మిర్యాలగూడ, న్యూస్‌లైన్: మాధ్యమిక విద్యలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పదవ తరగతి తర్వాత చదువులకు ఫుల్‌స్టాప్ పెట్టే విద్యార్థుల జీవన ప్రమాణాల్లో మార్పులు తేవడానికి విద్యాశాఖ సిద్ధమైంది.
ఆర్థిక, ఇతర కారణాల వల్ల పై చదువులకు వెళ్లలేని వారికి మెరుగైన అవకాశాలు కల్పిస్తూ సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచే డ్రాపౌట్స్‌ను గుర్తించి, వారిలో మార్పు తీసుకువచ్చి ఉన్నత విద్య వైపు మళ్లించేందుకు చర్యలు చేపట్టింది. 2013-14 విద్యా సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 48,811 మంది పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించగా వీరిలో 4023 మంది అంతటితోనే చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టేశారు.
23నుంచి ప్రారంభమైన సమీక్ష సమావేశాలు
ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్ బోర్డు ఉన్నతాధికారులు ఇటీవల సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2013-14లో 10.70 లక్షల మంది విద్యార్థులు పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించగా కేవలం 8.70 లక్షల మంది విద్యార్థులు ఇంటర్‌లో ఉత్తీర్ణులయ్యారు. 70 వేల మంది ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలల్లో చేరగా 1.30 లక్షల మంది ఏ కళాశాలల్లో చేరకుండా డ్రాపౌట్స్‌గా ఉన్నట్లు పరిశీలనలో తేలింది. డ్రాపౌట్స్ విద్యార్థులను వృత్తి విద్య వైపునకు మళ్లించి వారి జీవన ప్రమాణాల్లో మార్పులు తెచ్చేందుకు గాను జిల్లా, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశారు. అందుకు గాను జిల్లాలో డివిజన్‌ల వారీగా ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 23న నల్లగొండ, దేవరకొండ డివిజన్‌లలో సమావేశాలు నిర్వహించగా 25వ తేదీన మిర్యాలగూడ, సూర్యాపేటలలో నిర్వహించారు. 27న భువనగిరి డివిజన్‌లో నిర్వహించనున్నారు.
కమిటీల ఏర్పాటు
జిల్లా విద్యాధికారి, ఇంటర్మీడియట్ రీజనల్ అధికారి (ఆర్‌ఐఓ), జిల్లా ఒకేషన్ విద్యాధికారి, ఆర్‌జేడీలతో జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశారు. మండల స్థాయిలో మండల విద్యాధికారి, ఉప విద్యాధికారి, మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, ఉన్నత పాఠశాలల ప్రధానోపాద్యాయులు కమిటీలో సభ్యులుగా ఉంటారు.
31లోగా జాబితాలు అందజేయాలి
పదవ తరగతిలో ఫెయిల్ అయిన, చదువులు నిలిపి వేసిన విద్యార్థులను మండల స్థాయి కమిటీలు గుర్తించి జాబితా సిద్ధం చేయాల్సి ఉంది. ఈ నెల 31వ తేదీ లోగా జిల్లా స్థాయి కమిటీలకు జాబితా అందజేయాలి. అదే విధంగా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల కోసం కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
కౌన్సెలింగ్ కేంద్రంలో చేయాల్సినవి
ఉత్తీర్ణత ప్రమాణాలను, నాణ్యతను పెంచడం
ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో మంతనాలు చేయడం
డ్రాపౌట్స్ విద్యార్థులను, ఫెయిల్ అయిన వారిని గుర్తించడం
ఫెయిల్ అయిన విద్యార్థులను ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ కోర్సులలో చేర్పించాలి
చదువు నిలిపి వేసిన విద్యార్థులను వృత్తి విద్యా కోర్సుల వైపు ప్రేరేపించి జీవన నైపుణ్యాలను పెంపొందించాలి
సమూల మార్పులు
Published Mon, Jan 27 2014 4:30 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement