
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
ప్రొద్దుటూరు : డ్వాక్రా మహిళలను మరో మారు మోసగించి వారి ఓట్లను దండుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు వ్యూహం పన్నారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు.గురువారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2014 ఎన్నికల సందర్భంగా డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని ప్రకటించారు. మహిళలు నమ్మి ఓట్లు వేశారని, అయితే నేటి వరకు వారి రుణాలు మాఫీ కాలేదన్నారు. మాటతప్పి, మడమ తప్పి పారిపోయిన పిరికిపంద కేవలం రుణమాఫీ కాకుండా రుణసాయాన్ని రూ.10వేలు చొప్పున అందజేస్తున్నారన్నారు. డ్వాక్రా గ్రూపునకు రూ.లక్ష చొప్పున మూల నిధిగా ఈ డబ్బు మహిళలకు ఇస్తున్నారని తెలిపారు.
టీడీపీకి ఓట్లు వేస్తే మాఫీ చేస్తామని ప్రకటించి కనీసం వారి డబ్బుకు వడ్డీలు కూడా చెల్లించలేదన్నారు. 2016 నుంచి 2019 వరకు డ్వాక్రా రుణాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రూ.2,579 కోట్లు, వైఎస్సార్ జిల్లాలో రూ.170 కోట్లు, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రూ.9.54 కోట్లు వడ్డీ బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ఇవన్నీ పక్కనపెట్టి చంద్రబాబు కేవలం డ్వాక్రా మహిళలకు రూ.10వేలు ఇచ్చి చేతులు దులుపేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఓట్లు అడుక్కోవడానికి వచ్చినప్పుడు డ్వాక్రా అక్కాచెల్లెమ్మలు గుర్తుకొస్తున్నారా అని ప్రశ్నించారు. డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించి తమ పార్టీ ఎమ్మెల్యేలు ఆర్‌కే రోజా, పుష్పశ్రీవాణి, గౌరు చరితారెడ్డి గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నించగా 2014 నుంచి 2018 వరకు డ్వాక్రా రుణాలు మాఫీ చేయలదేని, అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని స్వయంగా ప్రభుత్వం సమాధానం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
అందని రుణాలు..తప్పని ఇబ్బందులు
చంద్రబాబు రూ.10వేలతోపాటు స్మార్ట్‌ఫోన్ ఇస్తానని ప్రస్తుతం ప్రకటించారని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. డ్వాక్రా రుణాలు అందక ఎంతో మంది మహిళలు ఇబ్బంది పడ్డారని, రుణాలు చెల్లించకపోవడంతో కోర్టు నుంచి చాలా మంది నోటీసులు అందుకున్నారన్నారు. ఇవన్నీ మరచిపోయిన చంద్రబాబు ప్రస్తుతం కేవలం రూ.10వేలు ఇచ్చి, అది కూడా మూడు విడుతలుగా తీసుకోవాలని, స్మార్ట్ ఫోన్ ఇస్తున్నట్లు గొప్పగా చెప్పుకొంటున్నారని తెలిపారు. ఓటును స్మార్ట్ ఫోన్ కోసం , పసుపు కుంకుమ పేరుతో మీరు ఇస్తున్న డబ్బుకు అమ్ముకునేందుకు మహిళలు సిద్ధంగా లేరన్నారు. పసుపు–కుంకుమ గురించి మంత్రి పరిటాల సునీత మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
మద్యం షాపుల రద్దుతోనే మహిళల పసుపు, కుంకుమలు నిలుస్తాయి
టీడీపీ అధికారంలోకి వచ్చాక విచ్చల విడిగా మద్యం షాపులు, బెల్టుషాపులు ఏర్పాటయ్యాయని, వీటి అమ్మకాలకు సంబంధించి ఎక్సైజ్ అధికారులకు చంద్రబాబు టార్గెట్ విధించారని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. ప్రతి నెల రెట్టింపు అమ్మకాలు చేపట్టాలని వారిపై ఒత్తిడి తెచ్చారన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంతోనే మహిళల పసుపు, కుంకుమలు నిలుస్తాయని తెలిపారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దశల వారిగా మద్య నిషేధం అమలు చేస్తామని ప్రకటించారని, దీని వల్ల ఎన్నో కుటుంబాల్లో వెలుగులు వస్తాయన్నారు. ఎన్టీ రామారావు హయాంలో మద్యం నిషేధించడం వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయన్నారు. సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు రాగుల శాంతి, పోసా వరలక్ష్మి, వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, నియోజకవర్గ అధ్యక్షురాలు గజ్జల కళావతి, న్యాయవాది జింకా విజయలక్ష్మి పాల్గొన్నారు.
నిజాలు రాసిన సాక్షిని కాల్చేస్తారా..?
ప్రొద్దుటూరు : నిజాలు రాసిన సాక్షి పత్రికను మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కాల్చడం పట్ల ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం ఇవ్వబోతోన్న పసుపు, కుంకుమ డబ్బును రుణంగా ఇస్తున్నారని సాక్షి పత్రికలో రాసినందుకు ఓర్వలేని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పత్రికలను కాల్చడాన్ని తప్పుపట్టారు. నిత్యం అబద్ధాలు రాయడంతోపాటు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఆంధ్రజ్యోతి పత్రికను తాము ఏమి చేయాలని ప్రశ్నించారు. నిజాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. వాస్తవానికి తనకు జర్నలిజం పట్ల ఎంతో గౌరవం ఉందన్నారు. ఈ కారణంగానే తన పెద్ద కుమార్తెను ఇంజినీరింగ్, డాక్టర్ చేయకుండా జర్నలిజంలో పీజీ చేయించానన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బలిమిడి చిన్నరాజు, మద్దూరి దేవి, ధనలక్ష్మి, షమీమ్‌బాను, మాజీ కౌన్సిలర్లు గరిశపాటి లక్ష్మిదేవి, మల్లికార్జున ప్రసాద్, లక్ష్మీనారయణమ్మ, నిర్మలాదేవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment