రచ్చబండలో నిరసనల హోరు
Published Fri, Nov 15 2013 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM
ఉండి, న్యూస్‌లైన్ : ఉండి మార్కెట్‌యార్డులో గురువారం జరిగిన మూడో విడత రచ్చబండ కార్యక్రమం నిరసనలతో హోరెత్తింది. ఇళ్లస్థలాలు మంజూరు చేయాలంటూ సీపీఎం కార్యకర్తలు ఎంపీ బాపిరాజు, ఎమ్మెల్యే శివరామరాజు, ఆప్కాబ్ వైస్ చైర్మన్ ముత్యాల రత్నంను నిలదీశారు. ఈనేపథ్యంలో అక్కడ ఘర్షణ ఏర్పడి పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో సీపీఎం కార్యకర్తలను, నాయకులను పోలీసులు బలవంతంగా బయటకు లాక్కెళ్లారు. ఈ ఘటనను నిరసిస్తూ ఆందోళనకారులు ఉండి ప్రధాన సెంటర్ వద్ద రాస్తారోకో చేయడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. ఇదిలా ఉండగా సభలో వైసీపీ మండల కన్వీనర్, గ్రామ ఉపసర్పంచ్ ఏడిది వెంకటేశ్వరరావు ప్రజాప్రతినిధుల తీరుపై మండిపడ్డారు.
నియోజకవర్గంలోని సమస్యలు ఎక్కడివి అక్కడే ఉన్నాయని ధ్వజమెత్తారు. ఉండి అక్విడెక్టు నిర్మించేందుకు 2009లో శంకుస్థాపన చేయగా నేటికి అక్విడెక్టు నిర్మించలేదన్నారు. దీనివల్ల మండలంలోని సుమారు 7 గ్రామాల్లో పొలాలు ముంపునకు గురై సార్వా పంటను కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న పంట ఖర్చులకు అనుగుణంగా రుణాలు పంపిణీ చేయడం లేదని, రైతులనుంచి పెద్ద మొత్తంలో బీమా సొమ్ము చెల్లించుకొని ఆ స్థాయిలో నష్టపరిహారం ఇవ్వడం లేదన్నారు. అన్ని వర్గాల వారికి విద్యుత్ చార్జీలు మోయలేని భారంగా మారాయన్నారు. ఉండిలో కళాశాల, కల్యాణ మండపం నిర్మించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా ప్రజాప్రతినిధుల చెవులకు ఎక్కడం లేదని ధ్వజమెత్తారు.
ప్రజాసమస్యలు ఎల్లకాలం ఉండేవి : ఎంపీ బాపిరాజు
ప్రజా సమస్యలు ఎల్లకాలం ఉంటాయని నరసాపురం ఎంపీ కనుమూరి బాపిరాజు అన్నారు. రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇళ్ల స్థలాల సమస్య చాలా జఠిలమైందని, వాటిని పరిష్కరించడం కష్టదాయకమన్నారు. ఆందోళన నిర్వహించి ప్రజాప్రతినిధులను నిలదీసినా చేసేదేమిలేదన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు గుర్తించి తమకు లేదా అధికార బృందానికి తెలియజేస్తే వెంటనే ఆ స్థలాల పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమస్యలనేవి నిత్యం పునరావృతం అవుతాయన్నారు. తాను సమైక్యవాదినే అని ఈ సభలో కూడా తెలియజేశారు. ఆప్కాబ్ ఉపాధ్యక్షుడు ముత్యాల రత్నం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తుందని చెప్పారు.
ఎమ్మెల్యే శివ మాట్లాడుతూ అక్విడెక్టు నిర్మాణం, జూనియర్ కళాశాల కళాశాల స్థాపన వంటి సమస్యలు పరిష్కారానికి కూడా కృషి చేస్తున్నామన్నారు. ఉండి ప్రధాన సెంటర్‌లో ట్రాఫిక్ నియంత్రణకు కాలువపై రెండో వంతెన నిర్మాణానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. రచ్చబండ కమిటీ సభ్యులు చిక్కాల జగదీష్, రుద్రరాజు రంగరాజు, ముదునూరి రమాదేవి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముదునూరి కొండ్రాజు, వైసీపీ టౌన్ అధ్యక్షుడు గుల్లిపల్లి అచ్చారావు, కొత్తపల్లి రమేష్‌రాజు, పొత్తూరి వెంకటేశ్వరరాజు, బీసీ సెల్ మండల కన్వీనర్ కె.శివనాగరాజు, మహిళా విభాగం కన్వీనర్ గడి జయలక్ష్మి, కమతం బెనర్జీ, శేషాద్రి శ్రీను, కాంగ్రెస్ పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్‌చార్జి గాదిరాజు లచ్చిరాజు, ఏఎంసీ వైస్‌ఛైర్మన్ కరిమెరక రామచంద్రరావు, సర్పంచ్ ముదునూరి విజయ, ప్రత్యేక అధికారి ప్రసాద్, ఎంపీడీవో రమాదేవి, ఎంఈవో బీఐఐ న్యూటన్, తహసిల్దార్ వై.దుర్గాకిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement