- ప్రస్తుత బడ్జెట్‌లో ప్రాజెక్టులకు అంచనాలు సిద్ధం
- నేడు సమీక్షించనున్న ఆర్థిక శాఖ
- 2014-15లో నిధుల ఖర్చు అంతంత మాత్రమే
- రూ.815.78 కోట్ల పనుల పెండింగ్.. నెలన్నరేగడువు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తొలి వార్షిక బడ్జెట్‌లో సాగునీటి రంగానికి నిధుల వరద పారించినా, ఖర్చులో మాత్రం నీరసపడింది. క్షేత్రస్థాయిలో ఎదురైన సమస్యల కారణంగా భారీ, మధ్య తరహా ప్రాజెక్టు పనులు ముందుకు కదలక పోగా, భారీ ఆశలతో ప్రారంభించిన చెరువుల పునరుద్ధరణ పనులు పరిపాలనా అనుమతులు, టెండర్ అగ్రిమెంట్‌ల వద్దే ఉన్నాయి. ప్రణాళికా వ్యయం కింద కేటాయిం చిన రూ.6,500 కోట్లలో సగమే ఖర్చుకు నోచుకుంది. మిగతా నిధుల ఖర్చు ఈ నెలన్నర వ్యవధిలో చే యడం గగనమే. 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన బడ్జెట్‌ను ఖర్చు చేయ ని నీటిపారుదల శాఖ వచ్చే ఏడాదికి బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు ప్రతిపాదించబోతోంది.
రూ.815.78 కోట్ల పనులు పెండింగ్: 2014-15 వార్షిక బడ్జెట్‌లో సాగునీటి పారుదల రంగానికి రూ.9,356 కోట్లు కేటాయించారు. ఇందులో నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్న గణాం కాల మేరకు 33 భారీ మధ్యతరహా ప్రాజెక్టుల కింద రూ.2935.67కోట్ల పనులు జరగ్గా, మరో రూ.815.78 కోట్ల మేర పనులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. భూసేకరణ, నిర్వాసితులకు భూ పరిహారం, ఎస్కలేషన్ చెల్లింపులపై తేల్చడంలో జరిగిన జాప్యం కారణంగా ప్రాజెక్టుల పనులు మందకొడిగా సాగాయి.
ఇంకా మొదలుకాని చెరువుల పనులు: చెరువుల పునరుద్ధరణకు బడ్జెట్‌లో సుమారు రూ.2016 కోట్ల కేటాయింపులు జరగ్గా ఇప్పటివరకు రూ.వెయ్యి కోట్లకు మాత్రమే పరిపాలనా అనుమతులు లభించాయి. మిగతావి ఆర్ధిక శాఖ వద్ద వేచిచూస్తున్నాయి. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకున్న చెరువుల్లో 300 వరకు కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్‌లను పూర్తి చేసుకున్నా పనులు మాత్రం ఎక్కడా ప్రారంభం కాకపోవడంతో రూపాయీ ఖర్చు కానట్టే లెక్క.
ఈ ఏడాది బడ్జెట్ అంచనా రూ.20 వేల కోట్లు: కాగా 2015-16 ఆర్థిక ఏడాదిలో నీటి పారుదల రంగానికి సుమారు రూ.20వేల కోట్ల నిధులు అవసరమని అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. ఇందులో ప్రాణహిత చేవెళ్లకు సుమారు రూ.4వేల కోట్లు, మిషన్ కాకతీయకు రూ.5వేల కోట్లు, మిగతా భారీ ప్రాజెక్టులకు రూ.10వేల కోట్ల అంచనాలను ప్రతిపాదించినట్లు తెలిసింది. బడ్జెట్ అంచనాలపై గురువారం మంత్రి హరీశ్‌రావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ప్రతిపాదనల వివరాలను శుక్రవారం మంత్రి ఈటెల రాజేందర్‌తో జరిగే సమావేశంలో సమర్పించనున్నారు.