గిరిజనులకు ప్రత్యేక ప్రతిపత్తి: రాఘవులు
సాక్షి, హైదరాబాద్: శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకూ ఉన్న గిరిజనులకు ప్రభుత్వం ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో బుధవారమిక్కడ ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో బహిరంగసభ జరిగింది. గిరిజనుల సాగులో ఉన్న అటవీ భూములన్నింటికీ హక్కు పత్రాలివ్వాలని, గిరిజన సాగుదార్లపై ఫారెస్టు అధికారుల దౌర్జన్యాలు అరికట్టాలని, అటవీ హక్కు చట్టం అమలుకోసం జీవో నంబర్ 355ను అమలు చేయాలని.. తదితర డిమాండ్లతో ఈ సభను నిర్వహించారు. రాఘవులు మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాలు కావడం వల్ల గిరిజనులకు ఎలాంటి లాభం జరగబోదన్నారు.
పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల ప్రజల సమస్యలను ఏ రాష్ట్రప్రభుత్వం పట్టించుకుంటుందని ప్రశ్నించారు. గిరిజనులవైన ఖనిజాలు, అటవీ వనరులపై బహుళజాతి సంస్థల కన్నుపడిందని, వారికి ప్రభుత్వాలు వంత పలుకుతున్నాయని ధ్వజమెత్తారు. అందుకే గిరిజనుల్ని ఆయా ప్రాంతాలనుంచి వెళ్లగొడుతున్నారని తెలిపారు. చట్టవిరుద్ధంగా వన సంరక్షణ సమితులకు రాష్ట్రప్రభుత్వం కేటాయించిన 10 లక్షల ఎకరాల అటవీ భూముల్ని రద్దు చేసి వాటిని గిరిజనులకే చెందేలా చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీలు మధు, మిడియం బాబూరావు, మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య, కొలక లక్ష్మణమూర్తి, గిరిజన సంఘం అధ్యక్షుడు గుగులోతు ధర్మానాయక్ తదితరులు పాల్గొన్నారు.