సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు
ప్రొద్దుటూరు : ‘నియోజకవర్గంలో చేనేత కార్మికుల జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి? వారి పరిస్థితి ఏమిటి? వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా ఏడాదికి రూ.24 వేలు చొప్పున ఇవ్వబోతున్నాం.. ఈ ఏడాది డిసెంబర్ 21 నుంచి పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డితో అన్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో గురువారం సాయంత్రం 6 గంటలకు ఎమ్మెల్యే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా చర్చించిన అంశాలను ఎమ్మెల్యే ‘సాక్షి’కి వివరించారు. నియోజకవర్గంలో ఎక్కువ మంది చేనేత కార్మికులు ఉండటంతో ప్రత్యేకంగా వారి సంక్షేమం గురించి చర్చించానన్నారు. ప్రొద్దుటూరు పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజి కాలువను మంజూరు చేస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఆర్టీసీ బస్టాండ్ ఆధునికీకరణకు అడిగిన మేరకు రూ.2 కోట్లు మంజూరు చేయిస్తానని సీఎం చెప్పారన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సంబంధించి రోడ్ల విస్తరణకు నిధులు మంజూరు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించే విషయాన్ని సీఎంకు వివరించానన్నారు. అలాగే రైతు భరోసా పథకం, గ్రామ సచివాలయాల పనితీరు గురించి సీఎం అడిగి తెలుసుకున్నారని తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి పనులతోపాటు తన కుటుంబ యోగక్షేమాల గురించి సీఎం అడిగి తెలుసుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని వివరించారు. ఎమ్మెల్యే రాచమల్లు వెంట వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు జింకా విజయలక్ష్మి, వైఎస్సార్‌సీపీ నాయకుడు పోతిరెడ్డి మురళీనాథరెడ్డి, పీఈటి కోనేటి సుధాకర్‌రెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment