
రుణాలు మాఫీ చేయకుంటే నిలదీస్తాం
మాడుగుల రూరల్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అందరికీ వ్యవసాయ రుణాల మాఫీ వర్తింపచేయాలని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్‌చేశారు. సోమవారం ఎం.కోటపాడు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల హామీలు నెరవేర్చకపోతే ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడతామని హెచ్చరించారు. గత నెలలో సంభవించిన తుపానుకు 64 మంది మృతిచెందితే వీరికి పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించలేదన్నారు.
క్షతగాత్రులైన 190 మందికి రూ.50 వేల వంతున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ఏడాది తుఫాన్ వలన పంట నష్టపోయిన రైతాంగానికి రూ.134 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు కావలసి ఉందన్నారు. గత ప్రభుత్వం 7 లక్షల మంది కౌలు రైతులకు రుణాలివ్వగా, ఈ ప్రభుత్వం కౌలు రైతులకు రుణాలు ఇవ్వలేదని విమర్శించారు. విలేకరుల సమావేశంలో మాజీ మంత్రులు బాలరాజు, కోండ్రు మురళి, స్థానిక నాయకులు శానాపతి గంగాధర్ కొండలరావు, బొడ్డపాటి శ్రీరాంమూర్తి తదితరులు పాల్గొన్నారు.
బాధితులకు చేయూతలో ప్రభుత్వం విఫలం
బుచ్చెయ్యపేట: హుద్‌హుద్ తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి అన్నారు. ఆయన సోమవారం మండలంలోని వడ్దాది నాలుగు రోడ్లు సెంటర్‌లో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, రాజీవ్ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట మాజీ మంత్రులు కోండ్రు మురళి, పి.బాలరాజు, సీడీసీ చైర్మన్ దొండా రాంబాబు తదితరులు ఉన్నారు.