ముంబై : నీరవ్ మోదీ లాంటి కేసులు మళ్లీ పునరావృతం కాకుండా.. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. రూ.50 కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో రుణాలు తీసుకునే వారి నుంచి పాస్‌పోర్ట్ వివరాలు కచ్చితంగా స్వీకరించాలని బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశించింది. భారీ మొత్తంలో రుణం తీసుకుని, వాటిని ఎగొట్టి దేశం విడిచి పారిపోయేందుకు వీలు లేకుండా.. నిరోధించేందుకు పాస్‌పోర్టు వివరాలను సేకరిస్తున్నట్టు టాప్ అధికారి ఒకరు చెప్పారు. పాస్‌పోర్ట్ వివరాలతో సరియైన సమయంలో బ్యాంకులు చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని, దేశం విడిచి పారిపోకుండా సంబంధిత అథారిటీలకు వారి గురించి వెంటనే సమాచారం అందించడం కుదురుతుందని పేర్కొన్నారు.
'' స్వచ్ఛమైన, బాధ్యతాయుతమైన బ్యాంకింగ్‌ను అందించడమే తర్వాతి చర్య. రూ.50 కోట్లకు పైబడి రుణం తీసుకునే వారి పాస్‌పోర్ట్ వివరాలు తప్పనిసరిగా సేకరించాలి. మోసం జరిగిన సమయంలో వెంటనే చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది'' అని ఫైనాన్సియల్ సర్వీసెస్ సెక్రటరీ రాజీవ్ కుమార్ తెలిపారు. అదేవిధంగా ఇప్పటికే రూ.50 కోట్లకు పైబడి రుణం కలిగిన వారి పాస్‌పోర్ట్ వివరాలను బ్యాంకులు 45 రోజుల్లోగా సేకరించాలని కూడా ఆదేశాలు జారీచేశారు.
నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సి, విజయ్ మాల్యా, జతిన్ మెహతా వంటి పలువురు డిఫాల్టర్లు, బ్యాంకులను భారీ మొత్తంలో మోసం చేసి, దర్యాప్తు ఏజెన్సీలకు చిక్కకుండా విదేశాలకు పారిపోయారు. పీఎన్‌బీలో దాదాపు రూ.12,700 కోట్ల కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సిలు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల విచారణకు కూడా సహకరించడం లేదు. ఈ క్రమంలో రూ.50 కోట్లకు పైబడి రుణం కలిగిన వారి పాస్‌పోర్ట్ వివరాలను బ్యాంకులు సేకరించాలని ఆర్థికమంత్రిత్వ శాఖ అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment