రబీకి కన్నీళ్లే!
నేడు ఐఏబీ సమావేశం
కర్నూలు రూరల్: ఈ సారి రబీకి సాగునీరు ఇచ్చే పరిస్థితులు కనిపించడంలేదు. అన్నదాత కష్టాలు తీరేలా లేవు. సాగునీటి కాలువల మరమ్మతులకు పెండింగ్ పనులను రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన మేర నిధులు ఇవ్వకపోవడం దీనికి ఓ కారణం. కాలువలకు కేటారుుంచిన నీటిని తీసుకురావడంలో పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అశ్రద్ధ మరో ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
నేడు ఐఏబీ సమావేశం
సాగు నీటి కాల్వలకు రబీ ఆయకట్టుకు సాగు నీటి విడుదలపై చర్చించేందుకు సోమవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నీటిపారుదల సలహా మండలి సమావేశం జరుగనుంది. ప్రాజెక్టులలో నీటి నిల్వలు లేవనే సాకుతో రబీ ఆయకట్టుకు నీరు ఇవ్వాలని, గత ఐఏబీ సమావేశంలోని తీర్మానాలపై ప్రతిపక్షం చర్చకు పట్టుబడితే తప్పించుకునేందుకు అధికార పార్టీ నేతలు ఎత్తుగడలు వేస్తున్నారు. మీటింగ్‌లో కేవలం అజెండాపై మాత్రమే చర్చించి సమావేశాన్ని ముగించేలా అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. రైతులను నిలువునా ముంచేందుకు కంకణం కట్టుకున్నారు.
కర్ణాటక జలచౌర్యం..
తుంగభద్ర దిగువ కాలువ ద్వారా 16 మండలాల్లోని 192 గ్రామాలకు తాగునీరు, 107615 ఎకరాల రబీకి సాగునీరు అందిస్తుంది. డ్యాంలో నీటి ఆధారంగా ఈ ఏడాది మొదటగా 16.302 టీఎంసీలు ఇవ్వాలని నిర్ణరుుంచారు. తర్వాత ఇటీవల 15.62 టీఎంసీలకు తగ్గించారు. ఇందులో ఇప్పటివరకు 6.2 టీఎంసీలు ఖీరీఫ్‌కు వినియోగించారు. ఇంకా 9.60 టీఎంసీలు ఉండగా వీటిలో తాగునీటికి 4 టీఎంసీలు పోరుుంది.
మిగిలిన 5.60 టీఎంసీల నీటిని ఈ ఏడాది 40 వేల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించనున్నారు. అరుుతే కర్ణాటకలో సుమారు 70 వేల ఎకరాల నాన్ ఆయకట్టు సాగు కోసం జలచౌర్యం ఏడాది కేడాది పెరిగిపోతోంది. దీనివల్ల ఇక్కడి ఆయకట్టుకు మొండి చేరుు మిగులుతోంది. జలచౌర్యంను అడ్డుకునేందుకు ప్రతి ఐఏబీలో తీర్మానాలు చేస్తున్నా ఆచరణకు నోచుకోవడం లేదు. చివరికి నీరందక రైతులకు నష్టాలే మిగులుతున్నాయి.
కేసీ నీటి మళ్లింపు ఉత్తర్వుల రద్దు చేస్తేనే సాగునీరు..
కర్నూలు-కడప కాలువ ఆయకట్టుకు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తుంగభద్ర డ్యాం నిల్వ నీటి నుంచి 10 టీఎంసీలు రావాల్సి ఉంది. పూడిక చేరిందనే కారణంలో ప్రతి ఏటా 6.8 టీఎంసీలే విడుదల చేస్తున్నారు. అదేసమయంలో కేసీకి కేటాయించిన నీటిని అనంతపురం జిల్లా తాగునీటి కోసం పెన్నా అహోబిళం రిజర్వాయర్‌కు 2004లో సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు మొదటగా 5 టీఎంసీల నీటిని, ఆ తరువాత అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో మరో 5 టీఎంసీల నీటి మళ్లింపునకు ఉత్తర్వులు ఇచ్చారు. దీనివల్ల పదేళ్లుగా కేసీ కాల్వ కింద కర్నూలు జిల్లాలో 1,73,627 ఎకరాలు, కడప జిల్లాలో 92,001 ఎకరాల ఆయకట్టు రబీ సీజన్‌లో సాగుకు నోచుకోవడం లేదు.
నీటికోసం అనంత పట్టు..
రబీలో కేసీ ఆయకట్టుకు నీరందదని తెలిసినా అనంతపురం జిల్లాకి చెందిన మంత్రులు, అక్కడి ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి చేసి నీటిని తరలించుకుపోయేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. తొలివిడతగా 3 టీఎంసీల నీటిని మళ్లించుకునేందుకు అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిళ్ళు చేస్తున్నారు. జిల్లాని రైతులకు ఇంత నష్టం జరుగుతున్నా జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం, అధికార పార్టీ ఎమ్మెల్యేలు నోరెత్తకపోవడం గమనార్హం. దీంతో కేసీ రబీ ఆయకట్టుకు సాగు నీరు ప్రశ్నార్థకం కానుంది. మళ్లింపు ఉత్తర్వులు రద్దు చేయిస్తే 0 నుంచి 120 కి.మీ వరకు 20 వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది.
కర్నూలులో కృష్ణా బోర్డు ఏర్పాటుతోనే న్యాయం..
జిల్లాలోని సాగు నీటి ప్రాజెక్టులకు, కాల్వలకు సంవృద్ధిగా సాగు నీరు అందాలంటే కర్నూలులో కృష్ణా బోర్డు ఏర్పాటు చేస్తేనే న్యాయం జరుగుతుందని లేకపోతే భవిష్యత్‌లో మరిన్నిసాగు నీటి కష్టాలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రజాప్రతినిధులు పార్టీలకతీతంగా, అధికారులు ఐఏబీలో కర్నూలులోనే కృష్ణా బోర్డు ఏర్పాటు చేయాలని తీర్మానం చేయాలని పలువురు సాగు నీటి నిపుణులు, ఆయకట్టుదారులు కోరుతున్నారు.
ఇదీ అసలువిషయం..
నీరు ఇవ్వలేమనే విషయాన్ని అధికారులు ఐఏబీలో చెప్పనున్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి పథకం, ఏపీఎస్‌ఐడీసీ కర్నూలు సబ్ డివిజన్ కింద తుంగభద్ర, హగేరి,ఎస్‌ఆర్‌ఎంసీ, కుందూ నదుల కింది నిర్మించిన సుమారు 70 ఎత్తిపోతల పథకాలకు, గురురాఘవేంద్ర ప్రాజెక్టు కింద నిర్మించిన స్కీమ్‌లకు సైతం రబీ ఆయకట్టుకు సాగు నీరు ఇచ్చే అవకాశమేలేదు. గాజులదిన్నె ప్రాజెక్టు కింద ఈ ఏడాది 8 వేల ఎకరాలకు రబీ కింద సాగు నీరుఇచ్చే అవకాశం ఉంది.
నీరిచ్చే అవకాశమే లేదు..
కరువు సీమకు శ్రీశైలం ప్రధాన జల సిరి. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం జలాశయంలో 856 అడుగులు మాత్రమే నీరుంది. శ్రీశైలం జలాశయం నిండక ముందే కృష్ణా డెల్టాలో తాగునీటి కోసమని, కరెంట్ ఉత్పత్తి పేరుతో రోజుకు 70 వేల క్యూసెక్కుల ప్రకారం నీటిని కోస్తా ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నేతలు కుట్ర పూరితంగా తీసుకెళ్లారు. దీనివల్ల తెలుగు గంగ, ఎస్‌ఆర్‌బీసీ, ఎస్కేపు చానల్‌కు సకాలంలో నీరు విడుదల కాలేదు. ఖరీఫ్ పంటల సాగు ఆలస్యమయ్యింది.
ఈ లోపు తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని నీటిని వినియోగించుకోవడం, పంతాలకు పోరుు ఆంధ్రా ప్రభుత్వం సైతం కరెంట్ ఉత్పిత్తికి నీటిని వినియోగించడంతో 20 రోజులకే శ్రీశైలం నీటి నిల్వలు భారీగా పడిపోయాయి. వాస్తవంగా కుడి, ఎడమ గట్టుల నుంచి కరెంట్ ఉత్పత్తి చేస్తూ దిగువన ఉన్న సాగర్‌కు 300 టీఎంసీలు, అత్యవసరం కింద మరో 50 టీఎంసీల నీటిని మాత్రమే వదలాల్సి ఉంది.
అధికారుల నిర్లక్ష్యం, పాలకులకు రైతులపై చిత్తశుద్ధి లేకపోవడంతో అదనంగా ఈ ఏడాది 94 టీఎంసీల నీటిని దిగువకు వదిలేశారు. ఈ కారణంగా తెలుగు గంగ కింద జిల్లాలో 1,03,700 ఎకరాల ప్రతిపాదిత ఆయకట్టు, ఎస్సార్బీసీ సర్కిల్-1 పరిధిలో 1 నుంచి 7బ్లాకుల కింద ఖరీఫ్‌లో 46,857 ఎకరాలు, సర్కిల్-2 పరిధిలోని 8 నుంచి 16 బ్లాకుల కింద 97,460 ఎకరాల ఆయకట్టుకు రబీలో సాగు నీరు ఇచ్చే అవకాశమే లేదు.