ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఆర్థిక శాఖ కీలక నిర్ధేశం..! | Finance Ministry Asks Banks to Strengthen Balance Sheet Raise Capital From Market | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఆర్థిక శాఖ కీలక నిర్ధేశం..!

Published Sat, Apr 23 2022 7:25 PM | Last Updated on Sat, Apr 23 2022 7:50 PM

Finance Ministry Asks Banks to Strengthen Balance Sheet Raise Capital From Market - Sakshi

న్యూఢిల్లీ: మార్కెట్ల నుంచి మూలధన సమీకరణ ద్వారా బ్యాలెన్స్‌ షీట్లను పటిష్టంగా ఉంచుకోవాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్‌బీ) ఆర్థికశాఖ నిర్దేశించింది. మెరుగైన మూలధనం బ్యాంకులు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు, ఉత్పాదక రంగాలలో క్రెడిట్‌ వృద్ధిని పెంచడానికి దోహదపడతాయని ఫైనాన్షియల్‌ సేవల కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా పేర్కొన్నారు.  పీఎస్‌బీల టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లతో జరిగిన మంథన్‌ 2022 (బ్యాంకింగ్‌పై మేథోమదనం) సమావేశంలో సంజయ్‌ మల్హోత్రా ఈ మేరకు ప్రసంగించారు.

ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభదాయకతతో సహా అన్ని కొలమానాలపై మెరుగైన పనితీరును కొనసాగిస్తాయన్న విశ్వాసాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు తమలో తాము సహకారాన్ని మరింత పెంచుకునే మార్గాలని అన్వేషించాలని కోరారు.  అలాగే కార్యకలాపాలకు సంబంధించి పెద్ద బ్యాంకులు తమ ఉత్తమ పద్ధతులను చిన్న రుణదాతలతో పంచుకోవాలని,  మరింత నైపుణ్యం అవసరమైన రంగాలలో వారికి మార్గనిర్దేశం చేయాలని సూచించారు. బ్యాంకులు దీర్ఘకాలిక లాభదాయకత, వినియోగదారు ప్రయోజనాలే పరిరక్షణగా తగిన విధానాల దిశలో వ్యూహాలను అన్వేషించాలని మల్హోత్రా సూచించారు. 

ఆరు గ్రూపుల ఏర్పాటు 
వినియోగ సేవలు, డిజిటలైజేషన్, హెచ్‌ఆర్‌ ప్రోత్సాహకాలు, పాలనాతీరు, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌లో పరస్పర సహకారం సహా కీలకమైన అంశాలను పరిశీలించి, తగిన సిఫారసులు చేయడానికి మంథన్‌ 2022లో ఆరు గ్రూపులు ఏర్పాటయినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. కాగా, పీఎస్‌బీ మంథన్‌ తొలి సమావేశం 2014లో జరిగింది. కరోనాకు ముందు 2019లో చివరిసారిగా ఈ సమావేశం జరిగింది. 

సంస్కరణలకు ప్రాధాన్యత
బ్యాంకింగ్‌ పటిష్టత, వ్యవస్థలో తదుపరి తరం సంస్కరణలను ప్రారంభించడం, ఈఏఎస్‌ఈ (ఎన్‌హెన్డ్స్‌ యాక్సెస్‌ అండ్‌ సర్వీస్‌ ఎక్స్‌లెన్స్‌) దిశలో పురోగతి లక్ష్యంగా మంథన్‌ 2022 జరగడం హర్షణీయం. ప్రభుత్వ రంగ బ్యాంకుల అగ్ర నాయకత్వంతో ఆలోచనాత్మకంగా దీనిని నిర్వహించడం సానుకూలాంశం.  
    –  అతుల్‌ కుమార్‌ గోయల్, ఐబీఏ చైర్మన్‌ 


సవాళ్లను తట్టుకోగలగాలి.. 
బ్యాంకింగ్‌ రంగంలో విప్లవాత్మక మార్పులకు, నూతన చొరవలకు, అత్యుత్తమ ప్రమాణాల అన్వేషణకు మంథన్‌ దోహదపడుతుందని భావిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకింగ్‌ సవాళ్లను తట్టుకోగలిగే సామర్థ్యాన్ని సముపార్జించాలి. మూలధనం సమీకరణ ద్వారా రుణ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవాలి. 
    – శక్తికాంతదాస్, ఆర్‌బీఐ గవర్నర్‌  

చదవండి: క్రెడిట్‌ కార్డు యూజర్లకు అలర్ట్‌..! కొత్త నిబంధనలను ప్రకటించిన ఆర్బీఐ..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement