ఇస్తున్నట్టు చెప్పారు. తన మరదలి కుమారుడికి మిడ్‌మానేరు సమయంలో ఇలాంటి చేదు అనుభవమే ఎదురైందని వివరించారు.

అది తాడు బొంగరం లేని వారు చేసిన చట్టం...
కేంద్ర ప్రభుత్వం 2013లో రూపొందించిన భూసేకరణ చట్టంపైనా సీఎం విమర్శలు గుప్పించారు. అది తాడు బొంగరం లేనివారు రూపొందించిన చట్టమని వ్యాఖ్యానించారు. ‘‘2013 చట్టంలోని బంగారం, వజ్రం, ప్లాటినం ఏందో తెలుసా... నిర్వాసితులకు ఐఏవై ఇల్లు కేటాయించటం. దాన్ని సమూలంగా మార్చి నిర్వాసితులకు సంతృప్తికర ప్యాకేజీ ఇవ్వటం కోసం చట్ట సవరణకు సిద్ధపడ్డం..’’ అని పేర్కొన్నారు. ఎవరైనా రైతులకు తక్కువ పరిహారం వస్తే దానికి ప్రతిపక్షాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఓ అడ్వొకేటు అన్ని ప్రాజెక్టుల విషయంలో కేసులు దాఖలు చేస్తున్నారని, అది పార్టీలు చేయిస్తున్నదేనని అన్నారు.

ఇక అడ్డు పడేవారుండరు
చట్ట సవరణతో కోర్టు కేసులు, ట్రిబ్యునల్‌ కేసుల్లాంటి వాటితో అడ్డుపడే ప్రసక్తి ఉండదని సీఎం అన్నారు. ‘‘గతంలో ప్రాజెక్టులు నత్తలే సిగ్గుపడే రీతిలో మెల్లగా సాగడానికి కారణాలపై మాజీ అధికారులు, ఇంజినీర్లతో వాకబు చేశాం. వాస్తవాలు గుర్తించి ఆ సమస్యలు భవిష్యత్తులో ఉండొద్దన్న ఉద్దేశంతోనే చట్ట సవరణకు నిర్ణయించాం.. బిల్లును సెలక్ట్‌ కమిటీ ముందు పెట్టిన తర్వాతే ఆమోదించాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను కూడా పట్టించుకోబోం’’ అని స్పష్టంచేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement