
వివిధ పథకాల పురోగతి పరిశీలన
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్‌ల చీఫ్‌లతో కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు మంగళవారం భేటీ కానున్నారు. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పథకాలను లోగడ తీసుకురావడం తెలిసిందే. వీటి కింద ఆయా వర్గాలకు బ్యాంకుల నుంచి రుణసాయం ఏ విధంగా అందుతోందన్న దానిపై భేటీలో సమీక్షించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. పీఎం విశ్వకర్మ, స్టాండప్ ఇండియా, పీఎం స్వనిధి, ముద్రా యోజన తదితర పథకాల పురోగతిపై పరిశీలన జరగనుంది.
ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. అందరికీ ఆర్థిక సేవల చేరువ విషయంలో ఇతర అంశాలు కూడా చర్చకు రానున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గతేడాది సెపె్టంబర్‌లో ప్రధాని ప్రారంభించిన పీఎం విశ్వకర్మ పథకం కింద హస్త కళాకారులు, చేతివృత్తుల వారికి నామమాత్రపు వడ్డీపై రుణ సాయం లభించనుంది. ఐదేళ్ల కాలంలో ఈ పథకం కింద రూ.13,000 కోట్ల సాయం అందించనున్నారు. 30 లక్షల మందికి లబ్ధి చేకూరనుందని అంచనా. 2016 ఏప్రిల్ 5న ప్రారంభించిన స్టాండప్ ఇండియా పథకం కింద సొంతంగా సంస్థలను స్థాపించే ఎస్‌సీ, ఎస్‌టీ, మహిళలకు బ్యాంక్‌ల ద్వారా రుణ సాయం లభించనుంది.
Comments
Please login to add a commentAdd a comment