- ‘రబీ’కి చలిపోటు
- ముందుకు సాగని వరినాట్లు
- ఇప్పటివరకు 7,302 హెక్టార్లలోనే..
- ఆందోళనలో రైతులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: వాతావరణంలో మార్పు ప్రభావం రబీలో పంటల సాగుపై పడింది. సీజన్ ప్రారంభంనుంచి చలి ఎక్కువగా ఉండడంతో వరి నారులో పెరుగుదల దెబ్బతింది. చాలా చోట్ల నారు ఎర్రబడుతోంది. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ రబీ సీజన్‌లో 2,59,616 హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఈ మేరకు రబీ ప్రణాళికను ఖరారు చేసి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. అయితే ఇప్పటి వరకు రైతులు మాత్రం 1,21,039 హెక్టార్లలో మాత్రమే వివిధ పంటలు వేశారు. 1.20 లక్షల హెక్టార్లలో వరి సాగవుతుం దని అంచనా వేయగా ఇప్పటివరకు 7,302 హెక్టార్లలో మాత్రమే నాట్లుపడ్డాయి. గతేడాదితో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. గతేడాది ఈ సీజన్‌లో 2,02,890 హెక్టార్లలో వివిధ పంటలు వేయగా ఇందులో 65,587 హెక్టార్లలో వరి సాగయ్యింది. బోధన్, వర్ని ప్రాంతాల్లోనే వరి నాట్లు ఎక్కువగా పూర్తయ్యాయి.
అంచనాలకు అనుగుణంగా..
జిల్లాలో రబీ సీజన్‌లో మొక్కజొన్న, సజ్జ, జొన్న, పెసర, కంది, శనగ తదితర పంటలు అంచనాలకు అనుగుణంగా సాగయ్యాయి. 22 వేల హెక్టార్లలో జొన్న సాగవుతుందని అధికారులు అంచనా వేయగా ఇప్పటికి 20,556 హెక్టార్లలో జొన్న వేశారు. 45 వేల హెక్టార్లలో మొక్కజొన్న వేస్తారని అంచనా వేయగా ఇప్పటికి 39,054 హెక్టార్లలో మొక్కజొన్న సాగయ్యింది. పెసర వెయ్యి హెక్టార్లకుగాను 570 హెక్టార్లలో, పొద్దుతిరుగుడు 12,500 హెక్టార్లకుగాను 4,843 హెక్టార్లలో, ఉల్లిగడ్డ 2,500 హెక్టార్లకుగాను 1,755 హెక్టార్లలో, కూరగాయలు 2,500 హెక్టార్లకుగాను 966 హెక్టార్లలో సాగయ్యాయి. శనగ, పొగాకు అంచనాలు మించాయి. శనగ 33 వేల హెక్టార్లలో సాగవుతుందని అంచనా వేయగా 34,077 హెక్టార్లలో, పొగాకు 500 హెక్టార్లలో సాగవుతుందని అంచనా వేయగా 611 హెక్టార్లలో రైతులు సాగుచేశారు. వరి మినహాయించి మిగతా పంటల సాగుకు అదను దాటిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే జనవరి చివరి వరకు ఈ పంటలు సాగు చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
అందుబాటులో అరకొర ఎరువులే..
గతంలో మాదిరిగానే ఈ ఏడాదిలో కూడా ఎరువులు, క్రిమిసంహారక మందులకు ఇబ్బందులు తప్పవనిపిస్తోంది. ఎరువుల కొరత కారణంగా గతంలో రైతులు ఇబ్బంది పడ్డారు. అయినా వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. రబీ సీజన్‌లో 1,29,692 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా జిల్లాకు చేరింది 40,766 మెట్రిక్ టన్నులే. డీఏపీ 24,214 మెట్రిక్ టన్నులు అవసరం కాగా 376.80 మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. ఎంఓపీ 26,537 మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా టన్ను కూడా జిల్లాలో లేదు. కాంప్లెక్స్ ఎరువులు 68,917 మెట్రిక్ టన్నులకుగాను 28,242 మెట్రిక్‌టన్నులు అందుబాటులో ఉన్నాయి. జిల్లాకు రావాల్సిన కోటాకు అనుగుణంగా ఎరువులు సకాలంలోనే వస్తాయని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. రైతులు మాత్రం గతేడాది మాదిరిగానే ఎరువుల కొరత ఏర్పడుతుందేమోనని అందోళన చెందుతున్నారు.
రుణాలివ్వని బ్యాంకర్లు
పంట రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు ఆసక్తి చూపడం లేదు. రబీ సీజన్‌లో వెయ్యి కోట్ల రూపాయల పంట రుణాలు ఇవ్వాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించారు. బ్యాంకర్లతో అధికారులు పలుమార్లు సమీక్షించారు. వ్యవ‘సాయం’ చేయాలని, లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. అయినప్పటికీ ఇప్పటి వరకు రూ. 350 కోట్ల రుణాలను మాత్రమే అందించారు. దీంతో విత్తనాలు మొదలుకొని ఎరువులు, క్రిమిసంహారక మందులతో పాటు వివిధ రకాల పెట్టుబడుల కోసం రైతులు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రైతులకే రుణాలివ్వడానికి వెనుకాడుతున్న బ్యాంకర్లు.. కౌలు రైతులను పూర్తిగా పట్టించుకోవడం లేదు. కొర్రీలు పెడుతూ వారికి పంట రుణాలివ్వడం లేదు. దీంతో కౌలురైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.